ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాజుగారి పొగడ్త

58 నిమిషాల క్రితం

balala katha bomma
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 09:22 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

కళింగ రాజ్యాన్ని వీరసేన అనే మహారాజు పరిపాలించేవాడు. తనకు పొగడ్త అంటే చాలా ఇష్టం. అలా తనను పొగిడేవారికి తగినంత ధన సహాయం చేసి పంపేవాడు. శిక్షలు తగ్గించేవాడు. ఒకసారి రాజ్యంలో దొంగతనం చేస్తూ ఇద్దరు దొంగలు దొరికారు వారిని మహారాజు ముందు నిలబెట్టారు. వీళ్ళకు వంద కొరడా దెబ్బలు కొట్టమని రాజు ఆదేశించాడు. ఆ ఇద్దరి దొంగల ముఖాల్లో ఆందోళన భయం అస్సలు కనపడలేదు. రాజుకు ఆశ్చర్యం వేసింది ‘నేను ఇంత పెద్ద శిక్ష వేసినా కూడా మీ ముఖాల్లో భయం కనడబడలేదు కారణం తెలుసుకోవచ్చా’ అనడిగాడు మహారాజు.

‘మహారాజా! మీరు మహా సంపన్నులు పైగా అమోఘమైన పేరు ప్రఖ్యాతులు గలవారు. అన్ని రాజ్యాల రాజులకంటే మహా తెలివిగలవారు. మీలాంటి గొప్ప రాజు పాలిస్తున్నటువంటి ఈ రాజ్యంలో పుట్టడం మేం చేసుకున్న అదృష్టం మీ చేతుల మీదుగా వేసే ఎటువంటి శిక్షనైనా మేం ఆనందంగా స్వీకరిస్తాం మహాప్రభో ’ అన్నాడు అందులో ఒకడు.

ఈ ప్రశంసకు మహారాజు ముగ్ధుడై ‘మహా మంత్రి..! వీళ్ళకు కొరడా దెబ్బలు కాకుండా మంచి ప్రవర్తన కలిగేలా హితువు నేర్పి సాగనంపండి’ అంటూ రాజు వారికి శిక్ష లేకుండా చేయగానే దొంగలు ఆనందించారు ‘మీరు పొగడ్తలకు పొంగిపోతూ కొన్ని పొరబాట్లు చేస్తున్నట్టు అనిపిస్తోంది, వాళ్లు మాటలకు వినే దొంగలు కాదు ఆలోచించండి’ అంటూ జాగ్రత్త పరిచింది మహారాణి.

‘ఎవర్ని ఎలా శిక్షించాలో ఎలా పరీక్షించాలో నాకు బాగా తెలుసు. మీరు మందిరానికి వెళ్లి విశ్రాంతి తీసుకోండి’ అని కోపగించుకున్నాడు మహారాజు. మహారాణి మందిరానికి వెళ్ళింది.


ఒకసారి రాజ్యాన్ని పరిశీలించడానికి మంత్రిని వెంటబెట్టుకొని వెళ్లాడు మహారాజు. రాజును చూడగానే ప్రజలందరూ నమస్కరించడం కాళ్లకు దండం పెట్టడం చేశారు " మహారాజుకు జై జై " అంటూ స్వాగతం పలికారు. వీరసేన మహారాజు పొంగిపోయాడు. ‘ప్రజలకు నాపైగల అభిమానం చెప్పలేనంతగా ఉంది. వారి ప్రశంసలకు నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది’ అంటూ మహారాజు సంతోషపడ్డాడు. వెంటనే మంత్రిని పురమాయించి ‘రాజ్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి చేతికి కొంత ధనంతో పాటు ఒక బంగారు ఆభరణం కూడా ఇచ్చిరండి’ అని చెప్పి పంపుతాడు.

మహారాజు చెప్పినట్టుగా చేసి తిరిగి రాజమందిరానికి చేరుకున్నాడు మంత్రి. ‘ప్రభు మనం ఇచ్చిన కానుకలు అందరూ స్వీకరించారు కానీ ఒక్కడు మాత్రం తిరస్కరించాడు’ అని చెప్పాడు మంత్రి ‘వెంటనే అతన్ని ప్రవేశపెట్టండి’ అని కోపంతో అన్నాడు మహారాజు. సైనుకులు వెంటనే అతన్ని ప్రవేశపెట్టారు.

