ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలవరం జిల్లాలో 43 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగింపు

47 నిమిషాల క్రితం

Polling concluded at 3 PM in 43 polling stations within the Polavaram constituency.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 04:31 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

జిల్లా యంత్రాంగం ప్రతిపాదన మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు.

భద్రతా కారణాలతో ఏడు మండలాల్లో పోలింగ్ సమయం కుదింపు.

ఓటర్లు నిర్ణీత సమయానికి ముందే ఓటు హక్కు వినియోగించుకోవాలి: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్


ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : పోలవరం జిల్లాలో నవంబర్ 3,న నిర్వహించనున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సమయానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె దినేష్ కుమార్ ఆదివారం తెలిపారు.జిల్లా యంత్రాంగం చేసిన ప్రతిపాదన మేరకు, భద్రతా కారణాల దృష్ట్యా చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాల్లో గుర్తించిన 43 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగింపు సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు మారుస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు.మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో యథావిధిగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు.


పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామన్నారు. సంబంధిత పోలింగ్ కేంద్రాలన్నీ వామపక్ష తీవ్రవాద (ఎల్ డబ్ల్యూ ఈ) ప్రభావిత ప్రాంతాల్లో ఉండటంతో బాటు,దట్టమైన అటవీ ప్రాంతాలు,కష్టతరమైన కొండ ప్రాంతాలు, పరిమిత రహదారి అనుసంధానం, ప్రమాదకరమైన రవాణా మార్గాలు ఉన్న నేపథ్యంలో భద్రతాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరిందన్నారు.ఈ ప్రతిపాదనను క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. నవంబర్ 3న జరిగే పోలింగ్‌తో బాటు, అవసరమైతే నవంబర్ 4న నిర్వహించే రీపోలింగ్‌కు కూడా ఈ సమయ మార్పు వర్తిస్తుందని తెలియ చేయడం జరిగిందన్నారు.


పోలవరం జిల్లాలో మొత్తం: 7 మండలాల్లో 43 పోలింగ్ కేంద్రాలు ....

మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసే కేంద్రాల వివరాలు.1. వై. రామవరం మండలం: పోలింగ్ కేంద్రాలు1, 2, 8 — మొత్తం 3 కేంద్రాలు.(2).గుర్తేడు మండలం:పోలింగ్ కేంద్రాలు 1, 2, 3, 4, 5, 10, 11 — మొత్తం 7 కేంద్రాలు.(3). మారేడుమిల్లి మండలం:పోలింగ్ కేంద్రాలు 1, 2, 8, 11 — మొత్తం 4 కేంద్రాలు. (4).దేవీపట్నం మండలం:పోలింగ్ కేంద్రం 26 — మొత్తం 1 కేంద్రం.(5). రాజవొమ్మంగి మండలం:పోలింగ్ కేంద్రాలు 3,4, 6,7,14, 17, 24 — మొత్తం 7 కేంద్రాలు.(6). రంపచోడవరం మండలం:పోలింగ్ కేంద్రాలు 1, 2, 3, 4 — మొత్తం 4 కేంద్రాలు.(7)చింతూరు మండలం:పోలింగ్ కేంద్రాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10, 14, 15, 18, 19, 20, 21, 22, 23 — మొత్తం 17 కేంద్రాలకు.జిల్లా యంత్రాంగం చేసిన ప్రతిపాదన మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా, సంబంధిత మండలాల్లో ఓటర్లకు పోలింగ్ సమయ మార్పుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులకు సూచించారు. మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసే 43 కేంద్రాలకు చెందిన ఓటర్లు తమ ఓటు హక్కును మధ్యాహ్నం 3 గంటలలోపు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయవచ్చని స్పష్టం చేశారు.ఓటర్లు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రం,పోలింగ్ ముగింపు సమయాన్ని ముందుగానే తెలుసుకొని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్