సోమవారం, 26 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమేఘాల్లో రాక్షసుడా!

1 రోజు క్రితం

మేఘాల్లో రాక్షసుడా! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 03:35 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

సాయంత్రం 4 గంటలు. బడి వదిలాక చిన్ను ఆకాశం వైపు చూశాడు. ఒక్కసారిగా ‘అమ్మో! రాక్షసుడు!’ అని అరిచాడు. ఆకాశంలో మేఘాలు పెద్ద నోరు తెరిచిన రాక్షసుడిలా, రెండు కొమ్ములతో భయంకరంగా కనిపిస్తున్నాయి. చిన్ను వణికిపోయాడు. పరిగెత్తుకుని ఇంటికి వెళ్లి, ‘ఆకాశంలో రాక్షసుడు ఉన్నాడు, మనల్ని తినేస్తాడు!’ అని ఏడ్చాడు. నాన్న నవ్వి, బయటకు తీసుకొచ్చి, ‘ఎక్కడరా రాక్షసుడు? అది మేఘమే కదా!’ అన్నాడు. ‘లేదు నాన్న, నిజంగా రాక్షసుడే, నాకు కళ్ళు, నోరు కనిపిస్తున్నాయి’ అన్నాడు చిన్ను. అప్పుడు నాన్న ‘అక్కడ ఏ రాక్షసుడు లేడురా చిన్ను, నీకు కలిగిన ఈ భావనను ‘పేరీడోలియా’ అంటారు’ అని చెప్పాడు. ‘అంటే ఏమిటి నాన్న’ అని అయోమయంగా ముఖం పెట్టి చిన్ను అడిగాడు.

‘మన మెదడు ఒక సూపర్ కంప్యూటర్... యాదృచ్ఛికంగా ఉన్న ఆకారాలలో, మచ్చలలో, మేఘాలలో మనకు తెలిసిన ఆకారాన్ని ముఖ్యంగా మనిషి ముఖాన్ని ఊహించుకోవడాన్నే పేరీడోలియా’ అంటారు అన్నాడు నాన్న.. ఈసారి చిన్ను భయంగా ముఖం పెట్టి.. ‘అంటే అదేమైనా మాయ నాన్న’ అన్నాడు. ‘కాదు చిన్ను.. మేఘాలు నిజంగా రాక్షసుడు కాదు. గాలి వాటిని అటు ఇటు నెడుతోంది. వాటి నీడలు, వెలుతురు మనకు అలా అనిపించేలా చేశాయి. నీ మెదడు భయంతో ఉంది కాబట్టి, ఆ యాదృచ్ఛిక ఆకారాన్ని "రాక్షసుడు" అని అనుకుంది. అదే సంతోషంగా ఉంటే, అదే మేఘం మరోలా కనిపించవచ్చు’ అని నాన్న చాలా ఓపికగా వివరించాడు. అప్పుడు చిన్ను మళ్ళీ ఆకాశం వైపు చూశాడు. అంతకుముందు రాక్షసుడుగా కనిపించిన మేఘం, కొద్దిగా కదిలి, పెద్ద ఏనుగులా మారిపోయింది. అది చూసి చిన్ను గట్టిగా నవ్వేశాడు. ‘నాన్న, భళే భళే.. ఇప్పుడు రాక్షసుడు ఏనుగు అయిపోయాడు!’ అన్నాడు ‘మేఘాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు, మన ఊహలే వాటికి రూపం ఇస్తాయి’ అని చెబుతూ నాన్న చిన్నును దగ్గరకు తీసుకున్నాడు.

- యం. రాం ప్రదీప్,

జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు,

94927 12836.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్