తాతయ్య..! ఆకాశంలో ఆ చుక్క ఏమిటి? చాలా పెద్దగా ఉంది. దాన్ని ఏమంటారు అంటూ పిల్లలు అడిగారు. తాతయ్య ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ, ఆ చుక్కను ‘వేగుచుక్క’ అంటారు’ అని చెప్పాడు. ‘అంటే అది నక్షత్రమా తాతయ్య?’ అంటూ అమాయకంగా ముఖం పెట్టారు పిల్లలు. ఈలోగా పిల్లల ఆసక్తిని చూసి వేగుచుక్క తన కథను చెప్పడం ప్రారంభించింది.
‘పిల్లలూ..
నేను శుక్ర గ్రహాన్ని. నన్ను ‘వేగుచుక్క’, ‘సంధ్యాతార’ అంటారు. కానీ నేను నక్షత్రాన్ని కాను, నేను ఒక గ్రహాన్ని! ఆకాశంలో నక్షత్రాలు - అంటే సూర్యుడు లాంటి వాళ్లు - చాలా పెద్ద కుటుంబం. వాళ్లు కోట్ల మంది. వాళ్లకు సొంతంగా మండే శక్తి ఉంది. వాళ్లు స్వయం ప్రకాశకులు. చాలా దూరంలో ఉండబట్టే వాళ్లు చిన్న చిన్నగా ప్రకాశిస్తూ కనిపిస్తారు. మేము గ్రహాలం. సూర్యుడు చుట్టూ తిరిగే పిల్లలం. మాకు సొంత వెలుగు లేదు. సూర్యుడి దగ్గర వెలుగు అరువు తెచ్చుకుని, అద్దంలా మెరుస్తాం.
మీరు ఎలా కనిపెట్టాలి?
రాత్రి ఆకాశంలో తళుక్కుమని మెరుస్తుంటే అది నక్షత్రం. అలా కాకుండా స్థిరంగా వెలుగుతుంటే అది గ్రహం. అంటే నేనే! నేనెందుకు అంత తెల్లగా మెరుస్తున్నాను? అంటే.. ఆకాశంలో చంద్రుడి తర్వాత అత్యంత ప్రకాశవంతమైన వాడిని నేనే. నా చుట్టూ మందపాటి తెల్లని మేఘాల పొర ఉంది. ఆ పొర సూర్యుడి వెలుగును 75 శాతం వెనక్కి తిప్పి పంపేస్తుంది. అందుకే నేను ఇంత తెల్లగా, పెద్దగా కనిపిస్తాను. మీ తాతలు నన్ను ఉదయం 5 గంటలకు తూర్పున చూసి ‘వేగుచుక్క’ అని పిలిచారు. సాయంత్రం 6 గంటలకు పడమర చూసి ‘సంధ్యాతార’ అన్నారు. నా గురించి అంతా మీకు చెప్పేశాను కదా! ఇక నుంచి మీరు నన్ను ‘చుక్క’ అనకండి. నేను మీ భూమికి కవల సోదరుడిని. సైజు దాదాపు ఒకటే. నన్ను హాయిగా చూసి ఆనందించండి. ఉంటా మరి’ అని వేగుచుక్క తన కథ చెప్పి వెళ్లిపోయింది. కొత్త విషయం తెలిసిందన్న ఆనందంలో పిల్లలు కూడా ఇంట్లోకి వెళ్లారు.
- యం. రాం ప్రదీప్,
జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు,
94927 12836.







కామెంట్‌లు (0)