ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెన్నై తీరంలో కొత్త రకం సముద్రపు చేప గుర్తింపు

2 గంటల క్రితం

new fish-1.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 04:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై : బంగాళాఖాతంలో కొత్త రకం చిన్న సముద్రపు చేపను జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ) పరిశోధకులు గుర్తించారు. 'సిఫామియా బెంగలెన్సిస్‌' గా నామకరణం చేసిన ఈ చేపను 'బెంగాల్‌ కార్డినల్‌ ఫిష్‌'గా పిలవనున్నారు. జూన్‌ 2022లో చెన్నైలోని కాసిమేడు ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రంలో ట్రాల్‌ చేపల వేటలో అనుకోకుండా చిక్కిన రెండు నమూనాలను పరిశీలించడం ద్వారా ఈ కొత్త జాతిని గుర్తించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని చెన్నైలోని జెడ్‌ఎస్‌ఐ మెరైన్‌ బయాలజీ ప్రాంతీయ కేంద్రానికి చెందిన శ్వేతా బేవురా, బినీష్‌ కె.కె. 'రికార్డ్స్‌ ఆఫ్‌ ది జులాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా' జర్నల్‌లో ప్రచురించారు.


New fish .jpg


ఈ చేప వెండి-బూడిద రంగు శరీరం, మూడు స్పష్టమైన నల్లని అడ్డ చారలు, రెక్కల మొదళ్ల వద్ద లేత నారింజ రంగుతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. తలపై చిన్న నల్లని చుక్కలు కూడా ఉంటాయి. పరిశోధకులు పరిశీలించిన రెండు నమూనాల పొడవు వరుసగా 48.44 మిల్లీమీటర్లు, 41.58 మిల్లీమీటర్లుగా ఉంది. భారతదేశ ఆగ్నేయ తీరంలో 25 నుంచి 35 మీటర్ల లోతున్న చేపల వేట ప్రాంతాల నుంచి వీటిని సేకరించారు. ఈ కొత్త జాతి సిఫామియా ట్యూబిఫర్‌, సిఫామియా ఫస్కోలినేటా అనే మరో రెండు కార్డినల్‌ చేపలను పోలి ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక శరీర నిర్మాణ లక్షణాల ఆధారంగా ఇది భిన్నమైన జాతిగా పరిశోధకులు నిర్ధారించారు. ప్రస్తుతం చెన్నై తీరంలోని 25 నుంచి 55 మీటర్ల లోతున్న జలాల్లో ఈ జాతి ఉన్నట్లు గుర్తించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కనిపించే చిన్న జీవదీప్తి చేపల ప్రజాతికి ఇది చెందినది. ఈ ప్రజాతికి చెందిన చేపలు పగడాలు, సముద్రపు అర్చిన్లు, నక్షత్ర చేపలతో సన్నిహితంగా జీవిస్తాయని అధ్యయనం వెల్లడించింది. ఈ చేపకు వాణిజ్యపరమైన విలువ లేకపోవడంతో ట్రాల్‌ చేపల వేటలో అనుకోకుండా చిక్కినప్పుడు సాధారణంగా పారవేస్తుంటారని పరిశోధకులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్