చూడటానికి చిన్నగా ఉండే పుట్టగొడుగుల్లో తక్కువ కేలరీలు, తక్కువ కొవ్వుతో పాటు ఫైబర్, బి-విటమిన్లు, సెలీనియం, కాపర్, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. కొన్ని రకాల పుట్టగొడుగుల్లో విటమిన్ D కూడా లభిస్తుంది. దాంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. వాటిలోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీర కణాలను రక్షించడంలో తోడ్పడతాయి. ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ తినే బదులు, పుట్టగొడుగులతో రుచికరమైన, సులభంగా చేసుకునే స్నాక్స్ కూడా తయారుచేసుకోవచ్చు. కూరగా, సూప్‌గా, ఫ్రైగా మాత్రమే కాకుండా సాయంత్రం స్నాక్‌గా కూడా పుట్టగొడుగులను చేసుకోవచ్చు. తక్కువ నూనెతో పాన్‌లో వేయించి మిరియాల పొడి, వెల్లుల్లి, కొత్తిమీరతో తయారుచేసే మష్రూమ్ స్నాక్ మంచి ఎంపిక. అలాగే మష్రూమ్ కట్లెట్, మష్రూమ్-వెజిటబుల్ టిక్కీ, మష్రూమ్ రోస్ట్, మష్రూమ్ సూప్ వంటి వంటకాలు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

మష్రూమ్ కట్లెట్
కావాల్సినవి: మష్రూమ్స్ – 200 గ్రాములు, బంగాళాదుంపలు – 2, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 2, అల్లం – చిన్న ముక్క, కొత్తిమీర – గుప్పెడు, మిరియాల పొడి – ½ టీస్పూను, గరం మసాలా – ½ టీస్పూను, కారం – ½ టీస్పూను, ఉప్పు – తగినంత, కార్న్‌ఫ్లోర్ – 2 స్పూన్లు, బ్రెడ్‌క్రంబ్స్ – ½ కప్పు, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ : మష్రూమ్స్‌ను శుభ్రంగా తుడిచి, చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి వేయించి, మష్రూమ్స్ వేసి అవి వదిలే నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకూ ఉడికించాలి. ఇలా చేయడం వల్ల కట్లెట్ మిశ్రమం మరీ తడిగా ఉండదు. ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా మెదిపి, అందులో మష్రూమ్ మిశ్రమం, కొత్తిమీర, కారం, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. కార్న్‌ఫ్లోర్ వేసి, మరోసారి కలిపి, మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి కట్లెట్ ఆకారంలో ఒత్తాలి. ప్రతి కట్లెట్‌ను బ్రెడ్‌క్రంబ్స్‌లో అద్ది ప్లేట్ లో పెట్టుకోవాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసి, కట్లెట్స్‌ను రెండు వైపులా మధ్యస్థ మంటపై బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. వేడివేడిగా పుదీనా చట్నీ లేదా టమాటా సాస్‌తో తింటే చాలా బాగుంటాయి.

వెజిటబుల్ టిక్కీ
కావాల్సినవి: మష్రూమ్స్ – 200 గ్రాములు, బంగాళాదుంపలు – 2, క్యారెట్ –1, బీన్స్ – ½ కప్పు, ఉల్లిపాయ – 1, పచ్చిమిర్చి – 1–2, అల్లం – చిన్నముక్క, కొత్తిమీర – 2 స్పూన్లు, కారం – ½ స్పూను, మిరియాల పొడి – ½ స్పూన్, గరం మసాలా – ½ స్పూన్, జీలకర్ర పొడి – ½ టీస్పూన్, ఉప్పు – తగినంత కార్న్‌ఫ్లోర్ – స్పూన్లు, బ్రెడ్‌క్రంబ్స్ – ½ కప్పు, నూనె – సరిపడా.
తయారీ : మష్రూమ్స్‌ను శుభ్రంగా తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం సన్నగా తరిగాలి. పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి వేయించాలి. తర్వాత మష్రూమ్స్, క్యారెట్, బీన్స్ వేసి నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకూ వేయించాలి. ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా మెదిపి, అందులో వేయించిన మష్రూమ్–కూరగాయల మిశ్రమం, కొత్తిమీర, కారం, మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. కార్న్‌ఫ్లోర్ వేసి మిశ్రమాన్ని బాగా కలిపి, చిన్న ఉండలుగా చేసి టిక్కీ ఆకారంలో ఒత్తాలి. ఒక్కో టిక్కీని బ్రెడ్‌క్రంబ్స్‌లో అద్దాలి. పెనం మీద కొద్దిగా నూనె వేసి, టిక్కీలను మధ్యస్థ మంటపై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకూ కాల్చాలి. అంతే మష్రూమ్ వెజిటబుల్ టిక్కీ రెడీ. వేడివేడిగా పుదీనా చట్నీ లేదా పెరుగు డిప్‌తో తింటే బాగుంటాయి.

క్రిస్పీ రోస్ట్
కావాల్సినవి: మష్రూమ్స్ – 200 గ్రాములు, కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్‌స్పూన్లు, బియ్యప్పిండి – స్పూను, పెరుగు – స్పూను, అల్లం- వెల్లుల్లి పేస్ట్ – ½ స్పూను, మిరియాల పొడి – ¼ స్పూను, ఉప్పు – తగినంత, కొత్తిమీర – కొద్దిగా, నూనె – అవసరమైనంత.
తయారీ: మష్రూమ్స్‌ను శుభ్రంగా తుడిచి ముక్కలుగా కోసుకోవాలి. పెరుగు, కార్న్‌ఫ్లోర్, బియ్యప్పిండి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పుతో మష్రూమ్స్‌ను కలిపి 10 నిమిషాలు ఉంచాలి. తర్వాత పెనంలో కొద్దినూనె వేసి మష్రూమ్స్‌ను మధ్యస్థ మంటపై క్రిస్పీగా రోస్ట్ చేయాలి. చివర్లో కొత్తిమీర చల్లి వడ్డించాలి. అంతే మష్రూమ్ క్రిస్పీ రోస్ట్ రెడీ. ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.








కామెంట్‌లు (0)