నరసింహపురంలో ధర్మయ్య అనే ఒక వృద్ధుడు పెద్ద కూరగాయల మూటను నెత్తిన పెట్టుకొని సంతకు బయలుదేరాడు. ఇంతలో వెనుక నుండి ఒక ఆంబోతు పరిగెత్తుకొని వస్తోంది. ఎవరో వెనుక నుండి "జరగండి..జరగండి "అని కేకలు వేయడంతో ఆ వృద్ధుడు కంగారుపడి తత్తర పాటుతో పక్కన ఉన్న ఒక అరటి తొక్క పై కాలు వేశాడు. అంతే వెంటనే జర్రున జారి కింద నేలపై పడిపోయాడు. ఆ ఆంబోతు అతని ముందు నుండే వేగంగా పరిగెత్తుతూ వెళ్లిపోయింది. ఆ వృద్ధునికి దెబ్బలు ఏమీ తగలలేదు. కానీ ఆ మూట చిరిగి అందులోని కూరగాయలన్నీ కింద చెల్లాచెదురుగా పడిపోయాయి. వెంటనే అక్కడ ఉన్న దయాశాలి రామయ్య వచ్చి, అతనిని పైకి లేపి, ఒకచోట కూర్చుండబెట్టి అతనికి కొన్ని నీళ్లను తాగించాడు. అతని కూరగాయలన్నీ ఒక బుట్టలో ఎత్తుదామని అక్కడే బుట్టతో నిలుచున్న యువకుడైన శరభయ్య వద్దకు వెళ్లి అతనిని బుట్టను ఇమ్మని అడిగాడు. ఆ శరభయ్య కూడా రోజూ సంతకు వెళ్లి, తన కూరగాయలను అమ్ముతాడు. శరభయ్య కరాకండిగా తన బుట్టను ఇవ్వనని చెప్పాడు. రామయ్య ఆశ్చర్యపోయాడు. తర్వాత రామయ్య మరొక వ్యక్తి దగ్గర నుండి బుట్ట తీసుకొని వచ్చి, ఆ కూరగాయలను అందులో ఎత్తి పెట్టాడు.
ఇంతలో శరభయ్య కొడుకు అక్కడికి వచ్చి ‘నాన్నా! నాన్నా ఈ రోజు నేను అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాను తెలుసా! నేను ఈరోజు బతికేవాడినే కాదు’ అని అన్నాడు. అది విన్న శరభయ్య ‘అయ్యో ఏమైంది బాబూ?’ అని ప్రశ్నించాడు. ‘నేను నా మిత్రులతో ఆడుకొనడానికి ఊరవతలికి వెళ్లాను. అక్కడ దాహం వేసి ఒక ఏటిలో దిగాను. ఇంతలో ఆకస్మికంగా ఆ ప్రవాహ వేగం పెరిగి, నేను ఏటిలో కొట్టుకొని పోతుంటే నా మిత్రులు ‘‘కాపాడండి.. కాపాడండి ’’ అని గట్టిగా అరిచారు. కొంత దూరంలో కూరగాయల తోటలో పని చేసుకుంటున్న ఒక వృద్ధుడు నన్ను వెంటనే ఆ ఏటిలోకి దూకి కాపాడాడు ’ అని చెప్పాడు. ‘అయ్యో అలాగా! ఆ వృద్ధుడు ఎవరో నీకు ప్రాణభిక్ష పెట్టాడు రా! అతడు ఎవరో చెప్పు. ఇప్పుడే అతని ఋణం తీర్చుకుంటాను’ అని అన్నాడు శరభయ్య.
అది విన్న రామయ్య ‘అతడు ఎవరో చెప్పు బాబూ’ అని అన్నాడు. ‘అతడు ఎవరో కాదు నాన్నా! ఇదిగో ఇక్కడ కూరగాయల మూటతో కిందపడిన ఈ వృద్ధుడే! ఈయన ఆ తర్వాత ఇక్కడ సంతకు బయలుదేరాడు. నేను ఈ సంగతి నీకు చెబితే నీవు తిడతావని ఆలస్యంగా వచ్చాను’ అని అన్నాడు.
అది విన్న రామయ్య ‘చూశావా శరభయ్యా! ఆ వృద్ధుడు కిందపడితే నీవు చూసి కూడా సాయం చేయలేదు. సరికదా బుట్టని ఇమ్మంటే కూడా ఇవ్వలేదు. అతడు నీ కొడుకు ప్రాణాన్ని ఆ వయసులో కూడా కాపాడాడు. నీవు వృద్ధుల పట్ల కనికరం చూపడం నేర్చుకో!’ అని అన్నాడు.
అది విన్న శరభయ్య ‘తాతా! నన్ను మన్నించు. నాకు సాయం చేసే శక్తి ఉండి కూడా నేను నీకు చేయలేదు. నా బిడ్డను మాత్రం నీవు కాపాడావు. నీ కూరగాయలను నేను ఈరోజు అమ్మి పెడతాను’ అంటూ అతనికి డబ్బుని ఇవ్వబోయాడు.
తాత ఆ డబ్బును నిరాకరించి ‘బాబూ! నా స్థానంలో ఎవరున్నా అదే పని చేస్తారు. నీవు బుట్టను యివ్వనంత మాత్రాన నాకు నీ పైన కోపం లేదు. కానీ సాటి మనిషిని ఆదుకునే మానవత్వం అందరికీ ఉండాలి. నేను నీ కొడుకుకు సాయం చేసినందువల్లనే కాబోలు నాకు దెబ్బలేమీ తగులకుండా క్షేమంగా ఆ ఆంబోతు నుండి బయటపడ్డాను’ అని అన్నాడు.
అప్పుడు రామయ్య ‘తాతా! ఈ కూరగాయలు ఈరోజు ఇతనికి అప్పగించు. వాటిని ఇతడు రోజూ అమ్మి నీకు డబ్బును ఇస్తాడు తీసుకో! అంతేకాదు. నీవు విశ్రాంతి తీసుకో’ అని అన్నాడు. శరభయ్య సంతోషంతో ‘తాతా! ఇలాగైనా నా ఋణం తీర్చుకునే అవకాశాన్ని నాకు కల్పించు’ అని వేడుకున్నాడు. సరేనన్నాడు తాత.
సంగనభట్ల చిన్న రామకిష్టయ్య
9908554535








కామెంట్‌లు (0)