మా నగరంలో.. స్వగృహ టవర్స్... ఓ యాభై ప్లాట్స్ తో విశాలమైన, సకల సౌకర్యాలు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం తో మంచి గుర్తింపు
తెచ్చుకున్న ఆ గేటెడ్ కమ్యూనిటీ ఒక మినీ ఇండియా. దానికి నేను అధ్యక్షుడిని. అక్కడ నివసించే స్థిర, చర కుటుంబాలతో పరిచయం పెంచుకోవడం, వారికి ఎదురయ్యే సమస్యలు పరిష్కరించడం... అనే బాధ్యత నా డెబ్భై ఏళ్ల వయసుకి ఎంతో కాలక్షేపాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది.
గత పదిరోజులుగా నేను ఊర్లో లేనప్పుడు.. థర్డ్ ఫ్లోర్.. 306A ప్లాట్ లో ఓ కొత్త జంట అద్దెకు చేరారని తెలిసి.. వారిని పరిచయం చేసుకోవడానికి వారి ప్లాట్లోకి అడుగుపెట్టాను. అంతే అక్కడ నేను గడిపిన ఆ కొద్దిసమయం నాకు ఊపిరి ఆగిపోతుందేమో!.. అన్నంత భయాన్ని, ఉద్వేగాన్ని, కోపాన్ని.. అంతవరకూ నాకు అనుభవం లేని ప్రాక్టికల్ జోక్ రూపంలో పరిచయం చేసి ఒక జీవితకాలపు జ్ఞాపకంగా మిగిల్చింది. ఆ తర్వాత.. నాకు ఎదురైన పరిస్థితిని నేను అవమానంగా, ఆట పట్టించడంగా భావించకుండా.. నా ఆవేశాన్ని, ఆగ్రహన్ని ఓపికగా భరించి.. నన్ను శాంతింప జేశారు.
వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ భార్యా భర్తలు హైదరాబాద్ కు చెందినవారు. ఇద్దరూ గవర్నమెంట్ సర్వీస్ లో పెద్ద ఉద్యోగాలు చేసి...రిటైర్మెంటు తర్వాత కూడా ఆర్ధికంగా, సామాజికంగా బలంగా ఉన్నవారు. డెబ్భై సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యంగా, హుందాగా ఉన్నారు. వాళ్ళకి నలుగురు పిల్లలని, వారందరూ బాగా చదువుకుని, పెద్ద స్థాయిలో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిపోయారని.. వీళ్లు అక్కడికి వెళ్లడమే కానీ వాళ్ళు ఇక్కడికి రారని.. రావడానికి కుదరని వారి పరిస్థితిని కూడా చక్కగా అర్థంచేసుకొని విశదీకరించిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది.
వారి జీవితంలో చోటు చేసుకున్న రక్త సంబంధాల ప్రేమాభిమానాల వెలితి వారిని మానసికంగా పీడించకుండా.. వారి ఒంటరితనాన్ని తరిమి కొట్టడానికి.. సంవత్సరంలో రెండు నెలలు తీర్ధ యాత్రలకి కేటాయించి, మిగిలిన పది నెలలు కొత్తదనం, కొత్త పరిచయాలు, స్నేహం కోసం సంవత్సరానికో కొత్త ఊర్లో నివాసం ఏర్పరచుకుని.. అక్కడ ఉన్నంతకాలం వాళ్ళ జీవితంలో నీరసం, నిరాశ, నిస్పృహలు చోటుచేసుకోకుండా ప్రతి క్షణం ఉత్సాహంగా, ఉత్తేజంగా.. సాగడానికి ఇలా ప్రాక్టీకల్ జోకులు, సోషల్ మీడియా టిక్ టాక్ లు ఆసరాగా తీసుకుని జీవన మాధుర్యాన్ని.. కోల్పోకుండా చూసుకుంటున్నట్టు చెబితే.. అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టు అనే భావన కుంగదియ్యకుండా తమని తామే ట్యూన్ చేసుకుంటున్న వారి జీవన విధానం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. మాలాంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ ఆదర్శంగా మారితే.. మనోవ్యధ, వేదనతో నిండిపోయిన వృద్ధాశ్రమాలన్ని కూడా ఆనందాశ్రమాలుగా మారిపోతాయి కదా అనిపించింది.
