సుధ ఇంట్లో ఆరుగురు ఉంటారు. భర్త, అత్తగారు, మామగారు, సుధ, కొడుకు, కూతురు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు సుధకు విశ్రాంతి ఉండేది కాదు. వంట, అంట్లు, బట్టలు, ఇంటిని ఊడ్చడం, పిల్లలను స్కూలుకు పంపడం.. అన్నీ తనే చేస్తుంది. మిగిలిన ఐదుగురు ‘ఆమే చేస్తుందిలే’ అని టీవీ చూస్తూ కూర్చునేవారు. ఒకరోజు సుధకు విపరీతమైన జ్వరం వచ్చింది. లేవలేని పరిస్థితి. ఉదయం 7 అయింది. ఎవరికీ కాఫీ లేదు. పిల్లలకు స్కూల్ యూనిఫామ్ ఉతకలేదు. సుధ భర్త కుమార్ విసుక్కుంటూ నిద్ర లేచాడు. ‘అమ్మా, నువ్వు లేచి కాఫీ పెట్టవా?’ అని కుమార్ వాళ్ల అమ్మను లేపాడు. ‘నాకు ఓపిక లేదు నాయనా! మంచం మీద ఉన్న మీ నాన్నకు సపర్యలు చేసి చేసి నాకు నీరసం వస్తోంది. అయినా కోడలు లేవకపోతే ఏం? మీరు ఉన్నారు కదా! ఈ రోజూ తను చేసే పనులు మీరు చేసుకోండి’ అని అత్తగారు అంది.
సుధ కూతురు సిరి, కొడుకు సురేష్ ఇద్దరూ వంటగదిలోకి వెళ్లారు. వాళ్లతో పాటే సుధ భర్త కూడా వెళ్లాడు. ముగ్గురు కలిసి వంటింట్లో పనులు చేసుకున్నారు. ఆ తరువాత సురేష్ ఇల్లు ఊడ్చాడు. సిరి బట్టలు మడత పెట్టింది. కుమార్ కూరగాయలు తెచ్చాడు. అత్తగారు పిల్లలకు అన్నం కలిపి పెట్టింది. సిరి, సురేష్ స్కూలుకు, కుమార్ ఆఫీసుకు వెళ్లారు. సాయంత్రానికి అందరూ ఇల్లు చేరారు. కానీ ఎప్పుడూ లేనిదీ ఆ రోజు అందరికీ చాలా అలసటగా అనిపించింది. ‘ఒక్కరోజుకే ఇంత అలసిపోయాం. సుధ రోజూ ఎంత కష్టపడుతుందో ఇప్పుడే తెలిసింది’ అని కుమార్ మనసులో అనుకున్నాడు. ఆ రోజు రాత్రి భోజనాలప్పుడు పిల్లలతో ఇదే విషయం చెప్పాడు. భోజనాలయ్యాక అందరూ సుధ చుట్టూ కూర్చున్నారు. ‘అమ్మా, నువ్వు త్వరగా కోలుకోవాలి. ఇకపై మేము కూడా రోజూ నీకు సాయం చేస్తాం’ అని సిరి, సురేష్ సుధతో చెప్పారు. కుమార్ పిల్లలతో అలా చెప్పించాడని సుధకు అర్థమైంది. మరుసటి రోజు నుండి ఆ ఇంట్లో ఒక కొత్త రూల్ వచ్చింది. ఎవరి పని వారు చేసుకుంటున్నారు. ఇంటి పనిని అందరూ కలిసి పంచుకుంటున్నారు.
నీతి : అమ్మ పని అంటే ఆమె ఒక్కరి బాధ్యత కాదు, అది కుటుంబం మొత్తం బాధ్యత.
- యం. రాం ప్రదీప్,
జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు,
94927 12836.







కామెంట్‌లు (0)