ఒక రోజు జున్నుబాబు ఇంటి అరుగుపై దిగులుగా కూర్చున్నాడు. అది గమనించిన లచ్చవ్వ, “ఏమైంది బాబూ?” అని అడిగింది. “మా స్కూల్లో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం ఉంది. ఆ సమావేశంలో ప్రదర్శించడానికి నా స్నేహితులు పాటలు, నాట్యాలు, బొమ్మలు నేర్చుకుంటున్నారు. నాకు అలాంటివి రావు” అని జున్నుబాబు బాధపడ్డాడు.
లచ్చవ్వ నవ్వుతూ, “అందరికీ ఒకే ప్రతిభ ఉండదు. నువ్వు చక్కగా కథలు చెబుతావు. ఒక మంచి నీతి కథ చెప్పు. అందరూ మెచ్చుకుంటారు. భయపడకు. కొంచెం సాధన చేస్తే ఆత్మవిశ్వాసం వస్తుంది” అని ప్రోత్సహించింది. లచ్చవ్వ చెప్పినట్లే సాధన చేసిన జున్నుబాబు, సమావేశం రోజున ధైర్యంగా వేదికపైకి వెళ్లి కథ మొదలుపెట్టాడు.
“అనగనగా ఒక పెద్ద అడవి. అక్కడి బడిలో తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం జరిగింది. జంతువులు, పక్షులు వాటి పిల్లలతో హాజరయ్యాయి. పిల్ల నెమలి నాట్యం చేసింది. పిల్ల కోయిల పాట పాడింది. పిల్ల కోతి విన్యాసాలు చేసింది. అందరూ తమ ప్రతిభను ప్రదర్శించారు. పిల్లల ప్రతిభను చూసి తల్లిదండ్రులు ముగ్ధులయ్యారు. చివరగా న్యాయనిర్ణేతలు వానపాముకు ప్రత్యేక బహుమతి ప్రకటించారు. ‘ఇది ఏ ప్రదర్శన చేయలేదే!’ అని జంతువులు ఆశ్చర్యపడ్డాయి. అప్పుడు న్యాయనిర్ణేతలు చిరునవ్వుతో, “ఈ రోజు పిల్లలు తమ ప్రతిభను చక్కగా చూపించారు. అయితే ప్రకృతికి నిశ్శబ్దంగా సేవ చేసే జీవులను కూడా గౌరవించాలి. అందుకే వానపామును ప్రత్యేక బహుమతికి ఎంపిక చేశాం. ఇది మట్టిని సారవంతం చేసి చెట్లు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. అడవి పచ్చదనాన్ని కాపాడడంలో దీని పాత్ర ఎంతో గొప్పది” అన్నారు. అందరూ చప్పట్లు కొట్టి వానపామును అభినందించారు. కానీ ప్రశంసలకు పొంగిపోకుండా వానపాము తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. కథ ముగియగానే సభ మొత్తం చప్పట్లతో మార్మోగింది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు జున్నుబాబును అభినందించారు.
ఇంటికి వచ్చిన జున్నుబాబుతో లచ్చవ్వ, “బాబూ! ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. కనిపించని గొప్పతనమే కొన్నిసార్లు ప్రపంచానికి ఎక్కువ మేలు చేస్తుంది” అంది. జున్నుబాబు చిరునవ్వుతో తల ఊపాడు.
నీతి: ప్రతి ఒక్కరి ప్రతిభ విలువైనదే. కనిపించని సేవ కూడా గొప్పదే.
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
94945 24445







కామెంట్‌లు (0)