ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition​బతుకు పేజీలు

1 గంట క్రితం

bathuku pagelu-mini katha photo.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 08:09 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

‘‘ప్రతి మనిషి ముఖము పఠనీయ గ్రంథమే... మరి నీ బతుకు పేజీలు తిరగేసేదెవరు?’’..​ విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్ గారు ఎప్పుడో రాసిన ఈ ప్రశ్న భానుని గత రెండు నెలలుగా నిద్రపోనివ్వడం లేదు. రాత్రిళ్లు పడక మీద అటూ ఇటూ దొర్లుతున్నా ఆ వాక్యాలు అతడి మెదడును తొలిచేస్తూనే ఉన్నాయి. పక్కనే ప్రశాంతంగా నిద్రిస్తున్న రమ్య ముఖం వంక చూస్తుంటే, అతడికి ఒక అపరిచిత గ్రంథంలాగానే అనిపిస్తోంది. ఆ ముఖంపై కదిలే చిన్న చిన్న భావాలను చదవాలని, ఆ కళ్లల్లో దాగున్న రహస్యాన్ని తెలుసుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా అంతరార్థం మాత్రం అతడికి అస్సలు అంతుచిక్కడం లేదు. ఆ అస్పష్టత అతడిలో ఒక రకమైన అభద్రతాభావాన్ని పెంచుతోంది. నిజానికి గత రెండు నెలల నుండి రమ్యలో చాలా పెద్ద మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇల్లంతా తనే అయి తిరుగుతూ, చిన్న విషయానికి కూడా గలగలా మాట్లాడే రమ్య, ఇప్పుడు ఏదో తెలియని తత్తరపాటుతో, కంగారుతో ఉంటోంది. ఆఫీస్ నుండి రాగానే ముఖంలో అలసట కంటే కూడా ఏదో దాస్తున్న భావమే ఎక్కువగా కనిపిస్తోంది.

అన్నిటికన్నా భానుని మానసిక క్షోభకు గురిచేస్తున్న విషయం మరొకటి ఉంది. హాల్లో కూర్చున్నప్పుడు రమ్య ఫోన్ మోగితే చాలు, తను ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. గబగబా బెడ్‌రూమ్‌లోకి వెళ్లి, గడియ పెట్టుకుని రహస్యంగా మాట్లాడుతోంది. ఎవరితో మాట్లాడుతుందో అర్థంకాక భాను పిచ్చెక్కిపోతున్నాడు. ఒక్కసారి భాను ఆలోచనలు కొన్ని నెలల వెనక్కి వెళ్లాయి.


భానుకి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. తల్లి సుమతి ఎన్నో కష్టాలు పడి, అతడిని, చెల్లి రేఖను పెంచి పెద్ద చేసింది. రమ్య, భాను కాలేజీ రోజుల్లో క్లాస్మేట్స్. ఇద్దరి ఆలోచనలు, ఆశయాలు కలవడంతో ఒకరినొకరు ఇష్టపడ్డారు. చదువు పూర్తికాగానే భానుకి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. ఇంక జీవితం స్థిరపడింది అనుకునే సమయంలో, ఉన్నట్లుండి రమ్య తండ్రికి గుండెజబ్బు చేసింది. బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేసారు. ​ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒకరోజు రమ్య కన్నీళ్లతో భాను దగ్గరకు వచ్చింది. ​‘భానూ!, మీ చెల్లి రేఖకు పెళ్లి కాకుండానే మనం పెళ్లి చేసుకోవడం సాంప్రదాయం ప్రకారం తప్పే. మీ అమ్మగారికి కూడా ఇది నచ్చకపోవచ్చు. కానీ మా నాన్న ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదు. ఆయన కళ్ల ముందే నా పెళ్లి జరగాలని ఆశపడుతున్నారు. ప్లీజ్, నాకోసం మీ అమ్మగారితో మాట్లాడు. పెళ్లయ్యాక నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. ఇద్దరం కలిసి సంపాదిస్తూ మీ చెల్లి పెళ్లి బాధ్యతను పంచుకుందాం. నన్ను నమ్ము భానూ’ అంది దీనంగా.

​అప్పుడు భాను కొంచెం ఆశ్చర్యపోతూ, మనసులో ఉన్న సందేహాన్ని అడిగాడు.

​‘చెల్లి పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు రమ్యా! అదీకాక గతంలో నువ్వే అన్నావు కదా... నీకు ఉద్యోగం చేయడం అస్సలు ఇష్టం లేదు, పెళ్లయ్యాక ఒక మంచి గృహిణిగా ఇల్లు చూసుకోవాలని, కుటుంబంతో సమయం గడపడం ఇష్టమని.. ఇప్పుడేమిటి హఠాత్తుగా ఉద్యోగం చేస్తానంటున్నావు?’

​రమ్య అతడి చేతులు తన చేతుల్లోకి తీసుకుని, కళ్లల్లో నీళ్లను దాచుకుంటూ చిన్నగా నవ్వింది.

