మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కామ్రేడ్ తోరాటి లక్ష్మణ మూర్తి శత జయంతి ఘన నివాళి

1 గంట క్రితం

WhatsApp Image 2026-10-13 at 4.18.21 PM.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 04:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరుడు...

ప్రజాశక్తి-కాకినాడ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని 25 ఏళ్ళ వయసులో అమరుడైన కామ్రేడ్ తోరాటి లక్ష్మణ మూర్తి శత జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, జిల్లా కమిటీ సీనియర్ సభ్యుడు దువ్వ శేషబాబ్జి లు లక్ష్మణ మూర్తి చిత్ర పటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందన్నారు. ఆరోజుల్లో కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు ఆంధ్రా ప్రాంతం నుండి కూడా కొంతమంది యువ కామ్రేడ్స్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొనడానికి వెళ్ళారని తెలిపారు. ఆ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన యువ కిశోరం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని, 1951 అక్టోబర్ 21 వ తేదీన ఉద్యమ విరమణ రోజునే వికారాబాద్ ప్రాంతంలో కాల్చి వేయబడ్డారని తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య రచించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం - గుణపాఠాలు అనే గ్రంథంలో లక్ష్మణ మూర్తి గురించి పేర్కొన్నారన్నారు. 25 ఏళ్ల వయస్సులో అమరుడైన తోరాటి లక్ష్మణ మూర్తి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసుకోవాలని సిపిఎం పిలుపు ఇస్తోందన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు కె. ఎస్. శ్రీనివాస్ తో పాటు, పి. రామకృష్ణ, వి. చంద్రరావు, జె.ఎస్.కె. శ్రీనివాస్, సిహెచ్.‌ సతీష్, ఎం. సుబ్బారావు తదితరులు మాట్లాడుతూ తోరాటి లక్ష్మణ మూర్తి చిన్న నాటి నుండే పోరు మార్గం లో నడిచి ఎర్రజెండా ముద్దు బిడ్డగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చెక్కల రాజ్ కుమార్, జి. ప్రభాకర వర్మ, నగర కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, రూరల్ కమిటీ సభ్యులు టి.‌నాగేశ్వరరావు. సిహెచ్. అజయ్ కుమార్, సిహెచ్. విజయ్ కుమార్ లతో పాటు అనపర్తి ఏడుకొండలు, వెంకట్రావు, చెల్లారావు, చిన్ని, రాణి, సత్యం, సాహిత్, వాసు, తదితరులు పాల్గొనగా మలక వెంకటరమణ వందన సమర్పణ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్