అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో చింటూ అనే ఒక చిన్న కుందేలు ఉండేది. చింటూ చాలా మంచిది. కానీ దానికి ఒక అలవాటు ఉండేది. ఏ పనినైనా ‘‘తర్వాత చేద్దాంలే, రేపు చూద్దాంలే’’ అని వాయిదా వేస్తూ ఉండేది. ఒకరోజు అడవిలోని జంతువులన్నీ సమావేశమయ్యాయి. "ఇంకొద్ది రోజుల్లో వర్షాకాలం రాబోతుంది. అందరం ఇప్పుడే ఆహారం సేకరించి దాచుకోవాలి. ఈసారి వర్షాలు చాలా తీవ్రంగా ఉంటాయని పెద్దల మాట" అని ఏనుగు తాత హెచ్చరించింది. అన్ని జంతువులు అందుకు సమ్మతించి వెంటనే పనిలో పడ్డాయి. చింటూ స్నేహితుడైన బన్నీ అనే ఉడుత కూడా రోజూ కష్టపడి పండ్లు, గింజలు దాచుకోసాగింది. "చింటూ! నువ్వు కూడా ఆహారం వెతుక్కోవచ్చు కదా? వర్షాలు వస్తే బయటకు రాలేవు. అప్పుడు ఆకలితో అలమటించాల్సి వస్తుంది" అంది బన్నీ. దానికి చింటూ బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ, "ఇంకా చాలా సమయం ఉందిలే బన్నీ! ఆకాశంలో కనీసం ఒక్క మబ్బు ముక్క కూడా లేదు. ఈరోజు కాకపోతే రేపు వెతుక్కుంటాను" అని చెప్పి నిర్లక్ష్యంగా ఆడుకోవడానికి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి. బన్నీ ప్రతిరోజూ గుర్తు చేస్తున్నా, చింటూ మాత్రం రోజుకో నెపం చెప్తూ కాలం గడిపేసింది. ఒకరోజు ఉదయం చింటూ నిద్ర లేచేసరికి ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో నిండిపోయి, చీకటి కమ్మేసింది. చింటూ కంగారుగా, "అయ్యో! ఈరోజు ఎలాగైనా ఆహారం తెచ్చుకోవాలి" అని బయటకు వెళ్ళబోయింది. కానీ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఉరుములు ఉరిమి, కుండపోత వర్షం మొదలైంది. వాన ఎంతకీ తగ్గడం లేదు. అడవంతటా నీరు నిండిపోయింది. చింటూ చెట్టు తొర్రలోనే ఉండిపోయింది. దానికి ఆకలితో కడుపు నకనకలాడుతోంది. తినడానికి ఒక్క గింజ కూడా లేదు. ఏనుగు తాత మాట విననందుకు, పనిని వాయిదా వేసినందుకు ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు పక్క తొర్రలో ఉన్న బన్నీకి వినిపించింది. అది ఎలాగోలా కష్టపడి వర్షంలో తడుస్తూ చింటూ దగ్గరకు కొన్ని పండ్లు, గింజలు తీసుకొచ్చింది. "చింటూ, ఏడవకు! ఇదిగో ఈ పండ్లు తిను. ఇవన్నీ నీకోసమే తెచ్చాను" అని స్నేహితుడిని ఓదార్చింది బన్నీ. చింటూ సంతోషంగా ఆ పండ్లను తిని, తన ఆకలి తీర్చుకుంది. బన్నీ కాసేపాగి తన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే, వర్షం ఒక్కరోజుతో ఆగలేదు. వరుసగా మూడు రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. క్రమంగా అడవిలో నీటి మట్టం పెరిగిపోయింది. బన్నీ నివసిస్తున్న తొర్ర చెట్టు కింది భాగంలో ఉండటంతో, వరద నీరు బన్నీ తొర్రలోకి చేరడం ప్రారంభమైంది! బన్నీ ఎంతో కష్టపడి దాచుకున్న పండ్లు, గింజలన్నీ ఆ నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి బన్నీ తడిసి ముద్దవుతూ, వణుకుతూ ఎలాగోలా పైనున్న చింటూ తొర్రలోకి చేరుకుంది. తనకు ఆహారాన్ని అందించి కాపాడిన బన్నీ సర్వస్వం కోల్పోయి, ఆకలితో, చలితో వణకడం చూసి, చింటూ మనసు విలవిల్లాడిపోయింది. వెంటనే ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది. కానీ ఇప్పుడు ఇద్దరికీ ఆకలి వేస్తోంది. చింటూ వర్షంలోనే చెట్టు కింద పడిన ఒక పెద్ద జామపండు తెచ్చింది. చింటూ ఏమాత్రం ఆలోచించకుండా ఆ పండును రెండు ముక్కలు చేసి, పెద్ద ముక్కను బన్నీకి ఇస్తూ.. "బన్నీ, ఇద్దరం కలిసి దీన్ని తిందాం" అంది. బన్నీ కళ్ళల్లో ఆనందబాష్పాలు రాలాయి. ఇద్దరూ ఆ సగం పండు తిని, ఆకలి తీర్చుకున్నారు. మరుసటి రోజుకి వర్షం తగ్గి, అడవి ప్రశాంతంగా మారింది. చింటూ పశ్చాత్తాపంతో బన్నీ చేతులు పట్టుకుని, "నన్ను క్షమించు బన్నీ. నువ్వు అప్పుడే చెప్పావు, కానీ నేను వినకుండా 'రేపు చూద్దాం' అని వాయిదా వేసాను. నీకు ఈ పరిస్థితి రావడానికి కూడా నా బద్ధకమే కారణం. నేను ముందే ఆహారం దాచుకుని ఉంటే, ఇవాళ ఇద్దరం హాయిగా ఉండేవాళ్ళం. నాకు ఇప్పుడే బాగా తెలిసింది.. ఇవాల్టి పని ఇవాళే చేయాలి, రేపటి వరకు వాయిదా వేయకూడదని" అంది. “పోనీలే చింటూ, ఇప్పటికైనా తెలుసుకున్నావు. పైగా ఆపదలో ఉన్నప్పుడు స్వార్థం లేకుండా నీకున్న కొద్దిపాటి ఆహారాన్ని నాతో పంచుకున్నావు. నిజమైన స్నేహమంటే ఇదే! ఏ పనినీ రేపటి వరకు వాయిదా వేయకూడదు. సమయాన్ని వృథా చేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది” అని సంతోషంగా బన్నీ చింటూను హత్తుకుంది. ఆ రోజు నుండి చింటూ తన బద్ధకాన్ని పూర్తిగా వదిలేసింది. ఏ పనినైనా వాయిదా వేయకుండా వెంటనే చేయడం ప్రారంభించింది.
కె.వి. సుమలత
9492656255








కామెంట్‌లు (0)