సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆపదలో సాయం

4 గంటల క్రితం

monkey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సుందరమను అడవి యుండె

అందు ఒక్క ఉడుత ఉండె

అది ఆహారము కొరకును

ఆ దారిన వెదకుచుండె


ఆహారము దొరకదాయె

ఆకలింక ఎక్కువాయె

ఆ ఉడుత తాళలేక

తిండి కొరకు చూసెనాయె


చివరకు అది చెట్టునెక్కె

అచట ఉడుత తిండి మెక్కె

చెట్టు క్రింద నక్కను గని

కొమ్మ వెనుక వెళ్లి నక్కె


నక్క ఎటో వెళ్లిపోయె

ఉడుత సంతసించెనాయె

శత్రువు పోయిందనుచును

అది చిందులు వేసెనాయె


జాగ్రత్తగా ఉండదాయె

దాని పట్టు తప్పిపోయె

క్రిందనున్న కొలనులోన

దభీమనుచూ పడెనాయె


ఉడుత నీట ఉండలేదు

ఆపదనూహించలేదు

ఆ కొలను సమీపాన

ఎవ్వరినీ అది ఎరుగదు


అది మిక్కిలి భీతిల్లెను

ప్రాణభయముతో అరచెను

అచటున్న వాటినంత

రమ్మనుచూ అది పిలిచెను


దాని పిలుపు వినెను కోతి

సాయమంటే తనకు ప్రీతి

వెళ్లుచున్న తాబేలును

పిలిచి చూచె తనదు రీతి


తాబేలూ వచ్చెనంత

కోతి చెప్పె సంగతంత

వెంటనే ఆ తాబేలు

కొలనులోకి వెళ్లెనంత


చివరికది దాన్ని చూసె

నీటి నుండి దాన్ని తీసె

తన వీపున మోయుచునూ

ఒడ్డుపైన తెచ్చి వేసె


ఆ ఉడుతయు సంతసించె

తాబేలును ప్రశంసించె

ఈ కోతి సాయమునకు

దానినెంతో నుతియించె


ఉడుతను గని తాబేలును

దాని తోడ ఇట్లనియెను

"ఓ ఉడుతా! భయపడకుము,

ముప్పు తప్పిపోయె" ననెను


తల్లి ఉడుత అటకు వచ్చె

తాబేలు దయను మెచ్చె

కోతి చేసిన సాయం

దానికెంతగానో నచ్చె


కోతి ఉడుత కనుల గాంచె

తల్లినేమో పలకరించె

"నీ వెంబడి ఈ ఉడుతను

కొనిపొమ్ము"ని అప్పగించె


పిల్లలార! తెలిసికొనుము

సాయమంటే కడు ఘనము

మీకు శక్తి లేకున్నను

పరుల పిలిచి సాయపడుము

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య

ధర్మపురి

99085 54535



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్