ఆ తర్వాత కాలంలో వారి జీవితాచరణ చూసాక.. మన మనసుని నియంత్రించుకుంటే అదేం అసాధ్యం కాదనిపించి నేనూ, నా భార్య కూడా పరాదీనంగా బతకకూడదు ఇకపై అనుకోవడం జరిగింది కూడా. వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి తగ్గట్టుగానే వారి పేర్లు కూడా ఉన్నాయి. ఆమె పేరు.. సీత... అతని పేరు రామం .. ఇద్దరినీ కలిపి సీతారామం గా పిలవడానికి, పలకరించడానికి చక్కగా కుదిరాయి. ఆ విధంగా ప్రారంభమైన మా పరిచయం ముందు స్నేహంగా, తరువాత మా మధ్య విడదీయలేనంత అనుబంధంగా మారింది. నాతోనే కాకుండా.. మా అపార్ట్మెంట్ లో ఉన్న యాభై కుటుంబాల వారందరికీ ఆమె పెద్ద ముత్తయిదువుగా, అతను కుటుంబ పెద్దగా, పిల్లలకి తాతయ్య, బామ్మగా తలలో నాలుకగా, పెద్ద దిక్కుగా వారి నిస్వార్ధ వ్యవహారశైలితో అందరి బంధువులుగా మారిపోవడం చూసి నాకే కాదు అక్కడున్న నా సమవయస్కులందరికీ చాలా ఆశ్చర్యం, ఆలోచన కలిగించింది. అందరం కలిసి ‘‘ఇకపై మీరు సంవత్సరానికొక ఊరు మారకుండ శాశ్వతంగా మాతోనే కలిసి’’ ఉండాలి అని గట్టిగా నొక్కి చెప్పడం కూడా జరిగింది.
ఇలా ఆడుతూ పాడుతూ తొమ్మిది నెలలు గడిచిపోయి.. పదో నెల వచ్చింది. ఆ దంపతులు ఊరు మారడానికి విధించుకున్న గడువు వచ్చిపడేసరికి మాకందరికీ.. వాళ్ళు వెళ్ళిపోతారేమో అన్న గుబులు గుండెల్లో గూడు కట్టుకోవడం మొదలయ్యింది. ఆ సమయంలో ఒక రోజు రాత్రి మా మందు సిటింగ్ అయ్యాక రామం గారు.. 'ఓయ్ మిత్రమా... రేపు పొద్దున్నే మనం రైల్వే స్టేషన్ కి వెళ్లి.. నా మనవడు, మనవరాలుని రిసీవ్ చేసుకోవాలి.. తోడుగా రాగలవా?` అని సడెన్ గా అడిగాడు.
నేను 'వాళ్ళు అమెరికా నుండి వస్తుంటే.. ఇప్పుడా చెప్పేది.. ముందే చెబితే ఈ పాటికి అందరం కలిసి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేసివుండేవారిమి కదా!` అని కాస్త బాధ పడి.. తెల్లారు జామునే స్టేషన్ కి వెళ్లి. ఇరవైప్లస్ వయసులో ఆ దంపతుల వర్చస్సుకి ఏమాత్రం తీసిపోని మనవడు, మనవరాలిని వెంట తీసుకుని వచ్చేసరికి.. మా అసోసియేషన్ సభ్యులు అందరూ వాళ్ళ రక్త సంభందమే వారి దగ్గరికి చేరింది అన్నంత ఆప్యాయంగా, ఆదరంగా వాళ్లకు ఆహ్వానం పలికారు. ఆ తర్వాత పదిరోజులు ఆ పిల్లల అల్లరి, సందడి, ముచ్చట్లతో మా ఆనంద నిలయం అపార్ట్మెంట్ ఇళ్లన్నీ మారుమోగిపోయాయి.
