44 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగింపు.
నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలి.
ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ కె. దినేష్ కుమార్ సమీక్ష.
ప్రజాశక్తి-రాజవొమ్మంగి (అల్లూరి) : ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.సోమవారం సాయంత్రం వెబెక్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఎన్నికల సన్నద్ధత,భద్రతా ఏర్పాట్లు,నామినేషన్ల ప్రక్రియ,సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో గుర్తించిన 44 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె దినేష్ కుమార్ ఆదేశించారు.ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను తక్షణమే తన ఆమోదానికి సమర్పించి,అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాలని సూచించారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ప్రకటనలు జారీ చేసే సమయంలో ఈ 44 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలను అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేయాలని పేర్కొన్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో లోపల,వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని,వాటి దృశ్యాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం, రంపచోడవరం, చింతూరు సబ్ కలెక్టర్ల కార్యాలయాలకు ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అన్ని మండలాల్లో నామినేషన్ల ప్రక్రియను పూర్తిస్థాయిలో వీడియో చిత్రీకరణ చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కోసం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ (ఎస్ఎస్టీ), ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్(ఎఫ్ఎస్టీ)లను పోలీసు సిబ్బందితో సహా ఏర్పాటు చేసి, వాటికి సంబంధించిన ప్రతిపాదనలను అక్టోబర్ 20వ తేదీలోగా తన ఆమోదానికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.ఎంపీడీవో కార్యాలయాల్లో బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల చట్టబద్ధ, ఇతర సామగ్రి భద్రపరిచే ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీకి వెంటనే లేఖ పంపాలని జెడ్పీ సీఈవోను ఆదేశించారు.ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద కూడా అక్టోబర్ 20వ తేదీ నుంచి పోలీసు భద్రత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాలెట్ పత్రాలు ముద్రించిన అనంతరం వాటిని పోలింగ్ కేంద్రాల స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు భద్రత కోసం లేఖలు పంపాలని సూచించారు.పోస్టల్ బ్యాలెట్ల జారీ ఎంపీడీవో కార్యాలయాల్లో చేపట్టాలని,వాటిని కూడా పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూముల్లో భద్రపరచాలని ఆదేశించారు.ప్రతి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఎన్నికల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌తో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.ఎన్నికల స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సంబంధించిన స్థలాలను ఆయా డివిజన్ల సబ్ కలెక్టర్లు అక్టోబర్ 20వ తేదీలోగా ఖరారు చేయాలని ఆదేశించారు.పోలింగ్ సిబ్బందికి మొదటి దశ ర్యాండమైజేషన్,శిక్షణ అక్టోబర్ 25వ తేదీలోగా పూర్తి చేసి, అదే తేదీన శిక్షణ నిర్వహించాలని,రెండో దశ ర్యాండమైజేషన్ అక్టోబర్ 30వ తేదీలోగా పూర్తి చేసి, అదే రోజున శిక్షణ ఇవ్వాలని సూచించారు.మూడో దశ శిక్షణను నవంబర్ 3వ తేదీన పోలింగ్ సామగ్రి పంపిణీకి ముందుగా నిర్వహించాలని తెలిపారు.రెండో దశ శిక్షణ రోజున సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల్లో పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు,ఇతర పోలింగ్ సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని ఆదేశించారు.ఓటర్లలో చైతన్యం పెంచేందుకు జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు,ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.ప్రతి మండలంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు సహా మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.దివ్యాంగులు,వృద్ధ ఓటర్ల సౌకర్యార్థం వీల్చైర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ప్రతి రోజు క్షేత్రస్థాయి నుంచి సమర్పించాల్సిన నివేదికలపై నిర్దిష్ట షెడ్యూల్‌ను జెడ్పీ సీఈవో రూపొందించి అమలు చేయాలన్నారు.ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో అక్టోబర్ 20వ తేదీన జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశానికి అవసరమైన ఏర్పాట్లను జెడ్పీ సీఈవో చేపట్టాలని ఆదేశించారు.జిల్లాలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి,ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు.







కామెంట్లు (0)