బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పోషణ, గౌరవం, హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం పాడేరులోని శంకరం హాల్‌లో నిర్వహించారు. విద్యాశాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
బాలలకు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలు, బాలల సంరక్షణ వ్యవస్థలు, సమస్యలు ఎదురైనప్పుడు అందుబాటులో ఉన్న సహాయ సేవలపై కల్పించడం పై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్లు బాలల హక్కులు, బాలల రక్షణకు సంబంధించిన వివిధ చట్టాలు, నిబంధనలు, రక్షణ వ్యవస్థల గురించి విద్యార్థులకు వివరించారు. బాలలు తమ హక్కుల గురించి తెలుసుకోవడంతో పాటు, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా సంబంధిత అధికారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బాలల సహాయ వ్యవస్థలను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిషాంతి, మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసినప్పుడే “బాలల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించాలన్నారు. పిల్లలపై శారీరక శిక్షలు, వేధింపులు, వివక్ష వంటి వాటిని పూర్తిగా నివారించాలని, ఏదైనా లేదా ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాల కార్మికత్వం, బాల్యవివాహాలు, అక్రమ రవాణాపై సమన్వయ చర్యల వంటి సమస్యలను నివారించేందుకు పోలీస్, స్త్రీ శిశు సంక్షేమం, విద్య, కార్మిక, రెవెన్యూ తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రత్యేకంగా గిరిజన మారుమూల ప్రాంతాల్లో బాలల హక్కులు, బాల్యవివాహాల నివారణ, బాల కార్మికత్వం, అక్రమ రవాణా, బాలలపై జరిగే దోపిడీపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు.తప్పిపోయిన పిల్లలు, బాలల అక్రమ రవాణా, బలవంతపు పనులు వంటి వాటిపై సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్, మహిళా , శిశు సంక్షేమం, విద్య, కార్మిక తదితర శాఖల మధ్య సమాచార మార్పిడి, సమన్వయం మరింత బలోపేతం చేయాలని సూచించారు.
బాలల ఆరోగ్యం, పోషణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. పిల్లలకు క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారం, రక్తహీనత నివారణ, అవసరమైన టీకాలు, మానసిక ఆరోగ్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన వైద్యం, విద్య, సహాయక పరికరాలు, కౌన్సెలింగ్, ఇతర ప్రత్యేక సేవలు అందించాలని తెలిపారు.పాఠశాలలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన బాలికలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)