శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎవరు గొప్ప?

22 గంటల క్రితం

ఎవరు గొప్ప? image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 03:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఒక వేటగాడు అడవి లోకి ప్రతిరోజూ వేటకు వెళ్లేవాడు. ఒకరోజు బిడ్డలకు గింజలు తీసుకెళ్తున్న ఒక ఆడ పావురం వేటగాడి వలలో చిక్కుకుంది. దానిని చేతిలోకి తీసుకుని వేటగాడు అక్కడే ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అతని ముఖం బాధగా ఉన్నట్లు పావురం గమనించింది. ‘ఎందుకు బాధగా ఉన్నావు?’ అని పావురం అడిగింది. వేటగాడు నిట్టూర్చి, ‘చాలా రోజుల నుండి నన్ను ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంది. దానికి నువ్వు నిజాయితీగా సమాధానం చెబితే నిన్ను చంపకుండా వదిలేస్తాను. నీ పిల్లల దగ్గరకు వెళ్లిపోవచ్చు’ అన్నాడు. వేటగాడి మాటలకు పావురం ఫక్కున నవ్వింది. ‘నేను నిజమే చెబుతున్నాను. ఈ ప్రపంచంలో మనుషుల కంటే తెలివైనవారు, గొప్పవారు ఇంకెవరున్నారు? నిజాయితీగా సమాధానం చెబితే కచ్చితంగా వదిలేస్తాను. నన్ను నమ్ము’ అన్నాడు వేటగాడు. ‘ఈ ప్రపంచంలో ఒక్క జాతి మాత్రమే గొప్పది కాదు. ఒక్కరే గొప్పవారు కారు. దేని గొప్పదనం దానిదే. దేని ప్రత్యేకత దానిదే. మనుషులు తెలివైనవారే. కానీ అందరికంటే గొప్పవారు అని అనుకోవడం సరైంది కాదు. నువ్వు కాళ్లతో తొక్కేస్తే నలిగిపోయే చీమలను చూడు. అవి ఎంత చిన్నవైనా, అలసట తెలియకుండా కష్టపడతాయి. శ్రమలో వాటికంటే గొప్పవారు ఎవరున్నారు? అలాగే సాలీడును చూడు. అది నేసే గూడు ఎంత అద్భుతంగా ఉంటుందో! నైపుణ్యంలో దానికి సాటి ఎవరు? చెట్లను చూడు రాళ్లు విసిరినా పండ్లే ఇస్తాయి. క్రమశిక్షణలో, సేవలో అవే గొప్పవి. భూమిని చూడు ఎంత భారం మోస్తుందో? తేనెటీగలు కలిసి పనిచేయడం నేర్పుతాయి. నదులు ఆగకుండా ముందుకు సాగడం నేర్పుతాయి. సూర్యుడు సమయపాలన నేర్పుతాడు. అందుకే ఈ ప్రకృతిలో ప్రతి జీవి నుంచి నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుంది. తనను తాను గొప్పవాడినని చెప్పుకునేవాడు గొప్పవాడు కాదు. ప్రతి జీవిలోని గొప్పతనాన్ని గుర్తించేవాడే నిజమైన గొప్పవాడు. ఇతరులను చిన్నచూపు చూడకుండా, వారి మంచి గుణాలను గౌరవించే వాడే అసలు సిసలైన గొప్పవాడు’ అని చెప్పడం ఆపింది పావురం. ఆ మాటలు వేటగాడి హృదయాన్ని తాకాయి. అప్పటివరకు తన మనసులో ఉన్న బాధంతా తేలిపోయింది. అంతేకాదు, బతకడానికి పక్షుల్ని చంపడం ఒకటే మార్గం కాదని తెలుసుకున్నాడు. కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే చేతిలోని పావురాన్ని ప్రేమగా నిమురుతూ ఆకాశంలోకి ఎగరేశాడు. అది తన పిల్లల దగ్గరకు ఆనందంగా వెళ్లిపోయింది.

​– పేరూరు బాలసుబ్రమణ్యం,

98492 24162.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్