- ‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స్ పేజీ’ని నిలిపివేసిన మెటా
ప్రజాశక్తి - అమరావతి : క్షేత్రస్థాయిలో శాంతియుత ఆందోళనలపై ఉక్కుపాదం మోపుతున్న పాలకులు అటు సామాజిక మాధ్యమాల్లోనూ అణిచివేత చర్యలకు పాల్పడుతున్నారు. ప్రయివేటు దోపిడికి వ్యతిరేకంగా కానీ, సామాజిక, పర్యావరణ అంశాలపై కానీ ఏ చిన్న ప్రభావిత పోస్టు కనిపించినా..పేజీ కనిపించినా వెంటనే నిలుపుదల చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్తలు ‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స్’ అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీ నిర్వహిస్తున్నారు. అనతికాలంలోనే ఈ పేజీ అత్యంత ప్రజాదరణ పొందింది. రెండు నెలల స్వల్పకాలంలో 56 లక్షల మంది పైగా ఈ పేజీని వీక్షించారు. 11,800 మంది ఫాలో చేశారు. అయితే ఇప్పుడు ఈ పేజీని భారత్‌లో నిలిపివేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ యాజమాన్య సంస్థ అయిన మెటా శనివారం నాడు పేజీ నిర్వాహకులకు తెలియజేసింది. కేంద్ర సమాచార సాంకేతిక నియమాల ప్రకారం చట్టపరమైన అవసరాలకు అనుగుణంగా భారత్‌లో ‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స్’ పేజీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. విశాఖపట్నం, పరిసర ప్రాంతాలలో ఎఐ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల సామాజిక, పర్యావరణ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ పేజీలో పోస్టులు పెడుతున్నారు. డేటా సెంటర్ల కారణంగా పర్యావరణం ప్రధానంగా జలవనరులు ఏ విధంగా దెబ్బతింటాయో తెలియజేస్తూ వివిధ అధ్యయనాల సారాంశాన్ని పోస్టు చేస్తున్నారు.
ఈ అంశాలన్నీ ప్రజలను ఆలోచింపజేస్తూ ప్రభావితం చేస్తున్నాయని భావించిన అధికార యంత్రాంగం వెంటనే రంగంలోకి దిగి సెన్షార్‌షిప్‌కు పాల్పడిందని సామాజిక కార్యకర్తలు విమర్శించారు. ఈ పేజీ ప్రారంభం నుంచే తమకు మెటా నుంచి ఆంక్షలు, పరిమితులు మొదలయ్యాయని, తొలుత 9 పోస్టులకు మించి అనుమతించేవారు కాదని పేర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా పేజీనే మొత్తంగా నిలిపివేశారని, ఈ డేటా సెన్సార్‌షిఫ్ మానుకోవాలని కోరారు. కాగా భారత్‌లో ఎఐ డేటా సెంటర్ల రంగంలో అదానీ వంటి పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు కార్యాకలాపాలు నిర్వహిస్తున్న కారణంగా ఏ చిన్నపాటి విమర్శలు వచ్చినా..సామాజిక మాధ్యమాల్లో వాటిని కనుమరగయ్యేలా చేస్తున్నారు. ఇందులో వివిధ సంస్థలు , వ్యక్తిగత ఖాతాల నుండి వందకు పైగా పోస్టులు, విచిత్రంగా, ఒక విలేకరుల బృందం రూపొందించిన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ వంటివాటిని ఇదివరకే నిలిపేశారు.
ఇప్పుడు ఒక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పూర్తిగా నిరవధిక కాలం పాటు తొలగించడం ఇదే మొదటిసారి. డేటా సెంటర్లపై ప్రజల అభిప్రాయాలను, సలహాలను స్వీకరిస్తామని, అర్థవంతమైన చర్చలను స్వాగతిస్తామని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన మాటలన్నీ ‘స్టాప్ వైజాగ్ డేటా సెంటర్స్’ పేజీ నిలిపివేతతో డొల్ల అని తేలిపోయింది. అలాగే విమర్శనాత్మక స్వరాలను అణచివేయడం అటు కేంద్ర బిజెపి పాలకులకు, ఇటు దానితో అంటకాగుతున్న రాష్ట్ర టిడిపి కూటమి పాలకులకు నిత్యకృత్యంగా మారిందన్న విమర్శలొస్తున్నాయి.







కామెంట్‌లు (0)