శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశవ్యాప్తంగా 15 శాతం లోటు వర్షపాతం

1 గంట క్రితం

india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 01:29 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

@మొదలైన నైరుతి రుతుపవనాల తిరోగమనం

న్యూఢిల్లీ : ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల కాలం (జూన్‌ 4 నుంచి సెప్టెంబరు 19 వరకు)లో 15 శాతం మేర వర్షపాతం లోటు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. కేరళలోకి ఈ ఏడాది జూన్‌ 4న ప్రవేశించిన నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలైందని, 19న శుక్రవారం నాడు రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళ్లినట్లు ఐఎండి పేర్కొంది. సాధారణంగా సెప్టెంబర్ 17 నాటికే రాజస్థాన్ నుంచి ఈ నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ ఏడాది 2 రోజులు ఆలస్యంగా తిరోగమనం ప్రారంభమైందని తెలిపింది. ఐఎండి ప్రకారం రాబోయే 3 నుంచి 4 రోజుల్లో రాజస్థాన్‌లోని ఇతర ప్రాంతాలతో పాటుగా పంజాబ్, కచ్, సౌరాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ రుతుపవనాలు వెనక్కి వెళ్లడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 4న కేరళలోకి తొలుత నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తర్వాత క్రమక్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాయి. జులై 9 నాటికి దేశం మొత్తం రుతుపవనాలు వ్యాపించాయి. ఇప్పుడు సెప్టెంబర్ మూడో వారంలో పశ్చిమ రాజస్థాన్ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైంది. అయితే ఈ సారి నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశవ్యాప్తంగా వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. ఐఎండి డేటా ప్రకారం జూన్ 4 నుంచి సెప్టెంబర్ 19 వరకు దేశవ్యాప్తంగా చూస్తే వర్షపాతం లోటు 15 శాతంగా ఉంది. వర్షపాతం లోటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో దక్షిణ ద్వీపకల్పం ఉంది. దేశంలోనే అత్యధికంగా ఇక్కడ ఏకంగా 29 శాతం లోటు వర్షపాతం నమోదైంది. కాగా రుతుపవనాల సీజన్‌లో ఇప్పటివరకు జులై నెలలో మాత్రమే సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షపాతం (మిగులు) నమోదైంది. జులై నెలలో సగటు సాధారణ వర్షపాతం 280.5 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది జులైలో ఏకంగా 283.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంతకుముందు జూన్ నెలలో పరిస్థితి భిన్నంగా ఉంది. వాస్తవానికి రుతుపవనాలే పలు ప్రాంతాల్లో కాస్త ఆలస్యంగా వచ్చాయంటే, వర్షాలు కూడా అంతంత మాత్రంగానే కురిశాయి. సాధారణంగా జూన్‌లో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 106.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. దీంతో జూన్ నెలలో దేశవ్యాప్తంగా చూస్తే 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. గత నెల ఆగస్టులో కూడా పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవు. ఆగస్ట్ 31న ఐఎండి నెలవారీగా విడుదల చేసే డేటా ప్రకారం చూస్తే ఆగస్టులో దేశవ్యాప్తంగా 213.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2001 తర్వాత ఆగస్ట్ నెలలో నమోదైన ఏడో అత్యల్ప వర్షపాతం ఇదే కావడం గమనార్హం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్