అన్ని వర్గాల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఎపి ఎన్జిఒ సంఘం ప్రధాన అజెండా అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అన్నారు. అనకాపల్లి జిల్లా ఎపి ఎన్జిఒ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. స్థానిక రింగ్ రోడ్డు కూడలి నుంచి నెహ్రూ చౌక్ మీదుగా నూతన కార్యాలయం వరకూ వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నూతన భవన శిలాఫలకాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణతో కలిసి ఆవిష్కరించి, రిబ్బన్ కత్తిరించి మీటింగ్ హాల్ను విద్యాసాగర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్, పార్ట్టైమ్ సహా అన్ని వర్గాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎన్జిఒ సంఘం పనిచేస్తోందన్నారు. డిఎ బకాయిల విడుదలకు సంఘం నిరంతర చర్చలు, కృషి ఫలితంగా ఇటీవల రూ. 1,300 కోట్లకు పైగా పెండింగ్ డిఎ బకాయిలను ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్జిఒ జిల్లా, నగర నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.









కామెంట్లు (0)