శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కుల వివక్ష లేని సమాజం కోసం పోరాడాలి

1 గంట క్రితం

anakapalle
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే. గోవిందరావు

ప్రజాశక్తి-రావికమతం : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గర్నికం గ్రామంలోని దళిత కాలనీలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే. గోవిందరావు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయినా దళితులు ఇంకా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. చోడవరం నియోజకవర్గంలో దళితులకు ప్రత్యేక స్మశానవాటిక కోసం రెండు ఎకరాల భూమిని కేటాయిస్తూ జీఓ నంబర్‌ 1235 ఉన్నప్పటికీ అమలు కాలేదని పేర్కొన్నారు. సర్వే పేరుతో దళితులు డి.పట్టాలు కలిగి సాగు చేస్తున్న భూములను రెవెన్యూ రికార్డుల్లో గయ్యాళ భూములుగా నమోదు చేస్తున్నారని ఆరోపించారు. దళిత కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులను దళిత కాలనీల అభివృద్ధికి పూర్తిస్థాయిలో వినియోగించడం లేదని అన్నారు. రోలుగుంట మండలం బుచ్చింపేటలో దళితులకు స్మశానవాటిక లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గర్నికం దళిత కాలనీలో ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేసినప్పటికీ నీటి సరఫరా జరగడం లేదన్నారు. అజ్జాపురం పంచాయతీ పరిధిలోని దళిత కాలనీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనుల అభివృద్ధికి అనేక ప్రకటనలు చేస్తున్నప్పటికీ, వారి ప్రాథమిక సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని గోవిందరావు విమర్శించారు. కుల వివక్ష లేని సమాజం కోసం దళితులు, గిరిజనులు ఐక్యంగా పోరాడినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా నాయకులు ఎత్తులో కళ్యాణం, ప్రైవేట్‌ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్