చింటూ, బన్నీ మంచి స్నేహితులు. ఒకే బడిలో ఆరో తరగతి చదువుతున్నారు. ఇద్దరివీ పక్కపక్క ఇళ్లు కావడంతో ఆటలు, చదువు అన్నీ కలిసి గడుపుతారు. ఆ రోజు బన్నీ వాళ్ళమ్మ మైసూర్ పాక్ చేసింది. బడి నుంచి రాగానే అమ్మ మైసూర్ పాక్ ఇచ్చింది. అది తిని ‘అమ్మా! చింటూకి కూడా పెడతాను. మైసూర్ పాక్ ఇవ్వు. తిని ఆడుకుంటాము’ అన్నాడు. అమ్మ ఇచ్చిన మైసూర్ పాక్ చింటూకి ఇచ్చాడు. వాడు అది తీసుకొని, తన జేబులోంచి జంతికలు తీసి బన్నీకి ఇచ్చాడు. వాళ్ళ అమ్మలు చేసిన జంతికలు, మైసూర్ పాక్ తింటూ మెచ్చుకున్నారు. కరకర, తీపి పాక్ లాగించారు.
ఆ రోజు పెద్దగా హోంవర్క్ లేకపోవడంతో ‘కాసేపు ఆడుకుందాం’ అని బన్ని, చిన్ని రెండిళ్ల అవతల పిల్లలు డాబామీద గాలిపటం ఎగరేయడం చూసి, ‘మనం కూడా గాలిపటం ఎగరేద్దాం’ అనుకున్నారు. ‘నా దగ్గర లేదు గాలిపటం’ అన్నాడు బన్నీ.
నా దగ్గర ఉంది ఆదే ఎగరేద్దాం’ అన్నాడు చింటూ. ఇద్దరూ గాలిపటం తీసుకుని, డాబామీదకు వెళ్లారు. ‘అక్కడ ఓ మూల చెక్కలు, ఇనుప ఊచలు, నాప రాళ్లు పెట్టి ఉన్నాయ్. మనం అటు వెళ్లకుండా ఇక్కడ ఎగరేసుకుందాం’ అన్నాడు చింటూ. ఇద్దరూ గాలిపటం ఎగరేయడం మొదలు పెట్టారు. అది అలా అలా పైకి పైకి ఎగురుతుంటే సంబరపడ్డారు. ఇంతలో గాలిపటం ఉన్నట్టుండి కిందకి పడిపోసాగింది. చింటూ దారం అటూ ఇటూ తిప్పినా ఆగకుండా వచ్చి, డాబా పిట్టగోడ పక్కన ఉన్న కరెంటువైర్ మీద పడింది. అది చూసి బన్నీ గబుక్కున అటువెళ్లి, అక్కడ ఉన్న ఇనుప ఊచ తీసుకొని, దాంతో గాలిపటం తీయాలి అనుకున్నాడు. చింటూ వెంటనే దారం వదిలేసి పరుగునవెళ్ళి ఒక చెక్క తీసుకుని, ఆ ఊచమీద కొట్టి బన్నీని వెనక్కులాగాడు. బన్నీ ఆశ్చర్యపోయి కోపంగా ‘ఏంటిరా అలా కొట్టి పడేసావు’ అని అరిచాడు.
‘నీకు మతి లేదేమిటిరా?. ఆ ఇనుప ఊచకి కరెంటు వైరు తగిలితే షాక్ కొట్టి పడిపోతాం. నువ్వు గాలిపటం మీద ధ్యాసలో అది గమనించకుండా ఇనుప ఊచ తీసావు తెలుసా?’ అన్నాడు చింటూ.
‘అవున్రా. నేను అది ఆలోచించలేదు.. థాంక్స్ రా’ అన్నాడు బన్నీ.
‘అందుకే ‘‘మా అమ్మ గాలిపటం డాబా మీద నుండి ఎగరేయవద్దు. పార్కుకి వెళ్లి ఎగరేయండి అని చెబుతుంది. అప్పుడు కరెంటువైరుల ప్రమాదం తప్పించుకోవచ్చు’’ అన్నాడు చింటూ.
‘ఎటొచ్చీ చెట్ల మీద చిక్కుకుంటుంది కదా!’ అన్నాడు బన్నీ. ‘అయినా మన ప్రాణాలకు ప్రమాదం ఉండదు. ఇంకో గాలిపటం కొనుక్కోవచ్చు’ అన్నాడు చింటూ.
‘నిజమేరా! మా పిన్నికొడుకు వైజాగులో డాబా మీద టవల్ ఆరేసి గాలికి అది ఎగిరి, కరెంటు వైర్ మీద పడితే, తియ్యబోయి షాక్ కొట్టి, చేతి వేళ్ళు అతుక్కుపోయాయట మా అమ్మ చెప్పింది’ అన్నాడు బన్నీ.
‘అందుకే మా అమ్మ డాబా మీద ఆడుకోవద్దు అని చెబుతుంది’ అన్నాడు చింటూ.
‘పోనీలే. ఇకనుంచి జాగ్రత్తగా ఉందాం’ అని నవ్వుకుంటూ మెట్లు దిగి, ఒకరి భుజాల మీదా ఒకరు చేతులు వేసుకుని, పార్క్ లో ఆడుకోవడానికి వెళ్లారు.


ముంజులూరి కృష్ణ కుమారి
8074633236









కామెంట్‌లు (0)