సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజోల పాడిన బుజ్జి మేక

23 గంటల క్రితం

జోల పాడిన బుజ్జి మేక image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 04:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

మేకల మంద మేతకు బయలుదేరింది. అందులో ఓ బుజ్జి మేక ఉంది. అది తల్లి వెనకాలే నడవసాగింది. కొంత దూరం వెళ్లాక చూస్తే తల్లి కనిపించలేదు. మిగతా మేకలు, కాపరి జాడ కూడా లేదు. దారి తప్పినట్లు గ్రహించింది. ఏడుపు తన్నుకొచ్చింది. ఎటు పోవాలో తెలియలేదు. ఎలాగోలా మందను చేరుకోవాలని ముందుకు నడిచింది. ఇంతలో రెండు కుక్కలు బుజ్జి మేకను చూశాయి. మెల్లగా దగ్గరకు వచ్చాయి. కుక్కలను చూడగానే దానికి భయం వేసింది. కుక్కలు బుజ్జి మేక దగ్గరకు వచ్చి, ‘ఈరోజు ఆహారంగా దొరికావు. నిన్ను వదిలిపెట్టం’ అన్నాయి. బుజ్జి మేక వణికిపోయింది. లేని ధైర్యాన్ని తెచ్చుకుంది. శత్రువు కనిపిస్తే ఎలా తప్పించుకోవాలో తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వాటితో మాటలు కలిపింది.

‘నేను బుజ్జి మేకను కదా! నన్ను తింటే మీ కడుపు నిండుతుందా!’ అని ప్రశ్నించింది.

‘ఇక్కడ ఉన్నది నువ్వేగా! ఎలాగోలా సర్దుకుంటాం’ అన్నాయి కుక్కలు.

‘మీ కడుపు నిండే మార్గం చెబుతాను’ అన్నది బుజ్జి మేక.

‘ఎలా?’ అని ప్రశ్నించాయి కుక్కలు.

తనతోపాటు తల్లి కూడా వచ్చిందని బుజ్జి మేక చెప్పింది.

‘ఎక్కడ?’ అని అడిగాయి.

‘దూరంగా మేతకు వెళ్లింది. వచ్చే సమయమైంది’ అని చెప్పింది బుజ్జి మేక. తల్లి కూడా వచ్చాక వాటిని ఆహారంగా భుజించవచ్చని మనసులో సంబరపడ్డాయి కుక్కలు.

ఇంతలో బుజ్జి మేకకు నిద్ర వస్తుందని చెప్పింది. పడుకోమన్నాయి. తల్లి రాగానే లేపమంది. సరేనన్నాయి కుక్కలు. నిద్ర రావాలంటే పాట పాడమని కోరింది. కుక్కలు నవ్వుకున్నాయి. ‘మాకు పాటలు రావు. నీకు వచ్చా?’ అని ప్రశ్నించాయి.

తమ అమ్మ తనను నిద్రపుచ్చేందుకు జోలపాట పాడుతుందని చెప్పింది బుజ్జి మేక. అయితే పాడమన్నాయి కుక్కలు. బుజ్జి మేక గొంతు సవరించుకుని జోలపాట అందుకుంది. బుజ్జి మేక సగం పాట పాడగానే కుక్కలు నిజంగానే నిద్రలోకి జారుకున్నాయి. బుజ్జి మేక వాటి బారి నుంచి తప్పించుకుంది. ఇంతలో దూరంగా కాపరి తనవైపు రావడం గమనించింది. పరుగున మందలో కలిసి తల్లిని చేరింది బుజ్జి మేక.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర,

బీటెక్ మూడవ సంవత్సరం (ఈసీఈ),

ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల, ఖమ్మం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్