నిన్న సాయంత్రం రిటైర్మెంట్ ఫంక్షన్ అయ్యాక ఆలస్యంగా ఇంటికొచ్చి పడుకున్నాడు ఆనంద్. ఈరోజు నుంచి ఆఫీసుకు వెళ్ళక్కర్లేదు. ఆఫీసు అటెండర్, డ్రైవర్ అతనింటికి రారు. గడియారం కూడా నెమ్మదిగా తిరుగుతున్నట్లుగా ఉంది.
నీరజ కాఫీ కప్పు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది.
ఎదురుగ్గా ఉన్న టేబుల్ మీద ఎప్పటిలా ఫైళ్ళు లేవు.. ఆనంద్ అంతరంగ మస్తిష్కం లో మాత్రం పుస్తకంలో పేజీల్లాగా_ జ్ఞాపకాల దొంతరులు తెరుచుకుంటున్నాయి.
కాఫీకప్పును చేతిలో పట్టుకుని బాల్కనీలోకి వచ్చి కూర్చున్నాడు.
తన ముందు కూర్చున్న నీరజను గమనించాడు.
ఆమె జుట్టు అక్కడక్కడా నెరిసింది.ఆమె కళ్ళల్లో మాత్రం_ ప్రశాంతత కనిపిస్తోంది.
"నీరజా!"పిలిచాడు.
అతని పిలుపులో సంవత్సరాల తపన దాగి ఉందనిపించింది.
నీరజ నవ్వుతూ చూసింది ' ఎందుక' న్నట్లుగా?
నీరజకు దగ్గరగా జరిగాడు.
ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. "ఇన్నాళ్లూ నిన్ను పట్టించుకోలేకపోయాన"న్నాడు నెమ్మదిగా. ఆనంద్ కళ్ళు పశ్చాత్తాపం తో నిండిపోయాయి.
"గెజిటెడ్ ఆఫీసర్ గా ఇన్నాళ్లూ 'రాణిం'చానంటే_ ఆ వెనుక వెన్నుముకలా నీ కృషి ఉంది. ఇప్పుడు తెలుస్తోంది.నువ్వున్నావ్ కనుకనే నేను 'రాజు'లా వెలిగాను." అన్నాడు.
నీరజ మృదువుగా నవ్వింది. "మీకిప్పుడే తెలిసిందా నా ప్రేమ? ఈ క్షణమే అర్ధమైందా నా హృదయం?" అంది.
"అవును, నీ డైరీ చదివాకే తెలిసింది".
"పరాయి వారి డైరీ చదవడం తప్పు కదా?" అంది మెల్లగా.
"నిజమే.కానీ నువ్వు పరాయిదానివి కాదు. నాలో సగం. ఆ సగం అర్థమైంది" నీరజ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు.
ఆనంద్ మాటలతో, నీరజ కు_
కాలం వెనక్కు వెళ్లినట్లనిపించింది. డైరీలో ఒక్కొక్క పేజీ గతం గుర్తు చేస్తూ_ కళ్ళ ముందు సినిమా రీళ్లలా_ కదలాడింది.
ఆనంద్ ఒక మామూలు సాదా సీదా ప్రభుత్వ గుమస్తాగా ఉద్యోగం చేస్తున్నాడు. తాను ఉంటున్న ఇంటిని, నెలలో వచ్చే జీతాన్ని చూసి నిట్టూర్చేవాడు._
సగటు జీవి(తం).పైకి ఎగురలేడు. కిందకు దిగనూ లేడు.
పేరు చివర పేరు మోసిన డిగ్రీలు ఎన్నిచదివినా, అర్హతకు తగిన ఉద్యోగం రాలేదన్న అసంతృప్తి ఏ మూలనో ఉండి పోయింది.అయితే, ప్రేమించి
పెళ్లాడిన నీరజను, ప్రేమకు ప్రతిఫలం అయిన అరుణ్ ని చూసి, ఆ_ అసంతృప్తిని పక్కనపెట్టేసేవాడు.
ఇల్లు చిన్నది. జీతం ఇంకా చిన్నది. అయితే అతని హృదయం విశాలం.మమత_ అనంతం. ప్రేమ ఆకాశం.
భార్యా, బిడ్డలతో హాయిగా గడిపేవాడు.
సాయంత్రం సైకిల్ బెల్ వినబడటం తోనే నీరజ కళ్ళు గుమ్మం వైపు చూసేవి.నీరజ వీధి గుమ్మం చేరుకునేసరికి కళ్ళు వాకిట్లో ఉండేవి.
"అమ్మా!...'నాన్న!' వచ్చారంటూ ఐదేళ్ల అరుణ్ తండ్రి తెచ్చే చాక్లెట్ల కోసం సైకిల్ దగ్గరకు చేరిపోయేవాడు.
చాక్లెట్లు తీసుకోగానే అరుణ్ ముద్దిచ్చేవాడు.
"మా మంచి నాన్న" అంటూ చాక్లెట్లు పట్టుకుని ఆటలకు వెళ్లిపోయేవాడు.
"నీరూ!మన వాటా" అంటూ మూర మల్లెపూల దండను చేతిలో పెట్టేవాడు.నీరజ మురిపెంగా తీసుకునేది.
"అరుణ్ చాక్లెట్స్ తీసుకోగానే ముద్దిచ్చాడు.మరి నువ్వు?"_ కొంటెగా_ అనేవాడు.
