ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్రికెటర్‌ నుంచి సినీ హీరోనయ్యా...

1 గంట క్రితం

roshan.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 08:36 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సినిమా కుటుంబంలో పుట్టడం ఒక అవకాశం. కానీ ఆ అవకాశాన్ని నిలబెట్టుకుని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడం మాత్రం అంత సులభం కాదు. తండ్రి సంపాదించిన పేరు పరిచయాన్ని తెచ్చిపెట్టవచ్చు. కుటుంబ నేపథ్యం తొలి అడుగుకు తోడ్పడవచ్చు. కానీ ‘నటుడిగా ఎవరు?’ అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది మాత్రం తన ప్రతిభతోనే. అలాంటి సవాలుతోనే తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న యువ కథానాయకుడు రోషన్‌ మేక.

ప్రముఖ నటుడు శ్రీకాంత్‌, నటి ఊహ దంపతుల పెద్ద కుమారుడిగా సినీ వాతావరణంలో పెరిగిన రోషన్‌కు చిన్ననాటి నుంచే కెమెరా, లైట్లు, షూటింగ్‌ వాతావరణం పరిచయమే. అయినప్పటికీ తనను కేవలం ‘శ్రీకాంత్‌ కుమారుడు’గా కాకుండా.. ‘రోషన్‌ మేక’గా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాలన్నదే ఆయన లక్ష్యం. 1999 మార్చి 13న హైదరాబాద్‌లో జన్మించిన రోషన్‌ అక్కడే విద్యాభ్యాసం పూర్తిచేశారు. చిన్నతనం నుంచే ఆటలపై ఆసక్తి ఉన్న ఆయనకు క్రికెట్‌, ఫుట్‌బాల్‌ అంటే ఎంతో ఇష్టం. ఒక దశలో క్రికెటర్‌ కావాలన్నది ఆయన కోరిక. తండ్రి శ్రీకాంత్‌ కోరిక కూడా అదే. అయితే సినిమాలపై ఏర్పడిన ఆసక్తి ఆయన జీవిత ప్రయాణాన్ని వెండితెర వైపు మళ్లించింది. రోషన్‌ సినీ ప్రయాణం కథానాయకుడిగా కాదు.. బాలనటుడిగా ప్రారంభమైంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘‘రుద్రమదేవి’’ చిత్రంలో బాలనటుడిగా తొలిసారి వెండితెరపై కనిపించారు. చిన్న వయసులోనే కెమెరా ముందు నిలిచిన అనుభవం ఆయనకు నటనపై ఆసక్తిని మరింత పెంచింది. తర్వాత 2016లో నాగార్జున కీలకపాత్రలో నటించిన ‘‘నిర్మలా కాన్వెంట్‌’’ ద్వారా కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. తొలి చిత్రంలోనే స్క్రీన్‌ ప్రెజెన్స్‌, డైలాగ్‌ డెలివరీ, డ్యాన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి గాను సైమా ఉత్తమ తొలి గుర్తింపుగా నిలిచింది. అయితే తొలి సినిమా, అవార్డుతోనే ప్రయాణం ముగియలేదు. అసలు పరీక్ష అక్కడి నుంచే మొదలైంది. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకోవాలంటే మరింత నేర్చుకోవాలని భావించిన రోషన్‌.. ముంబైలో నటనలో శిక్షణ తీసుకున్నారు. బాలీవుడ్‌లో పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేస్తూ సినిమా నిర్మాణంలోని వివిధ విభాగాలపై అవగాహన పెంచుకున్నారు.

‘‘పెళ్లి సందD’’తో మరో మలుపు

రోషన్‌ కెరీర్‌లో మరో కీలకమైన చిత్రం ‘పెళ్లి సందD’. డాక్టర్‌ కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీలతో కలిసి రోషన్‌ కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. రోషన్‌ తండ్రి శ్రీకాంత్‌ కథానాయకుడిగా గతంలో నటించిన ‘పెళ్లి సందడి’కి అనుబంధంగా వచ్చిన ఈ సినిమాలో కుమారుడు హీరోగా నటించడం సహజంగానే ఆసక్తిని కలిగించింది. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, పాటలు, డ్యాన్సుతో ఈ చిత్రంలో రోషన్‌ తనను తాను యువ కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. రోషన్‌–శ్రీలీల జోడీకి మంచి స్పందన లభించింది. ఆయన లుక్స్‌, డైలాగ్‌ డెలివరీ, తెరపై కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తండ్రితో పోలికలు తప్పలేదు. వారసత్వం ఒకవైపు అవకాశాన్ని ఇస్తే.. మరోవైపు పోలికల భారాన్ని కూడా మోపుతుంది. ఆ భారాన్ని అధిగమించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలన్నదే రోషన్‌ ముందున్న సవాలు.