​‘నీ బాధ్యతలు నావయినప్పుడు, నా ఇష్టాలు, అలవాట్లు ముఖ్యం కాదు భానూ!. మన కుటుంబం కోసం నా నిర్ణయాలను మార్చుకోగలను’

భాను వెంటనే తల్లితో మాట్లాడాడు. సుమతి కోడలి తండ్రి పరిస్థితిని, రమ్య గుణాన్ని అర్థం చేసుకుని పెద్ద మనసుతో అంగీకరించింది. అలా ఏ ఆటంకాలు లేకుండా వాళ్లకు పెళ్లయింది. పెళ్లయిన కొద్దిరోజులకే రమ్య ఒక పేరున్న స్టార్టప్ కంపెనీలో హెచ్.ఆర్ మేనేజర్‌గా ఉద్యోగం చూసుకుని చేరింది. అలాగే చాలా తొందరలోనే అత్తగారింట్లో అందరి మనసులు గెలుచుకుంది. ఇంట్లో ఎవరికి ఏం కావాలో అన్నీ తనే చూసుకునేది. ​అలా రోజులు, నెలలుగా మారి సంతోషంగా గడుస్తుండగా, అనుకోకుండా రేఖకి ఒక మంచి అమెరికా సంబంధం కుదిరింది. పెళ్లికొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. వాళ్లు నెలలోనే పెళ్ళి జరిపించాలని, ఆ తర్వాత వీసాల ప్రాసెస్ ఉంటుందని, ముహూర్తం కూడా దగ్గరలోనే పెట్టాలని ఒత్తిడి చేశారు.

ఇంట్లో అందరూ పెళ్లి పనుల హడావిడిలో పడ్డారు. సుమతి పెళ్లి ఖర్చుల లెక్కలు వేయడం మొదలుపెట్టింది. కానీ, అప్పటివరకూ ఎంతో ఉత్సాహంగా ఉన్న రమ్య ప్రవర్తనలోనే హఠాత్తుగా మార్పు వచ్చింది. పెళ్లి షాపింగ్ అన్నా, నగలు కొనాలన్నా తను పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

​‘మీరు వెళ్ళండత్తయ్యా, నాకు ఆఫీస్ లో కొంచెం పని ఉంది’ అని తప్పించుకుంటుంది. ఇంట్లో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. ఒకరోజు రాత్రి భోజనాల టేబుల్ దగ్గర రమ్య చాలా ఢీలాగా కూర్చుని ఉంది.

​‘రమ్యా! ఎందుకలా డల్ గా ఉంటున్నావు? ఏమైనా నీరసంగా ఉందా? ఆరోగ్యం బాగుండటం లేదా? డాక్టర్ దగ్గరకు వెళ్దామా?’ ఆప్యాయంగా ప్రశ్నించింది సుమతి.

​‘ఏమి లేదత్తయ్యా... ఆఫీస్ లో కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంది, తలనొప్పి అంతే’ అంటూ భోజనం కూడా సరిగ్గా చేయకుండానే గదిలోకి వెళ్లిపోయింది. భాను మనసులో మాత్రం అనుమానాల పురుగులు తీవ్రంగా సంచరిస్తున్నాయి.

​‘ఒకవేళ చెల్లి పెళ్లికి తను కష్టపడి సంపాదించిన డబ్బు ఇవ్వడం రమ్యకి ఇష్టంలేదేమో? అందుకే ఇలా మొహం చాటేస్తోందా? పెళ్లి బాధ్యతలు పంచుకుంటానని అప్పుడు చెప్పి, ఇప్పుడు మాట తప్పుతుందా? లేక నా మీద ఇష్టం తగ్గిపోయిందా? గదిలోకి వెళ్లి అంత రహస్యంగా ఎవరితో మాట్లాడుతోంది? మరేదైనా తప్పు దారిలోకి వెళ్తుందా?’ ఎడ తెగని ఆలోచనలతో మానసిక నరకాన్ని అనుభవించసాగాడు.


భాను ఆలోచనల నుండి వాస్తవంలోకి వచ్చేసరికి సమయం రాత్రి తొమ్మిది దాటింది. రమ్య ఇంటికి రాలేదు, భాను కంగారుగా ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అతడికి చాలా కోపం వచ్చింది. హాల్లో అటూ ఇటూ తిరుగుతూ రగిలిపోతున్నాడు. సరిగ్గా తొమ్మిదిన్నరకు రమ్య చాలా అలసటగా లోపలికి వచ్చింది. ఆమెను చూడగానే భానులోని సహనం నశించింది.

​‘ఏది ఏమైనా ఈ రోజు ఆమెను నిలదీయాల్సిందే, అన్ని విషయాలు తేల్చుకోవాల్సిందే’ అని కోపంతో ఊగిపోతూ ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు.