"చాళ్ళెండి...సంబడం" అంటూ కవ్వించేది.
ఆరోజు ఆనంద్ నీరజ ల పెళ్ళిరోజు.
రాత్రయ్యింది.పున్నమి వెన్నెల పడకగది_ కిటికీ లోంచి గదిలోకి ప్రసరిస్తోంది.
ఆనంద్ పడుకోబోతూ కిటికీ వేయడానికి లేచాడు.
"ఎందుకో?" అంది కవ్వింపుగా.
"చందమామ చూస్తాడు" అన్నాడు అంతే కవ్వింపుతో.
"మెల్లగా వేయండి!"
"దేనికో?"
"బాబు లేస్తాడు".
"గడుసరివే"
"సొగసరిని కానా?"
"కాదన్నానా? కబుర్లతోనే_ వెన్నెల రాత్రిని కరిగించేస్తావా?" అంటూ నీరజను దగ్గరకు తీసుకున్నాడు.
తమకంతో ఆనంద్ ను అల్లుకు పోయింది.
ఆనంద్ తపనతో నీరజకు మరింత చేరువ అయ్యాడు.
కొంత సేపటి తరువాత
ఆనంద్,_ అరుణ్ తో సమానంగా ఆదమరిచి నిద్ర పోతున్నాడు.
నీరజ ముందు గదిలోకి వచ్చి తన డైరీ తీసుకుంది.
"ఈ పున్నమి రాత్రి ఎంతో అందంగా, ఆనందంగా గడిచింది.ఈ ఆనందం పదిలం కావాలి.ఆనంద్ ఎప్పుడూ, నాతో ప్రేమగా ఉండాలి." అని రాసింది.
తెల తెల్లగా తెల్లారింది.
ఆరోజు ఆదివారం.
ఆనంద్ అరుణ్ ను సైకిల్ సీటు మీద కూర్చోపెట్టి, సైకిల్ ను పట్టుకున్నాడు. ముందుకు నడిపిస్తున్నాడు.
"కాలు అందడం లేదు.పడి పోతా,నాన్నా!"
"నన్ను దాటి ఎదగాలి.నేను చూడాలి.నీ బాధ్యత నాది." అన్నాడు.
"సైకిల్ పై విన్యాసమా?"
తండ్రీ కొడుకుల కేసి ఆప్యాయంగా చూస్తూ అంది.
"కాదు... విహారం" అన్నాడు.
"అమ్మా! నేను ముందు కూర్చుంటాను.నువ్వు వెనుక సీటు మీద కూర్చో. నాన్న సైకిల్ తొక్కుతారు" అన్నాడు అరుణ్.
"అమ్మో! నాకు భయం కన్నా!" అని నీరజ._
"ఆనంద్ ఉండగా నీకుచింత ఇంకేల ఆ చింత?"_ నవ్వుతూ అన్నాడు సైకిల్ సీటు మీద కూర్చుంటూ.
"శ్రీవారు ప్రాసలో బాగా చెప్పారే"
" పడి పోకుండా సైకిల్ నడిపిస్తా"అంటూ నీరజ ను సైకిల్ వెనుక సీటు పై కూర్చోబెట్టాడు.మెల్లగా ముందుకు సైకిల్ తొక్కాడు.
ఆమె చేతులు ఆనందును_ వెనుక నుండి పట్టుకున్నపుడు
'సైకిల్ కదిలిందా, ఆమె గుండె కదిలిందా?' నీరజకు తెలియలేదు.ఆమె_ శ్వాస తాకిడికి అతడి మనసు ఎగిరినంత ఆనందంగా ఉంది. దారిలో ఫోటో స్టూడియో దగ్గర ఆపాడు. ఆనంద్ ను చూడగానే ఫోటో స్టూడియో అప్పారావు బయటకు వచ్చాడు.
" అప్పారావ్ !మా ముగ్గురికి ఈ సైకిల్ మీద ఉండగా ఓ ఫోటో తియ్యి" అన్నాడు.
అప్పారావు వెంటనే ఇన్ స్టెంటు_ కెమెరా తో ఫోటో తీసిచ్చాడు. మళ్ళీ ఇంటికి బయల్దేరారు.
భార్యా, బిడ్డలను సైకిల్ పై బాధ్యతగా ముందుకు నడిపిస్తున్న భర్త మీద అమితమైన ప్రేమ కలిగింది.ఆ ప్రేమనే, అక్షరాలలో వ్యక్త పరచాలనుకుంది.
డైరీ తీసింది.పేజీలు తిప్పింది.
"ఈ నాటి_ ఈ సంతోషం విలువ , కలం తో రాయలేనంత.కాలం తో కొలవలేనంత.నా ఆనందం అంబరాన్ని తాకింది.సంబరాలు జరుపుకోవడానికి పండుగే అవసరం లేదు.మనకంటూ మనసు, ఆ మనసును అర్ధం చేసుకునే తోడూ ఉంటే చాలును .మా ఇల్లు ఇరుకే..కానీ ఆయన హృదయం విశాలం.
జీతం తక్కువే.కానీ_ _జీవితం ఆనందమయం...ఆనందం మా సొంతం" అని రాసింది.
కె.వి. లక్ష్మణ రావు
9014659041








కామెంట్‌లు (0)