పదకొండో రోజు తెల్లవారుతుండగా ఒక వార్త దావానలంలా ఆనంద నిలయం టవర్స్ ని విషాదంతో కమ్మేసింది.. సీత రామాన్ని ఒంటరిగా వదిలి గుండెపోటుతో చనిపోయింది. నేను వెళ్లేసరికి థర్డ్ ఫ్లోర్ అంతా జనంతో నిండిపోయింది. నేను గదిలోకి వెళ్లేసరికి.. బెడ్ మీద నిశచ్చలంగా,.. ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు కనిపించింది సీత. ఆ పక్కనే కాస్త దూరంగా రామం నిర్వీకారంగా.. మొహంలో ఏ భావం కనిపించకుండా ఒక యోగిలా.. కుర్చీలో కూర్చుని కనిపించాడు. కొంపదీసి.. చావు ప్రభావం మనుషుల మనస్తత్వాల్ని ఎలా పరిచయం చేస్తుందో.. చూడ్డానికి ఆ దంపతులు వేసిన మాస్ ప్రాక్టికల్ జోక్ కాదు కదా అని నా గత అనుభవం అనుమానించింది. ఇంతలో కొందరు.. శవాన్ని సెల్లార్ లోకి తీసుకొని వెళ్ళడానికి ముందుకొచ్చారు. ఇంకొందరు రామంని వాళ్ళ కొడుకులు, కూతుళ్ళకి చావు కబురు అందిందా? లేక వారినే అందించమంటారా? అని అడగడం మొదలుపెట్టారు. రామం ఏం మాట్లాడకుండా.. వాళ్ళందరి ప్రశ్నలకు జవాబులు తన నిశ్శబ్దంలోనే వెతుక్కోమన్నట్టు చలనం లేకుండా వున్నాడు. నేనే జరగాల్సిన వ్యవహారం బాధ్యత తీసుకుందాం అని రామం భుజం మీద చేయి వేసి నోరు తెరవబోతుండగా.. పక్క గదిలోంచి మనవడు, మనవరాలు బ్యాగ్ లు మోసుకుంటూ వచ్చి రామం ఎదురుగా నిలబడి 'సార్ మా టైమ్ పూర్తయ్యింది.. ఇక మేం బయలుదేరుతాం!` అనడం విని గదిలో ఉన్న అందరికీ కరెంట్ షాక్ కొట్టినట్టయ్యింది..
'తాతయ్యా` అని పిలవకుండా సార్ అంటున్నారేమిటి? స్వయానా నాన్నమ్మ చనిపోతే అంత్యక్రియలు వరకూ కూడా ఉండకుండా వెళ్లిపోతున్నారేమిటి? అసలేం జరుగుతుంది.? ఎవరికీ ఏం అర్ధం కాలేదు. నేనింక ఊరుకోలేక 'అదేమిటి నాన్నమ్మ కర్మక్రియలు జరపకుండా మీరెక్కడికి బయలుదేరారు? అలా వెళ్ళడానికి ఎంత మాత్రం వీలు కాదు!` అని కాస్త గట్టిగానే నిలదీసాను.
అప్పుడు మనవడు జవాబు ఇచ్చాడు. ‘మీరన్నది నిజమే.. కానీ మాకు ఆ అర్హత లేదు.. ఎందుకంటే ఆమె నిజంగా మా నాన్నమ్మ కాదు.. ఆయన మా తాతయ్య కాడు... మేము వారి రక్త సంబంధీకులమూ కాము.’
‘మరి ఏ సంబంధం లేకుండా ఇంతకాలం వాళ్ళతో ఎలా కలిసిన్నారు మీరు?’ ఎవరో అడిగారు.
