భావాలకు అక్షర రూపమివ్వాలనే ఒక అభిలాష జనించినప్పుడు జీవితంలో నిత్యం సంఘటనలన్నీ కవితా వస్తువులే. మన చుట్టూ కనిపించే పలు రకాల మనుషుల అంతరంగాలూ కవిత్వాంశాలే. కవిత్వం అనేది కేవలం ఒక అందమైన అనుభూతి. అంతర్లీనంగా మదిలో మెదిలే భావాలకు అక్షర రూపం. ఊహాత్మక ఆలోచనల ప్రతిరూపం. ఆ కవిత్వం రచనలో భావాల అభివ్యక్తీకరణ, నవ్యత, గోప్యత, వస్తువైవిధ్యం చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ గుదిగుచ్చినట్లుగా కవయిత్రి కైకాల వెంకట సుమలత రాసిన ‘మౌన రాగాలు’ పుస్తకంలో స్పష్టంగా కన్పిస్తాయి. చదివిన ప్రతి కవితా ఒక వ్యక్తిగత అనుభవంలా మొదలై పాఠకుడి హృదయంలో సార్వ జనీన భావనగా మిగులుతుంది. ఆమె కవితల్లోని ప్రధాన బలం సరళత. అలంకారాల అతి ఎక్కడా కనిపించదు. గంభీరతకు భంగం కలగకుండా, పాఠకునికి చేరువయ్యే భావాలను సుస్పష్టంగా వ్యక్తపర్చారు. ఈ సంపుటిలోని 115 కవితలు జీవితం అనే విశాల ప్రదేశంలో విహరించే విభిన్న భావ ధారల ప్రతిరూపాలు. ప్రేమ, మౌనం, కుటుంబ బంధాలు, ఆశలు, ఆత్మ పరిశీలన, కాలం, మనసు, మానవ సంబంధాలు ఇవన్నీ సుమలత రాసిన కవితల్లో వ్యక్తమయ్యాయి. ‘ఏం మాయ చేసావో!’ వంటి కవితల్లో హృదయం పలికే ఆవేదన, ఆరాధన, అనురాగం వంటివి సుస్పష్టంగా కన్పిస్తాయి. ‘తీయ తీయని దాహం’లో జీవితంపై ఉన్న శాశ్వతమైన అన్వేషణను రూపకంగా ఆవిష్కరించింది. మనిషి అంతులేని కోరికల స్వరూపాన్ని మన కళ్ల ముందుంచుతుంది. ‘కుటుంబం’లో కుటుంబ విలువల గొప్పతనాన్ని ఆవిష్కరించారు. ప్రేమాభిమానాలే గృహాన్ని పవిత్రక్షేత్రంగా నిలబెడతాయని గుర్తుచేశారు. ‘తీయ తీయని దాహం’లో ఆశా జీవైన మనిషి కోరికలను నెరవేర్చుకునే క్రమంలో కష్టం, సుఖం, లాభం, నష్టం, అనుకూలత, ప్రతికూలతలు ఒక దాని వెంట మరొకటి ఉంటాయని అన్నట్లుగా చెప్పారు. ‘చివరిదాకా’లో జీవితంలో బాల్యం నుంచి చరమాంకం వరకూ ఎన్నో ఎత్తుపల్లాలు, ఆటుపోట్లు దాటుకుంటూ తప్పటడుగులు వేస్తూ తప్పులు సవరించుకుంటూ కొన్నిసార్లు సహనంతో మరికొన్ని సార్లు సాహసంతో ముందుకు సాగాలంటూ సరళమైన అలతి పదాలతో భావయుక్తంగా రాశారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
సాంకేతిక అభివృద్ధి కారణంగా సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు వచ్చాక సమాచారం మరింత సులభమైన తరుణంలో ఉత్తరం కనుమరుగైపోయిన వైనాన్ని ఉద్వేగ భరితంగా చెప్పటం చాలా బాగుంది. ఆమె కవితల్లో కొన్ని గుండె తలుపుల్ని తడితే మరికొన్ని హృదయాలను కదిలించేలా ఉన్నాయి. మరికొన్ని మనసుకు హత్తుకునేలా ఆలోచింపజేసేలా ఉన్నాయి. మొత్తంగా సమాజానికి మేలు చేసే విధంగా మెండుగా సామాజిక స్పృహ కలిగి ఉన్నాయి.
యడవల్లి శ్రీనివాసరావు
9490099214
వెల : రూ. 200/- ప్రతులకోసం :
9492656255








కామెంట్‌లు (0)