రాష్ట్రంలో పారా మెడికల్, అలైడ్ హెల్త్ సైన్సెస్ విద్యార్థులు కొంత కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర విద్యా, వైద్య విద్యా వ్యవస్థలోని లోపాలను స్పష్టంగా బయటపెడుతున్నాయి. నిర్ణీత కాలంలో పూర్తికావాల్సిన కోర్సులు పరీక్షల నిర్వహణలో జాప్యం, ఫలితాల విడుదలలో ఆలస్యం, అకడమిక్ క్యాలెండర్లో అనిశ్చితి వంటి కారణాలతో సంవత్సరాల తరబడి కొనసాగుతున్న పరిస్థితి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. నాలుగేళ్ల కోర్సు పూర్తిచేసుకుని ఉన్నత విద్య, ఉద్యోగాల వైపు వెళ్లాల్సిన విద్యార్థులు పాలనాపరమైన జాప్యాల కారణంగా సంవత్సరాల తరబడి విద్యాసంస్థల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడటం విచారకరం.
పారా మెడికల్ విద్యార్థుల సమస్యను కేవలం స్టైపెండ్ కోసం జరుగుతున్న ఆందోళనగా చూడటం సరికాదు. విద్యార్థుల విద్యా హక్కు, సమయానికి కోర్సు పూర్తిచేసుకునే హక్కు, ఇంటర్న్‌షిప్‌కు తగిన గుర్తింపు, ఆర్థిక భద్రత, భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విస్తృత సమస్య ఇది. ఒక విద్యార్థి నిర్ణీత కాలంలో తన విద్యను పూర్తిచేసుకుని ఉద్యోగం పొందాలని లేదా ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించడం సహజం. అయితే విశ్వవిద్యాలయం, ప్రభుత్వ శాఖల పాలనా జాప్యాల కారణంగా కోర్సు కాలం పెరిగితే దాని ప్రభావం విద్యార్థి జీవితంలోని అనేక అంశాలపై పడుతుంది. ఉద్యోగ నియామకాల వయో పరిమితులు, ఉన్నత విద్య ప్రవేశాలు, పోటీ పరీక్షలు, కుటుంబ ఆర్థిక పరిస్థితి వంటి అంశాలన్నింటిపైనా ఈ జాప్యం ప్రభావం చూపుతుంది. తమ తప్పు లేకుండా... పాలనా వైఫల్యాలకు విద్యార్థులే మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఉండకూడదు.
ఇంటర్న్ షిప్ విషయంలోనూ ప్రభుత్వం, సంబంధిత విశ్వవిద్యాలయ అధికారులు స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇంటర్న్ షిప్ విద్యలో భాగమే అయినప్పటికీ, ఆసుపత్రుల్లో విద్యార్థుల నుంచి బాధ్యతాయుతమైన సేవలు తీసుకుంటూ వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందించకపోవడం పట్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థులు ఇంటర్న్ షిప్ సమయంలో ప్రయాణం, ఆహారం, వసతి తదితర ఖర్చులను భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యా కాలం అనవసరంగా పొడిగించబడిన పరిస్థితుల్లో ఈ అదనపు ఆర్థిక భారం కుటుంబాలపై పడుతోంది. అందువల్ల ఇంటర్న్ షిప్ చేస్తున్న పారా మెడికల్ విద్యార్థులకు నెలకు రూ.15 వేల స్టైపెండ్ చెల్లించాలన్న డిమాండ్‌పై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 2021 బ్యాచ్ విద్యార్థులు ఎదుర్కొన్న దీర్ఘకాలిక జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని గత ఇంటర్న్ షిప్ కాలానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి.
పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి, ఫలితాలు ఎప్పుడు ప్రకటించాలి, ఇంటర్న్ షిప్ ఎప్పుడు ప్రారంభించాలి, కోర్సు ఎప్పుడు పూర్తవుతుంది అనే అంశాలపై స్పష్టమైన అకడమిక్ క్యాలెండర్ ఉండటం ఏ విద్యాసంస్థకైనా ప్రాథమిక బాధ్యత. విద్యార్థులు పరీక్షలకు సిద్ధంగా ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహించకపోవడం, పరీక్షలు నిర్వహించిన తరువాత ఫలితాలను విడుదల చేయడంలో జాప్యం చేయడం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో పారా మెడికల్ విద్యార్థుల విద్యా సంవత్సరాలను సక్రమంగా నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. పరీక్షలు, ఫలితాలు, ఇంటర్న్ షిప్, ధ్రువపత్రాల జారీ వంటి ప్రతి అంశానికి నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించి దాన్ని కచ్చితంగా అమలు చేయాలి.
విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వం, విశ్వవిద్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు నిర్వహించడం సహజం. ఇటువంటి సందర్భాల్లో సమస్యను పరిష్కరించేందుకు చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థుల సమస్యలపై చర్చించకుండా కేవలం ఆందోళనలను అణచివేసే చర్యలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమస్య పరిష్కారం కాదు.
రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థలో పారా మెడికల్, అలైడ్ హెల్త్ సైన్సెస్ సిబ్బంది కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వైద్యులు, నర్సులతో పాటు ప్రయోగశాలలు, డయాగ్నస్టిక్ సేవలు, వివిధ క్లినికల్ విభాగాలు, ఆరోగ్య సాంకేతిక సేవల్లో శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బంది అవసరం ఎంతో ఉంది. అలాంటి మానవ వనరులను తయారు చేసే విద్యా వ్యవస్థలోనే అనిశ్చితి, జాప్యం కొనసాగితే భవిష్యత్తులో ఆరోగ్య సేవలపైనా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి పారా మెడికల్ విద్యను ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో చూడాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, వైద్య విద్యాశాఖ, ఆరోగ్య శాఖలు సమన్వయంతో పారా మెడికల్ విద్యార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఈ సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య రంగానికి అవసరమైన నైపుణ్యవంతమైన మానవ వనరులను గౌరవించినట్లు అవుతుంది. అందువల్ల ఇప్పటివరకు ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకువచ్చి, పారా మెడికల్ విద్యార్థుల సమస్యలకు స్పష్టమైన పరిష్కారం చూపడం ప్రభుత్వ బాధ్యత. విద్యార్థుల గోడు ఇకనైనా వినాలి; హామీలు ఆదేశాలుగా, ఆదేశాలు అమలుగా మారినప్పుడే వారికి నిజమైన న్యాయం జరుగుతుంది.
- వ్యాసకర్త: - అక్బర్
ఎస్.ఎఫ్.ఐ తిరుపతి జిల్లా కార్యదర్శి







కామెంట్‌లు (0)