విద్యార్థిని అభినందించిన మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయశ్రీ
ప్రజాశక్తి - అనంతపురం : దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల చెస్ పోటీలకు అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన మెడికో బి. దీపక్ ఎంపికయ్యారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం తరఫున పోటీల్లో పాల్గొనేందుకు దీపక్ కు అవకాశం లభించింది. యూనివర్సిటీ నుంచి ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు అందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం. విజయశ్రీ తెలిపారు. వచ్చే నెల 2 నుంచి 5వ తేదీ వరకు కాకినాడలోని ఆదిత్య యూనివర్సిటీలో ఈ పోటీలు జరగనున్నాయి. చెస్‌లో దీపక్ కనబరిచిన ప్రతిభ, అద్భుతమైన ఆటతీరు ఆధారంగా యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడం అనంత మెడికల్ కళాశాలకు గర్వకారణమని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. దక్షిణ భారత స్థాయి పోటీల్లోనూ ఇదే స్ఫూర్తితో రాణించి, జాతీయ స్థాయిలో ఛాంపియన్‌గా నిలవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తూ విజయాల దిశగా నడిపిస్తున్న కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం. నరసింహ నాయక్‌ను ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ బి. ఆంజనేయ బాబు నాయక్, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు, ఫిజికల్ డైరెక్టర్ ఎం. నరసింహ నాయక్ తదితరులు పాల్గొని బి. దీపక్‌ను అభినందించారు.







కామెంట్‌లు (0)