అది ఒక పల్లెటూరు. ఆ ఊరికి ఒక స్వామీజీ వచ్చి ఊరిలో మకాం వేశాడు. తన దగ్గరకు చూడటానికి వచ్చిన వాళ్లకు వాళ్ల భవిష్యత్ గురించి చెబుతానని ప్రచారం చేయించాడు. కొంతమందికి ‘కీడు జరగబోతుంది’ అని చెప్పి భయపెట్టేవాడు. ఆ కీడు తొలగిపోవాలంటే పూజ చేయాలని వీలైనంత డబ్బుని గుంజేవాడు. చాలామంది భయపడి డబ్బు చెల్లించే వారు. ఆ ఊరిలో రామారావు, రాజమ్మ అనే దంపతులు ఉన్నారు. ఒకసారి రామారావుకు అనారోగ్యం వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. అప్పుడు వాళ్లు స్వామీజీ దగ్గరకు వెళ్లారు. వారితో బాటు ఆ రోజే ఊరి నుండి వచ్చిన వాళ్ల మనవడు హరీష్ కూడా వెళ్లాడు. రామారావు తన అనారోగ్యం గురించి చెప్పేసరికి స్వామీజీ రామారావును ఉద్దేశించి ‘నిన్ను ఒక పీడ పట్టింది. కావాలంటే ఇది చూడు’ అని చెప్పి ఒక నిమ్మకాయను తీసుకుని చాకుతో కోసి పిండాడు. నిమ్మకాయలో నుండి ఎర్రని రక్తపు రంగులో చుక్కలు కారడం మొదలయ్యాయి. దాంతో వాళ్లు చాలా భయపడిపోయారు.
ఇదంతా గమనిస్తున్న హరీష్ ఇది స్వామీజీ ఆడుతున్న నాటకం అని గ్రహించాడు. అప్పటికప్పుడు ఇంటికి వెళ్లి ఒక నిమ్మకాయను, చాకును తీసుకొచ్చి స్వామీజీకి ఇచ్చి ‘ఈ నిమ్మకాయను ఈ చాకుతో కోసి మరల రక్తం చుక్కలు రప్పించండి’ అని అడిగాడు. స్వామీజీ బిక్కచచ్చిపోయాడు. అప్పుడు హరీష్ అక్కడున్న వారందరినీ ఉద్దేశించి ‘ఇదంతా స్వామీజీ ఆడుతున్న నాటకం. స్వామీజీ కోసిన నిమ్మకాయ నుంచి ఎర్రని రక్తం చుక్కలుగా రావడానికి కారణం, ఆ నిమ్మకాయలోకి ఒక రసాయనాన్ని (పొటాషియం థయో సైనేట్) ముందుగానే ఎక్కించి దానిని మరొక రసాయనం (ఫెర్రిక్ క్లోరైడ్) తో పూసిన చాకుతో కోస్తే ఆ రెండింటి మధ్య చర్య జరిగి ఎర్రటి రక్తం రంగు కలిగిన ద్రవం (ఫెర్రిక్ థయో సైనేట్) వస్తుంది. ఇదంతా సైన్స్. అంతేకాని ఇదేమీ కీడు కాదు. ఇటువంటి వ్యక్తులను వదిలిపెట్టకూడదు. వెంటనే పోలీసులకు అప్పచెప్పుదాం’ అనేసరికి ‘ఇంకెప్పుడూ ఇటువంటి తప్పుడు పనులు చేయను’ అని స్వామీజీ కాళ్లా వేళ్లా పడ్డాడు. ఊరి వాళ్లు క్షమించి విడిచిపెట్టడంతో అప్పటికప్పుడు ఊరి వదిలి వెళ్లాడు. స్వామీజీ మోసంలో పడకుండా తమను కాపాడినందుకు హరీష్‌ను ఊరి వాళ్లు ఎంతగానో మెచ్చుకున్నారు.
- కొమ్ముల వెంకట సూర్యనారాయణ,
99496 02721








కామెంట్‌లు (0)