వైవిధ్యమైన పాత్రల వైపు..

ఒకే తరహా ప్రేమకథలు, కమర్షియల్‌ పాత్రలకు పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలు చేయాలనే ఆలోచన రోషన్‌లో కనిపిస్తుంది. అందులో భాగంగానే ‘‘చాంపియన్‌’’లో క్రీడాకారుడి పాత్రను ఎంచుకున్నారు. 2025లో విడుదలైన ఈ చిత్రంలో మైఖేల్‌ సి. విలియమ్స్‌ అనే ఫుట్‌బాల్‌ క్రీడాకారుడి పాత్రలో కనిపించారు. క్రీడాకారుడి శరీర భాష, కదలికలు, భావోద్వేగాలను తెరపై ఆవిష్కరించారు. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఉన్న ఆసక్తి ఈ పాత్రకు ఉపయోగపడింది.‘‘చాంపియన్‌’’ కోసం మూడేళ్లపాటు ప్రయాణించడం తనకు నటుడిగా ఎంతో నేర్పిందని రోషన్‌ అంటున్నారు. ఒక పాత్ర కోసం సమయం కేటాయించడం, దాని చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం నటుడిగా తనలో ఓపికను పెంచిందన్నారు.

roshan.jpeg

‘‘ఏమో ఏమో ఇది’’లో అభయ్‌గా..

ఇప్పుడు రోషన్‌ మేక మరో కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ‘హిట్‌’ సిరీస్‌ వంటి థ్రిల్లర్లతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శైలేష్‌ కొలను తొలిసారి ప్రేమకథను తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఏమో ఏమో ఇది’. ఈ సినిమాలో రోషన్‌ అభయ్‌ పాత్రలో కనిపించనున్నారు. ప్రీతి ముకుందన్‌ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకూ చేసిన పాత్రలకు భిన్నంగా అభయ్‌ మరింత సహజమైన, యువతకు దగ్గరగా ఉండే పాత్రగా నిలిచే అవకాశం ఉంది. నేటి తరం యువత ప్రేమను చూసే విధానం, సంబంధాల్లో వస్తున్న మార్పులు, భావోద్వేగాలను కథలో చూపిస్తున్నట్లుగా ఇటీవల చిత్రబృందం వెల్లడించింది.

‘భావోద్వేగాలను అర్థం చేసుకునే పరిణతి కావాలి’

మీడియా ఇంటర్వ్యూల్లో రోషన్‌ తన నటనా విధానం గురించి మాట్లాడుతూ..‘‘మెథడ్‌ యాక్టింగ్‌ కంటే ఇన్‌స్టింక్ట్‌పై ఎక్కువగా ఆధారపడతానని’’ చెప్పారు. తన నటనపై తల్లిదండ్రులు శ్రీకాంత్‌, ఊహ ప్రభావం ఎంతో ఉందని, వారి సలహాలతో ముందుకు సాగుతున్నానని తెలిపారు. నటన అంటే కేవలం డైలాగులు చెప్పడం కాదని.. పాత్రలోని భావోద్వేగాలను అర్థం చేసుకునే మానసిక పరిపక్వత అవసరమని ఆయన అభిప్రాయం. అందుకే ‘పెళ్లి సందడి’ తర్వాత కావాలనే కొంత గ్యాప్‌ తీసుకుని తనను తాను నటుడిగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేశానని చెప్పారు. ‘‘ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలి. ఒకే తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్తే బోర్‌ కొడుతుంది. ప్రేక్షకుల ఆలోచనా విధానం కూడా మారిపోయింది. థియేటర్‌కు ప్రేక్షకులు రావాలంటే సినిమా వారికి ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వాలి’’అనేది రోషన్‌ ఆలోచన. ప్రతి చిత్రం తనకు భిన్నమైన అనుభూతిని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్