దానికి ఆ మనవరాలు అనబడే అమ్మాయి జవాబిచ్చింది.. ‘మేము ఇలా ఈ సార్.. మేడం ల్లాగే పేగుబంధాలు.. ఉండి కూడా ఎవరూ లేనట్టు ఒంటరిగా బతికే వారి జీవితాల్లో. కొడుకులు, కూతుళ్లు, మనవడు మనవరాలుగా ఆ అభిమానాలు, ఆప్యాయతలు పంచిపెట్టడానికి.. వచ్చిన కిరాయికొచ్చిన పాత్రధారులం. మా కిచ్చిన కాంట్రాక్టు టైమ్ నేటితో ముగిసింది. అదీకాక.. మా ఒప్పందంలో‘‘అంత్యక్రియలు చెయ్యాలి’’ అని లేదు కనుక మేము వెళ్లిపోతున్నాం!`
ఆ మాటల ప్రకంపనాలు వింటున్న వారి గుండెల్లో వణుకు పుట్టించాయి. ఇప్పుడు ఆ అబ్బాయ్ అందుకున్నాడు.. ‘మీకు ఈ అనుభవం కొత్త కావచ్చు. కానీ మహానగరాల్లో మాలాంటి ఆర్టిస్టులను సప్లై చేసే ఏజెన్సీలు చాలా ఉన్నాయి..మీకెప్పుడైనా మా అవసరం పడితే.. సంప్రదించండి. ఇవిగో మా విజిటింగ్ కార్డులు!’ అంటూ జేబులోంచి కొన్ని కార్డులు మా చేతుల్లో పెట్టి, మరో మాటకి తావివ్వకుండా వెళ్లిపోయారు.
అంత మంది జనం ఉన్నా.. నిశ్శబ్దం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఎవరికీ, ఇక పై ఏం చెయ్యాలి అన్న ఆలోచన కూడా తోచనట్టు బొమ్మల్లా ఉండిపోయారు. అప్పుడు వచ్చారు ఓ నలుగురు స్ట్రెచర్ మోసుకుంటూ.. వారి తెల్లటి దుస్తుల మీద ‘‘ఆంధ్రా మెడికల్ కాలేజీ’’ అన్న ఎర్రటి అక్షరాలు మెరుస్తూ.. సీత శవాన్ని తీసుకెళ్లాడానికి వచ్చాం అని మౌనంగానే తెలియజేసాయి.
వాళ్ళు ఆ శవాన్ని స్ట్రెచర్ మీదకు చేరుస్తుండగా నేను ఇక ఆగలేక.. ‘అదేమిటి మిత్రమా!.. మీ కొడుకులు, కూతుర్లు రాకుండానే మీ భార్య డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చెయ్యడం ఏమిటి? వాళ్ళు వచ్చేంత వరకూ ఎన్ని రోజులైనా ఆగుదాం!’అన్నాను.
నాకు తోడుగా మిగిలినవారూ అదే మాటన్నారు. 'ఎన్ని రోజులు ఆగినా ఆవిడను చూడ్డానికి ఎవ్వరూ రారు!` అప్పుడు జారాయి రామం నోట్లోంచి మాటలు.
'ఎందుకని?` ఎవరో అడిగారు.
‘వాళ్లెవరో? ఎక్కడుంటారో కూడా ఆమె నాకెప్పుడూ చెప్పలేదు.. ఎవరో వస్తారు.. చేస్తారు అని ఎవరికోసం ఎదురుచూస్తాం? ఆమె నాకన్నా ముందే చనిపోతే.. తన పార్థీవ దేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేసి తీరమని నన్ను చివరి కోరికగా కోరింది. దయచేసి ఆమె కోరికని నన్ను నెరవేర్చనియ్యండి!’ అని స్థిరంగా మా అందరి వైపు చూసాడు.
