చైర్మన్ కు 6, వార్డు స్థానాలకు 107 మంది పోటీ
రాయదుర్గం (అనంతపురం) : త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చైర్మన్ మరియు వార్డు సభ్యుల స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఆదివారం మున్సిపల్ ఎన్నికల అధికారులు విడుదల చేశారు. మున్సిపల్ చైర్మన్ స్థానానికి 6 పార్టీల తరఫున 6 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ (బి.ఎస్.పి) తరఫున గొల్ల నాగరాజు, తెలుగుదేశం (టిడిపి) తరపున టెంకశాల హనుమంతు, భారత జాతీయ కాంగ్రెస్ ( ఐ ఎన్ సి ) తరపున పెడేకల్ మహమ్మద్ రఫీక్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొరాలు శివకుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపి) తరఫున బొమ్మిశెట్టి వెంకటరమణ, భారత చైతన్య యువజన( బిసివై ) పార్టీ తరఫున మాదిగ విజయ్ కుమార్ ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా 40 మున్సిపల్ వార్డు సభ్యుల స్థానాలకు గాను 107 మంది అభ్యర్థులు ఎన్నికల పోటీలో ఉన్నారు. వీరిలో తెలుగుదేశం పార్టీ తరఫున 35 మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 40 మంది, బీఎస్పీ తరఫున ఒకరు, భారత జాతీయ కాంగ్రెస్ తరపున ఎనిమిది మంది ఏఏపి తరఫున ఒకరు, బిజెపి తరఫున 5 మంది, సిపిఐ తరఫున ఒకరు, ఏఐఎంఐఎం తరపున ముగ్గురు, జనసేన తరపున ఇద్దరూ, స్వతంత్ర అభ్యర్థులు పదిమంది పోటీలో ఉన్నారు. ఎన్నికల పోలింగ్ నవంబర్ మొదటి తేదీన ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. అదేవిధంగా నవంబర్ మూడవ తేదీన ఓట్ల లెక్కింపు రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఆవరణలో ఉదయం 8 గంటల నుండి జరుగుతుందని తెలిపారు.







కామెంట్‌లు (0)