ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆర్నబ్ తుఫాను ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం !

54 నిమిషాల క్రితం

District administration on alert in the wake of the threat from Cyclone Arnab!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 04:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జ‌ర‌క్కుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు

- ఉద్ధృతంగా గాలులు వీచే అవ‌కాశ‌మున్నందున ముందు జాగ్ర‌త్త‌లు

- క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌త్యేకంగా కంట్రోల్ రూమ్ (91549 70454) ఏర్పాటు

- జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ


ప్రజాశక్తి- ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : "ఆర్నబ్" తుఫాను ప్రభావంతో జిల్లాలో పెనుగాలులతో పాటు భారీ వ‌ర్షాల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు సహాయక, రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.


జిల్లాలో తుఫాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, విద్యుత్, పౌరసరఫరాలు, వైద్య, జలవనరులు తదితర శాఖల జిల్లా అధికారులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రోడ్ల పక్కన ఉన్న భారీ హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. హోర్డింగ్‌ల ఫ్రేమ్‌లపై ఉన్న ఫ్లెక్సీలను తొలగించి ఖాళీగా ఉంచాలని, జోన్ల వారీగా తొలగింపు నివేదికలను సమర్పించాలని స్పష్టం చేశారు. కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, పాత భవనాలు, శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసిస్తున్న వారిని ముందుగానే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన పునరావాస కేంద్రాలుగా విద్యాసంస్థల భవనాలు, ఫంక్షన్ హాళ్లను సిద్ధం చేయాలని సూచించారు. తుఫాను ప్రభావిత పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అంబులెన్సులను వికేంద్రీకరించి అన్ని డివిజన్లు, మండలాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యుత్ సామాగ్రిని అవసరమైన ప్రదేశాల్లో ముందుగా డంప్ చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా తిరువూరు, విస్సన్నపేట, జగ్గయ్యపేట ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.


మండల స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు సిద్ధం ....

ప్రతి మండల కేంద్రంలో రోడ్ల క్లియరెన్స్, విద్యుత్ పునరుద్ధరణ, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో అత్యవసర స్పందన బృందాలను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఈదురుగాలుల కారణంగా చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన సందర్భాల్లో గరిష్టంగా అరగంటలో రహదారులను క్లియర్ చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడినా ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని తాగునీటి ప్లాంట్ల వద్ద తగినన్ని డీజిల్ జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అవసరమైన అత్యవసర సేవలు నిరంతరాయంగా కొనసాగేందుకు సంబంధిత శాఖలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.


ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు ....

జిల్లాలో తుఫాను పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్‌ను యాక్టివేట్ చేసినట్లు తెలిపారు. మండల స్థాయి స్పందన బృందాల వివరాలు, సహాయక నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అత్యవసర సహాయం అవసరమైనప్పుడు స్థానిక వార్డు లేదా గ్రామ సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని, అలాగే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 91549 70454 కు సమాచారం అందించాలని కోరారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్