ఒకదాని తర్వాత ఒకటిగా ఎదురవుతున్న సంఘటనలు మా అయోమయాన్ని మరింత పెంచుకుంటూ పోతున్నాయి. ‘భార్యను పట్టుకుని.. ఆమెకు ఎవరూ లేరంటున్నావ్! ఇంతకూ ఆమె ఎవరు? నువ్వు తాళి కట్టి పెళ్లాడిన భార్య కాదా? కాకపోతే ఎవరు ఆమె? ఇన్నాళ్లు భార్యాభర్తలుగా మీరు.. ఆ వెళ్ళిపోయిన వారిలాగే మాతో నటించారా? అసలు ఎవరు మీరు? ఏమిటి మీ వ్యవహారంలో అంతరార్ధం?’ అంతవరకూ ఆగిన ప్రశ్నలు బాణాల్లా దూసుకొచ్చాయి.. ఆవేదన, ఆవేశంతో. నేను రామం భుజం మీద చేయి వేసి.. ‘చెప్పు ఆ ప్రశ్నలకు జవాబులు’ అన్నట్టు తట్టాను.
అప్పుడు చెప్పాడు రామం. ‘నాకు ఇద్దరు కొడుకులు విదేశాల్లో స్థిరపడ్డారు. దశాబ్ద కాలంగా రాకపోకలు ఆపేసారు. తండ్రి అనేవాడున్నాడు అన్న సంగతే మర్చి పోయారు. భార్య చనిపోయిన నాలాగే భర్తను పోగొట్టుకున్న ఆమెదీ అదే కథ. అందరూ ఉండి.. ఎవరూ లేని అనాథలం. హైదరాబాద్ లో అయిదేళ్ల క్రితం వాకర్స్ క్లబ్ లో పరిచయం కలిగింది. ఈ మా ముదిరిన వయసుకు మానసికమైన తోడు అవసరం అనుకుని.. ఆర్థికంగా ఇద్దరికీ సమస్య లేదు గనుక మేమిద్దరం భార్యా భర్తలుగా.. నటిస్తూ.. ఊర్లు మారుతూ మేము కోల్పోయిన ప్రేమాభిమానాలు, అనురాగ, ఆప్యాయతలు మీలాంటి వారి నుండి పొందుతూ ఆనందంగా బతుకుతున్నాం. ఇద్దరికీ తీవ్రమైన అనారోగ్య సమస్యలు దాపురిస్తే.. ఎడబాటు లేకుండా ఇద్దరం ఒకేసారి ఆత్మహత్య చేసుకుని, ఈ లోకం విడిచిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ తను హఠత్తుగా గుండె ఆగి చనిపోయింది.. నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయింది. మా ప్రవర్తన కారణంగా మీ అందరి మనస్సులు నొప్పిస్తే నన్ను, ఆమెను కూడా క్షమించండి!’అంటూ రెండు చేతులూ ఎత్తి మోకాళ్ళ మీద కూర్చుని మొక్కేసరికి.. మా అందరి కళ్ల నుండి మాకే తెలియకుండా కన్నీళ్లు ప్రవహించాయి.
మసక బారిన కళ్లతోనే సీత డెడ్ బాడీని అంబులెన్సులో సాగనంపాం.. కనుమరుగయ్యేంత వరకూ చేతులూపుతూ వీడ్కోలు పలికాము. ఆ మరుసటి రోజు ఉదయం నుండీ రామం మాకెవ్వరికి కనిపించలేదు.
వాళ్ళని మొదటిసారి చూడగానే సీతారాముల్లా అన్యోన్య దాంపత్యం అనుకున్నాను.. కానీ ఆ దాంపత్యంలో ఎడబాటుదే ఎక్కువ కాలం అని గుర్తించలేదు. వాళ్ళ పరిచయం, జ్ఞాపకాలు.. 'నడుస్తున్న కాలంలో మనిషికి తిండిగింజలకే కాదు.. ప్రేమభిమానాలకూ కరువొచ్చింది..!’ అని నిరూపించింది . ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మనిషి ఉనికి ఏమౌతుంది? అన్న ప్రశ్న నా మనసులో నివురు గప్పిన నిప్పులా రాజుకుంటూనే ఉంది.
తాళ్ళూరి నిరంజన్
98661 01033








కామెంట్‌లు (0)