ఇక్కడ...
రక్తం లేదు.
రక్తం కారిన జాడలూ లేవు.
కానీ
ఒక్కో పదం
తుపాకీ గొట్టం నుంచి జారిన బుల్లెట్‌లా
గుండెను ఛేదిస్తోంది.
ఇక్కడ
ఫిరంగుల గర్జనలు లేవు.
అయినా...
భారీ పదాలు
ఒకదానికొకటి చేయి కలిపి
కవాతు చేస్తున్నాయి.
పేలుళ్లు లేవు.
పొగ లేదు.
దహనమవుతున్న ఊర్లూ లేవు.
కానీ...
నిశ్శబ్దం మాత్రం
యుద్ధభూమంత పొడవుగా
మనసుపై పరుచుకుంది.
కోపం లేదు.
ఏడుపు లేదు.
ఆర్తనాదాలూ లేవు.
అంతా ముగిసిపోయిన తర్వాత
మిగిలే శూన్యంలా
ప్రాణం తన స్వరాన్నే
నెమ్మదిగా మరచిపోతోంది.
ఇక మిగిలింది...
ఈ దిండు మాత్రమే.
అలసిపోయిన ఓటమికి
తలదాచుకునే చివరి ఒడిలా,
బాధకు
తెల్లని కప్పు కప్పే మేఘంలా,
మరణానికీ
శబ్దం రాకుండా
తలుపు తీసే మృదువైన చేతిలా.
యుద్ధం
ఎప్పుడూ తుపాకులతోనే జరగదు.
కొన్నిసార్లు
పదాలతో జరుగుతుంది.
కొన్నిసార్లు
మౌనంతో.
మరికొన్నిసార్లు
ఏమీ జరగనట్టే కనిపించే
ఈ నిశ్శబ్దంలోనే...
మనిషి
కొద్దికొద్దిగా చనిపోతాడు.
కంచర్ల జేవిఆర్
9490099231








కామెంట్‌లు (0)