​రమ్య అతడి కళ్లలోకి చూసింది. అతడి ముఖంలో ఉన్న కోపాన్ని, అనుమానాన్ని గమనించింది.

​‘భానూ! నీకు తెలియకుండా గత రెండు నెలలుగా ఒక పెద్ద విషయాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. నీకు చెప్పే ధైర్యం లేకపోయింది’ అంది లోస్వరంలో.

​‘నేను అడగాలనుకుంది, నిలదీయాలనుకుంది కూడా అదే! ఏం దాచావ్? ఎవరితో ఆ ఫోన్ సంభాషణలు? ఎందుకు అంత రహస్యం? మన మధ్య దాపరికాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి?’ గట్టిగా అరిచాడు భాను. ​ఆ మాటల పదునుకి ఆమె కంపించిపోయింది.

​ ‘భానూ! దయచేసి నా మాట విను. నిన్ను మోసం చేయాలనే ఉద్దేశం నాకు కలలో కూడా లేదు. రెండు నెలల క్రితం మా స్టార్టప్ కంపెనీ తీవ్రమైన ఆర్థిక నష్టాల్లోకి వెళ్ళింది. బోర్డు మెంబర్స్ చాలా మంది ఎంప్లాయీస్ ని తీసేసారు, అందులో నేనూ కూడా ఉన్నాను. గత రెండు నెలల నుండి నేను నోటీస్ పీరియడ్ లో ఉన్నాను. సరిగ్గా అదేసమయంలో రేఖ పెళ్లి సంబంధం కుదిరింది. నాకు ఉద్యోగం పోయిన విషయం ఇంట్లో చెప్తే పెళ్లి సంతోషం ఆవిరైపోతుందని, అందరూ టెన్షన్ పడతారని ఎవరికీ చెప్పలేదు. ఇక నేను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని మాట్లాడింది ఎవరితోనో కాదు. కొత్త ఉద్యోగం కోసం రౌండ్ల కొద్దీ ఫోన్ ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను. నోటీస్ పీరియడ్ అయిపోయేలోపు ఉద్యోగం రాకపోతే రేఖ పెళ్లికి నేను అనుకున్న సాయం చేయలేనని రాత్రి పగలు తేడా లేకుండా కంపెనీలకు అప్లై చేసాను. నా కష్టం ఫలించి, ఈ రోజే నాకు ఒక మల్టీనేషనల్ కంపెనీలో అంతకంటే డబుల్ శాలరీతో కొత్త ఉద్యోగం దొరికింది. ఆ జాయినింగ్ లెటర్ ఫార్మాలిటీస్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ వల్లే ఈ రోజు ఆఫీస్ లో లేట్ అయింది’ అంటూ ఆ అపాయింట్‌మెంట్ ఆర్డర్ కాగితాన్ని భాను చేతిలో పెట్టింది. ​ఆ కాగితం చూసాక భాను గుండెల్లో ఉన్న అనుమానపు నీలిమబ్బులు ఒక్కసారిగా తేలిపోయాయి. తన భార్య కుటుంబం కోసం ఇంత యుద్ధం చేస్తుంటే, తను ఎంత తప్పుగా ఆలోచించాడో.. తలచుకొని బాధపడ్డాడు. రమ్యను గట్టిగా పట్టుకున్నాడు. ‘అమ్మా రమ్యా! ఇంత మానసిక బాధను, బాధ్యతను నువ్వొక్కదానివే గుండెల్లో దాచుకుని మోసావా? నీలాంటి కోడలు ఉంటే చాలు. ఆ ఇంట్లో శాంతి వెల్లివిరుస్తుంది. భాను గట్టిగా అరుస్తుంటే ఏమైందో అని కంగారుగా వచ్చాను’ అంటూ చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ వచ్చింది సుమతి. ​రమ్య అత్తగారిని చూసి సిగ్గుపడుతూ, కళ్లు తుడుచుకుంటూ భానుకి కొంచెం దూరంగా జరిగింది.​

‘నువ్వు మా ఇంటి మహాలక్ష్మివమ్మా’ అంటూ సుమతి కోడలిని దగ్గరకు తీసుకుని, ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుంది.

​ అప్పుడు భానుకి అలిశెట్టి ప్రభాకర్ గారి కవితకు అసలైన అర్థం తెలిసింది. ఎదుటివారి ముఖం అనే గ్రంథాన్ని పైపైన చూసి తొందరపడి తీర్పు చెప్పకూడదని! ఆ బతుకు పేజీల వెనుక దాగున్న నిశ్శబ్దాన్ని, నిస్వార్థ ప్రేమని చదవగలిగే వివేకం ఉండాలని, తొందరపాటు వలదని గ్రహించాడు. నమ్మకం లేని చోట ఎటువంటి బంధం కూడా నిలబడదు, తొందరపడి ఊహించుకోవడం కంటే అడిగి తెలుసుకోవడం ముఖ్యం!​

-కె.వి. సుమలత

9492656255

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్