‘నీ పేరేమి?’ అని అడిగాడు మహారాజు. ‘నా పేరు పాపన్న..’ అన్నాడు. అతను ‘ఈ మహారాజు పంపిన కానుకనే తిరస్కరిస్తావా? ఎంత ధైర్యం నీకు?’ అని గర్జించినట్టు అడిగాడు మహారాజు. ‘నేను నా కష్టార్జితాన్ని నమ్ముకుంటాను. కష్టపడకుండా వచ్చిన దాన్ని అనుభవించాలని అనుకోను. నన్ను క్షమించండి మహారాజా’ అన్నాడు పాపన్న.

‘ఎంత కండకావరం ఇతనికి!. వంద కొరడా దెబ్బలు కొట్టి, కానుకలు ఇచ్చి పంపండి ససేమిరా అంటే కారాగారంలో బంధించండి’ అని కోపంగా ఆదేశించాడు మహారాజు. రాజు చెప్పినట్టే కొన్ని రూకలు ఇచ్చి పంపాడు మంత్రి.

కొద్దిరోజులు గడిచాయి. వేటకు అడవికి వెళ్లాలని మహారాజు నిర్ణయించుకున్నాడు. సైన్యాన్ని వెంటబెట్టుకొని బయలుదేరాడు. ‘మహారాజా మీరు చాలా ధైర్యవంతులు తెలివిగలవాళ్ళు వేటాడటంలో నైపుణ్యం గల వాళ్లు కాబట్టి మేము అందరం కోన దిక్కుకు వెళతాం మీరు చిట్టడివికి వెళ్ళండి కచ్చితంగా జయించగలరు’ అని సైన్యాధికారి చెప్పగానే మహారాజు పొంగిపోయాడు, అలాగేనంటూ బయలుదేరాడు. సైన్యం ఒకపక్క, రాజు మరోపక్క వెళ్లారు. మధ్యాహ్నం దాటిపోయింది. ఎండ వేడిమి ఎక్కువైంది. కనుచూపుమేరా ఎక్కడ నీటి జాడ కనిపించలేదు. మహారాజుకు గొంతు తడి ఆరిపోయింది. ఆ సమీపంలో సైన్యం కోసం ఎదురుచూశాడు. ఎక్కడా కనిపించలేదు. మహారాజులో భయం మొదలైంది. ప్రాణభయం పట్టుకుంది. కొద్ది దూరం వెళ్ళాడు. ఓపిక నశించింది. నీరసంతో అక్కడే కూలబడ్డాడు.

సమీపంలో కట్లు కొడుతున్న పాపన్న మహారాజును గుర్తించి తన భుజాలపై మోసుకుని వైద్యుని దగ్గరకు చేర్చాడు. కాసేపటికి మెళుకువ వచ్చిన మహారాజు ‘నన్ను వైద్యుని దగ్గరకు చేర్చిన ఆ ధర్మాత్ముడు ఎవరు?’ అని అడగ్గానే పాపన్నను చూపించారు మంత్రి. ‘నన్ను క్షమించు పాపన్న నువ్వింత మంచివాడవని నిజాయితీ పరుడని గ్రహించక శిక్ష విధించాను. అవమానపరిచాను. నన్ను క్షమించు’ అన్నాడు మహారాజు.. ఆ మాటకు పాపన్న గట్టిగా నవ్వి ‘మహారాజా.. ఒక మనిషిని ప్రశంసించడం అనేది అంత సులువు కాదు. దాని వెనుక ఒక గొప్ప పని వుండాలి. లేదా గొప్ప సహాయత వుండాలి. కీర్తి ప్రతిష్టలు కావాలి. కానీ మీరు కేవలం పొగడ్తకే పొంగిపోయి ధనం మొత్తం దానం చేసారు. మీరు ప్రాణాపాయ స్థితిలో వున్నప్పుడు నిన్ను చూడ్డానికి ఒక్కరూ కూడా రాలేదు. మీ బలహీనతను సొమ్ము చేసుకున్నారు. అది మీరు గ్రహించలేకపోయారు. పొగడ్తలకు పొంగిపోకూడదు. ఎద్దేవాలకు తల వంచకూడదు’ అని అన్నాడు పాపన్న.

‘నా కళ్ళు తెరిపించావు పాపన్న బాగా బుద్ధి వచ్చింది’ అంటూ పశ్చాత్తాపం చెందాడు మహారాజు. పాపన్న సహాయానికి మనస్ఫూర్తిగా అభినందించాడు. ​

నరెద్దుల రాజారెడ్డి

9666016636

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్