ఏకాలంలోనైనా మార్కెట్ లో లభించే దుంప ‘కర్ర పెండలం’. ఇది పైన గోధుమ రంగులో లోపల తెల్లగా ఉంటుంది. దీనిలో పీచు, పిండిపదార్థాలు, సి విటమిన్ అధికం. ఇందులో ఏ రకమైన కొవ్వులూ ఉండవు. శరీరానికి తక్షణ శక్తిని ఆరోగ్యాన్ని అందించే పెండలంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. మరి వాటిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

అట్టు
కావాల్సినవి: కర్ర పెండలం- అర కేజీ, బియ్యం- గ్లాసు, పచ్చిశనగ పప్పు- పావు కప్పు, జీలకర్ర- స్పూను, ఎండు మిరపకాయలు- పది, ఉప్పు- తగినంత, నూనె- తగినంత, ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, కొత్తిమీర తరుగు- కొద్దిగా.
తయారీ : ఒక గిన్నెలో బియ్యం, పచ్చి శనగపప్పు వేసి నీళ్లతో శుభ్రంగా కడగాలి. తర్వాత నిండా నీళ్లు పోసి, ఒక పూటంతా నానబెట్టాలి. పెండలానికి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. మిక్సీలో పెండలం ముక్కలు, నానిన బియ్యం-పచ్చిశనగ పప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, ఉప్పు, జీలకర్ర వేసి, నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పిండి మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని గరిటె జారుగా ఉండేలా మరికొన్ని నీళ్లు కలపాలి. ఉప్పువేయాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయాలి. దానిమీద కొద్దిగా నూనె రాసి గరిటెతో పిండిని తీసుకుని అట్టు పోయాలి. దీనిమీద నూనె వేసి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి, అట్టు కాలనివ్వాలి. తర్వాత అట్టును రెండో వైపునకు తిప్పి మరో రెండు నిమిషాలు ఉంచాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా వేగిన అట్టును పళ్లెంలోకి తీసి సర్వ్ చేయాలి. అంతే పెండలం అట్టు రెడీ. టమోట పచ్చడి, కొత్తిమీర పచ్చడిలోకి చాలా బాగుంటుంది

చికెన్ తో..
కావాల్సినవి: పెండలం- అర కేజీ, బోన్‌లెస్ చికెన్ - పావు కేజీ, ఉల్లిపాయలు- రెండు, టమాటాలు- రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు- స్పూను, పచ్చిమిర్చి- మూడు, నూనె- నాలుగుస్పూన్లు , ఉప్పు- తగినంత, పసుపు- అర స్పూను, కారం- రెండుస్పూన్లు, ధనియాల పొడి- స్పూను, జీలకర్ర పొడి- అరస్పూను, గరం మసాల పొడి- అర స్పూను, కొత్తిమీర- కొద్దిగా
తయారీ: పెండలాన్ని కడిగి పెద్ద ముక్కలుగా కోసి కుక్కర్‌లో వేసి, గ్లాసు నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. తర్వాత తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ ముక్కలను కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి, నూనె వేసి వేడిచేయాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి మిర్చి ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు, పసుపు వేసి మగ్గించాలి. ఐదు నిమిషాల తర్వాత చికెన్ ముక్కలు వేసి కలిపి, పది నిమిషాలు ఉడికించాలి. కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాల పొడి, ముందుగా ఉడికించి పెట్టుకున్న పెండలం ముక్కలు వేసి, కొంచెం నీళ్లు పోసి బాగా కలపాలి. గిన్నె మీద మూతపెట్టి అయిదు నిమిషాలు మగ్గించాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి, స్టవ్ మీద నుంచి దించాలి. ఇలా తయారుచేసిన పెండలం చికెన్ మసాల కూర.. వేడి అన్నం, చపాతీ, పుల్కాల్లోకి రుచిగా ఉంటుంది.

హల్వా
కావాల్సినవి: కర్ర పెండలం- అర కేజీ, బెల్లం పొడి- కప్పు, నెయ్యి- కప్పు, శొంఠి పొడి- స్పూను, జీడిపప్పు- కొద్దిగా, కిస్‌మిస్‌లు- కొన్ని, యాలకుల పొడి- అర స్పూను.
తయారీ: పెండలాన్ని శుభ్రంగా కడిగి నాలుగు ముక్కలుగా కోసి కుక్కర్‌లో వేసి, గ్లాసు నీళ్లు పోసి, రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. తర్వాత తొక్కతీసి చిన్న ముక్కలుగా కోయాలి. వీటిని మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి, మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత స్టయినర్‌లోకి తీసుకుని గరిటెతో ఒత్తుతూ మరో గిన్నెలోకి వడబోయాలి. స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి బెల్లం పొడి వేసి, నీళ్లు పోసి కరిగించాలి. వెంటనే పెండలం పేస్టు వేసి కలపాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు నెయ్యి వేసి, బాగా కలపాలి. మిశ్రమం కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత మిగిలిన నెయ్యి వేసి కలుపుతూ చిన్న మంట మీద ఉడికించాలి. పది నిమిషాల తర్వాత మిశ్రమం పూర్తిగా ఉడికి గిన్నెకు అంటుకోకుండా దగ్గరకు వస్తుంది. ఈ దశలో శొంఠి పొడి, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి కలిపి స్టవ్ మీద నుంచి దించాలి. ఈ హల్వాని నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసి, సమంగా పరచాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి. అంతే మెత్తని పెండలం హల్వా రెడీ!

చిప్స్
కావాల్సినవి: కర్ర పెండలం- అర కేజీ, నూనె- డీప్ ఫ్రైకి తగినంత, కారం- అరస్పూను, ఉప్పు- అరస్పూను, ధనియాల పొడి- పావుస్పూను, చాట్ మసాల పొడి- అరస్పూను.
తయారీ: చిన్న గిన్నెలో ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాల పొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. పెండలాన్ని మట్టి లేకుండా కడిగి పీలర్‌తో తొక్క తీయాలి. మరోసారి ఉప్పు నీళ్లతో కడగాలి. స్లైసర్ సహాయంతో పలుచని స్లైసెస్‌గా కట్ చేయాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి సగానికిపైగా నూనె పోసి వేడిచేయాలి. నూనె బాగా వేడెక్కాక అందులో పెండలం స్లైసెస్ వేసి పెద్ద మంట మీద దోరగా వేయించాలి. మధ్య మధ్యలో చిల్లుల గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత నూనెలో నుంచి తీసి దాన్ని ఒక గిన్నె మీద పెట్టాలి. అదనంగా ఉన్న నూనె మొత్తం గిన్నెలోకి దిగిన తర్వాత చిప్స్‌ను మరో వెడల్పాటి గిన్నెలో వేయాలి. వీటిపైన ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు, కారం మిశ్రమాన్ని చల్లి గిన్నెను పైకి కిందికి ఊపాలి. ఇలా తయారు చేసిన పెండలం చిప్స్ వారం రోజుల వరకూ కరకరలాడుతూ ఉంటాయి. వీటిని స్నాక్‌లా సర్వ్ చేయవచ్చు. లేదంటే పప్పు, చారు, సాంబార్‌తోపాటు సైడ్ డిష్‌గా వడ్డించవచ్చు.







కామెంట్‌లు (0)