ఆదివారం, 01 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనంతపురంలో 500 పడకల కిమ్స్ సవీర ఆసుపత్రి ప్రారంభం

1 గంట క్రితం

00
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 01, 2026, 04:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ముఖ్య అతిథులుగా మంత్రులు సత్యకుమార్ యాదవ్, పయ్యావుల కేశవ్

  • 200 మంది అంధులకు ఉచితంగా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ పంపిణీ

ప్రజాశక్తి – అనంతపురం అనంతపురం నగరంలో కిమ్స్ సవీర ఆసుపత్రిని 250 పడకల నుంచి 500 పడకల సామర్థ్యానికి విస్తరించారు. నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనం, అత్యాధునిక వైద్య విభాగాలను రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన 200 మంది దృష్టిలోపం ఉన్నవారికి ఏఐ సాంకేతికతతో రూపొందించిన స్మార్ట్ గ్లాసెస్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ అత్యాధునిక క్యాన్సర్ చికిత్సా సదుపాయాలతో కూడిన 500 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రావడం అనంతపురం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ జిల్లాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్య సదుపాయాల కల్పన సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఆసుపత్రి పడకల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు 200 మంది అంధులకు ఏఐ స్మార్ట్ గ్లాసెస్ అందించడం అభినందనీయమన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సామాజిక సేవకు వినియోగించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒంకాలజీ విభాగంలో మెడికల్, రేడియేషన్, సర్జికల్ ఒంకాలజీ, హెమటాలజీ, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. లీనాక్ యంత్రం, డిజిటల్ పెట్‌-సీటీ, బ్రాకీథెరపీ, గామా కెమెరా, డిజిటల్ మామోగ్రఫీ వంటి ఆధునిక పరికరాలను ఏర్పాటు చేశారు. మాతా శిశు సంరక్షణ కోసం ప్రత్యేకంగా 'కడల్స్' భవనాన్ని కూడా ప్రారంభించారు. కిమ్స్ హాస్పిటల్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సొంత ప్రాంతంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద 90 శాతానికి పైగా చికిత్సలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్