పల్లెవెలుగు బస్సు హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు వైపు ప్రయాణిస్తోంది. ఎక్కువగా ఇంజనీరింగ్ విద్యార్థులే బస్సు ఎక్కారు. కండక్టర్ బస్సు వెనకవైపు నుంచి టికెట్స్ ఇచ్చుకుంటూ, పాస్ లు చెక్ చేస్తూ వస్తున్నాడు. అప్పనవీడు బస్టాప్ దగ్గర ఆగింది. కాలేజీ అమ్మాయిలు నలుగురు ఎక్కారు. డ్రైవర్ కి స్టార్ట్ చేయమని ఈల బుర్రతో సంకేతం అందించాడు కండక్టర్. బస్సు కదిలింది. ఒక్కసారిగా అందులో ఉన్న కుర్రాళ్ళు, ‘ఆపండి.. ఆపండి..’ అంటూ డోర్ ను గట్టిగా కొట్టారు.
డ్రైవర్ బ్రేక్ వేసి, ‘ఏమైంది?’ వెనక్కి చూస్తూ అడిగాడు.
‘మా ఫ్రెండ్ ఎక్కాలి. వస్తున్నాడుండండి... ఒరేయ్, దాసూ... ఎక్కరా..’ డ్రైవర్ కి చెప్పి, స్నేహితుడిని పిలిచారు. కండక్టర్ సీటు వెనకాలే కూర్చున్న నవకాంత్, ‘ఎవరా ఆ కుర్రాడు?’ అనుకుంటూ కిటికీలోంచి బయటకు చూశాడు. వీపుకి కాలేజీ బ్యాగును తగిలించుకున్న దాసు, తండ్రితో గొడవపడుతున్నాడు. ‘వంద కూడా లేవంటే ఎట్టా నాన్నా.. ఇవ్వు, బస్ ఎల్లిపోతుంది’ గద్దిస్తూ అడుగుతున్నాడు దాసు. ‘లేవురా.. చెప్తే ఇనవ్.. నీదంతా ఎతిమతం..’ చొక్కా ఖాళీ జేబును బయటకు చూపించాడు అతని తండ్రి. ఆ జేబును అటూ ఇటూ వెతికి, ‘ఫీజులు మాత్రం కడతావుగానీ ఒక వంద రూపాయలు అడిగితే మాత్రం లేదంటావ్.. ఫ్రెండ్స్ ముందు ఎదవను చేత్తావే..’ విసుక్కున్నాడు దాసు.
‘ఎంతసేపు ఆపుతారయ్యా... రైట్., రైట్.,’ కసురుకున్నాడు కండక్టర్. బస్సు కదిలింది. దాసు తండ్రి, ‘ఆపండి.. ఆపండి..’ అని బస్సుపై చేత్తో శబ్దం చేశాడు.
‘ఎల్లరా.. బస్ ఎల్లిపోతోంది..’ అంటూ దాసును ముందుకు తోశాడు. బస్ ఎక్కడానికి దాసు మొదట ఇష్టపడలేదు.
అమ్మాయిల ముందు పరువు పోతుందేమోనని ‘సర్లే, నువ్విక ఇంటికి పో..’ పరుష పదజాలంతో తిడుతూ బస్సుకు వేలాడబడ్డాడు. స్నేహితులు అతన్ని లోపలికి లాగారు. మాటలు మొదలెట్టారు.
‘ఏంట్రా.. ఇవాళ కూడా ఇవ్వలేదా?’ వెటకారంగా నవ్వుతూ అడిగారు.
‘ఎప్పుడూ చూడు, ఖాళీ జేబునే చూపిత్తాడు. సంపాదించింది ఏం జేత్తాడో.. ఇవ్వడానికేం నొప్పో..’ అక్కసును వెళ్ళగక్కాడు దాసు. దాసు అలానే చెప్తాడని ముందే ఊహించిన స్నేహితులు పగలబడి నవ్వారు.
‘అదే మా డాడీ అయితే అడిగింది లేదనకుండా ఇస్తాడ్రా.. మీ డాడీ ఏంట్రా బాబు..’ దాసుని ఉడికించడానికి అన్నాడొకడు.
‘వాళ్ళ డాడీ అంతేరా.. ఒట్టి పిసినారోడు..’ రెచ్చగొడుతూ అన్నాడు ఇంకొకడు.
‘అలాంటోళ్ళను మా గూడెంలో ‘జిడ్డు’ గాడు అంటార్రా..’ గుండెలో మరింత మంట రేపుతూ అన్నాడు మరొకడు. వాళ్ళ మాటల్ని విన్నవారు గొల్లున నవ్వారు. కన్నతండ్రిని రకరకాలుగా అంటున్నందుకు దాసుకు బాధ కలగలేదు. కానీ, పక్కనే ఉన్న అమ్మాయిలూ అతని స్నేహితులతోపాటుగా నవ్వినందుకు విపరీతంగా బాధపడిపోయాడు. పరువు పోయిందని ఫీలయ్యాడు. ఇబ్బందిగా కదిలాడు.
