ప్రజాశక్తి-విశాఖపట్నం: తెలుగు సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వర్ధమాన సాహితీవేత్తలకు వేదిక కల్పించే లక్ష్యంతో అక్టోబర్ 10, 11 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘సాహిత్య సమ్మేళనం–2026’ పోస్టర్‌ను పోస్టర్ ఆవిష్కరణలో ద్రవిడియన్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.ఎస్. చలం, సాహితీ ప్రస్థానం మేనేజర్ ఎం.వి.ఎస్. శర్మ, ఏఎస్‌వీకే ప్రోగ్రామ్స్ ఇన్‌చార్జి జి.వి. రాజేశ్వరరావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాబాగార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం (ఏఎస్‌వీకే)లో రెండు రోజులపాటు సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. కథ, కవిత్వం, విమర్శ తదితర సాహిత్య ప్రక్రియలపై ప్రముఖ సాహితీవేత్తల ప్రసంగాలు, సమకాలీన సాహిత్య ధోరణులు, సాహిత్యంలో వస్తున్న మార్పులు, కొత్త తరం రచయితలు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వర్ధమాన సాహితీవేత్తలతో ఇష్టాగోష్టి, సాహిత్య చర్చలు, ప్రసంగాలు సమ్మేళనంలో ప్రధానంగా ఉంటాయని తెలిపారు. యువ రచయితలు, కవులు తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకునేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుందన్నారు. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల నుంచి సాహిత్యాభిమానులు, రచయితలు, కవులు, విద్యార్థులు, వర్ధమాన సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. సాహితీ స్రవంతి, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాల్గొనదలచిన వారు రూ.100 రిజిస్ట్రేషన్ రుసుము చెల్లించి, నిర్వాహకుల వాట్సాప్ నంబర్లకు ‘Sahitya Sammelanam’ అని పేర్కొంటూ తమ పేర్లు పంపి నమోదు చేసుకోవాలని సూచించారు. పాల్గొనే వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణలో అరసం రాష్ట్ర కార్యదర్శి ఉప్పల అప్పలరాజు, రచయిత అట్టాడ అప్పలనాయుడు, సాహితీ స్రవంతి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు, కవులు పాయల మురళీకృష్ణ, జి.వి.ఎస్. జయపాల్‌రావు, రచయిత దాసు తిరుపతిరాజు, సాహితీ స్రవంతి విశాఖ జిల్లా అధ్యక్షుడు పి. ఫ్రాన్సిస్, ఉపాధ్యక్షురాలు కె. సంతోషం, పాత్రికేయుడు డి. రవికుమార్, అనకాపల్లి జిల్లా బాధ్యుడు కోరాడ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
సాహిత్య సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 16, 2026, 11:23 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)