ప్రజాశక్తి -సీలేరు
వర్షాలు, వరదల కష్టాల నుంచి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ తోకరాయి గ్రామస్తులు వేడుకున్నారు. అర్నబ్ తుపాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులను స్థానిక ఎస్‌ఐ యాసిన్ కలవగా, తమ సమస్యలను విన్నవించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకున్నారు.
గురువారం ఉదయం దారకొండ పునరావాస కేంద్రంలో ఉన్న తోకరాయి గ్రామస్తులను పరామర్శించిన ఎస్‌ఐ యాసిన్, వారికి అందుతున్న వసతి సౌకర్యాలు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ వరదలు, విపత్తులు వచ్చినప్పుడు అధికారులు పునరావస కేంద్రాలకు తరలిస్తున్నారని, తర్వాత షరామామూలుగా కష్టాల చోటుకు పంపుతున్నారన్నారు. ఏటా ఇదే పరిస్థితి పునరావృతమౌతోంది, తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలేదన్నారు. 2024లో అకాల వర్షాలు, వరదల బీభత్సంలో పంట భూములు ఇల్లు కోల్పోయామని, అప్పట్లో అధికారులు వచ్చి వెళ్లారే తప్ప, నేటీకి తమ సమస్యలకు పక్కా పరిష్కారం చూపలేదన్నారు. సురక్షితమైన చోట తమకు శాశ్వత నివాసాలతోపాటు అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. అనంతరం గంగవరం, మాదిమల్లు వంతెనను ఎస్ఐ పరిశీలించారు. మాదిమల్లు వంతెన కుంగిపోవడంతో ప్రమాదభరితంగా మారిందని స్థానికుల ఆందోళన చెందుతున్నారు.








కామెంట్‌లు (0)