‘ఏ బాబూ.. డోర్ దగ్గర ఏలాడొద్దని చెప్తే అర్థం కాదా? లోపలికి రండి. టికెట్.. టికెట్.. స్టూడెంట్స్ పాస్ లు చూపించాలి. తీయండి..’ అరుస్తూ ఒక్కొక్కర్నీ చెక్ చేస్తున్నాడు. కాస్త ఎదురుగా ఉన్న సీటులో కూర్చున్న వ్యక్తిని ఉద్దేశిస్తూ, ‘నాన్నగారూ.. నాన్నగారూ..’ గట్టిగా పిలిచాడు నవకాంత్. ఆ వ్యక్తి వెనక్కి తిరిగి ‘ఏమిటన్నట్లు’ చూశాడు.
‘టికెట్స్ నేను తీసుకుంటున్నాను. మీరు తీసుకోకండి..’ అన్నాడు నవకాంత్.
‘సరే, నాకు ఆధార్ కార్డు ఉంది. డిస్కౌంట్ వస్తుంది. చెప్పి తీసుకో.. చెప్పాడు నవకాంత్ తండ్రి.
'అలాగే.. ఈ మంచినీళ్ళు తాగండి..' తండ్రి ఆధార్ కార్డును తీసుకుని, వాటర్ బాటిల్ అందించాడు నవకాంత్.
కండక్టర్ రాగానే రెండు టికెట్స్ ఇమ్మన్నాడు. అందులో ఒకటి ఆధార్ కార్డు అని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరని అడిగితే ఎదురు సీటులో కూర్చున్న తండ్రిని చూపించాడు నవకాంత్. అతనివైపు చూసి, ‘ఎవరూ, ఆ ముసలాయనా?’ అడిగాడు కండక్టర్. తండ్రినలా ‘ముసలోడ’ని సంభోదించేసరికి బాధపడ్డాడు నవకాంత్.
‘పెద్దవాళ్ళకు మీరిచ్చే గౌరవం ఇదేనా సార్? మీ నాన్నగారిని కూడా ఇలాగే ‘ముసలోడా’ అని పిలుస్తారా?’ అందరిముందూ అడిగాడు నవకాంత్.
నొచ్చుకున్న కండక్టర్, ‘మామూలుగానే పిలిచానులే బాబూ..’ అంటూ ఈలబుర్ర వేసుకుంటూ ముందుకెళ్ళాడు. తండ్రి పట్ల నవకాంత్ చూపిస్తున్న ఆపేక్షకు దాసు ఆశ్చర్యపోయాడు. తానెప్పుడూ తండ్రిని ప్రేమగా, లాలనగా పిలిచినట్లుగానీ, అందరిముందూ గౌరవం ఇచ్చి నడుచుకున్నట్లుగానీ గుర్తు రాలేదు.
కలపర్రు బస్టాప్ దగ్గర బస్సాగింది. నవకాంత్ దిగుతూ,
‘నాన్నగారూ జాగ్రత్తగా దిగండి. మీ చేయి ఇటివ్వండి..!’ అంటూ తండ్రి చేతిని పట్టుకున్నాడు.
‘నేను దిగుతాలే బాబూ..!’ అంటూ బస్సు మెట్ల మీద నుంచి మెల్లగా దిగబోతూ కాలు సరిగ్గా పడక తూలబోయాడు తండ్రి. బస్సులో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ‘అయ్యో..’ అంటూ అరిచారు. అక్కడే కనిపెట్టుకుని ఉన్న నవకాంత్ క్షణాల్లో స్పందించి, తండ్రిని కింద పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్టాపులో ఉన్న బల్ల మీద తండ్రిని కూర్చోబెట్టాడు నవకాంత్.
‘అంతలా వెన్నంటి ఉండే కొడుకులుంటే ఏ తండ్రులైనా రాజులే!’ నవకాంత్ ను మెచ్చుకున్నాడు బస్సులో ఉన్న ఓ పెద్దాయన.
‘నిజమే! ఎంత చదివినా, ఎంత నేర్చుకున్నా దాన్ని పాటించకపోతే ఫలితమేముంది?’ ఇంకో పెద్దాయన వంత పాడాడు.
అక్కడున్న అమ్మాయిలూ, దాసు స్నేహితులు పెద్దాయన మాటలకు నిశ్శబ్దం వహించారు. దాసు మనస్సు చివుక్కుమంది. గుండె కలుక్కుమంది. బుద్ధిలేనితనం బేలగా చూసింది. ఆచరణలేని విజ్ఞానం, దీపం ముందు కూర్చుని కళ్ళు మూసుకున్నట్లేననిపించింది. తండ్రిని గౌరవంగా చూసుకోవాలని, హింసించకూడదని, చులకన చేయకూడదని జ్ఞానోదయమైంది.
దొండపాటి కృష్ణ
9052326864








కామెంట్‌లు (0)