సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు పులివెందులలో ప్రజాస్వామ్యం వికసించింది : ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

1 గంట క్రితం

Democracy has blossomed in Pulivendula today Government Whip Kalava Srinivasulu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 04:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

రాయదుర్గం (అనంతపురం) : జగన్మోహన్ రెడ్డి వంటి దురహంకారి, నియంతృత్వ ధోరణి కలిగిన నాయకుడిని ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలోనే ప్రజాస్వామ్య శక్తి ఆయనను రోడ్డుపై కూర్చోబెట్టిందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు ముందు కుట్రలు, కుతంత్రాలు, అహంకారం, అరాచక రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడలేవని పులివెందుల ఎన్నికలు మరోసారి నిరూపించాయని స్పష్టం చేశారు. రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా చెదురు ముదురు సంఘటనలు మినహా కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా ముగిశాయన్నారు. జగన్ నియంతృత్వానికి ప్రజాస్వామ్య విలువలకు మధ్య పులివెందులలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయన్నారు. రెండేళ్ల క్రితం జగన్ పార్టీని ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఆయన విపరీత మనస్తత్వంలో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాల దారి మరవలేదన్నారు. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో జగన్ పార్టీని చిత్తుగా ఓడించడానికి ఓటర్లు కంకణ బద్ధులై ఓట్లు వేశారన్నారు. 70 శాతం మంది ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకన్నారంటే అది ప్రజాస్వామ్యానికి ఉన్న విలువ అన్నారు. ముఖ్యంగా పులివెందుల చరిత్రలో సామాన్యుడు తొలిసారి స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోగలిగారన్నారు. పులివెందులలో వైసిపి అభ్యర్థులు నిస్సహాయ స్థితిలో ఉన్నారని వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, వారికి ప్రజాదరణలేదని స్పష్టమవుతుందన్నారు. పులివెందులలో స్థానికులు కాకుండా ఇంకెవరు వచ్చి ఓటు వేస్తానన్నారని ప్రశ్నించారు. జగన్ని నమ్మి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా ఎమ్మెల్యేగా ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. అందుకే ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు వైకాపాను పట్టించుకోలేదని పేర్కొన్నారు. మాజీ సీఎం తన సొంత నియోజకవర్గంలోనే రోడ్డుమీద కూర్చోవాల్సి వచ్చిందంటే అదే ప్రజాస్వామ్య గొప్పతనమని నిరూపితమైందన్నారు. దురహంకారం, నియంతృత్వం జగన్మోహన్ రెడ్డి రూపంలో రూపుదిద్దుకున్నాయన్నారు. వైకాపా ఇప్పటికైనా కుట్రలకు, దురహంకారపూరిత చర్యలకు పులుస్టాప్ పెట్టకపోతే రాష్ట్ర రాజకీయాల్లో ఆపార్టీ భూస్థాపితం కాక తప్పదన్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్య విలువలను, ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ రాజకీయాలు చేయాలని హితవు పలికారు. లేకుంటే 2029 నాటికి వైకాపా రాష్ట్ర రాజకీయాల్లో శూన్యంగా మిగిలిపోక తప్పదని కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో టిడిపి పరిశీలాకులు గుర్రప్ప, రాయదుర్గం వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ యు.హనుమంత రెడ్డి, వైస్ చైర్మన్ మిద్దింటి ధానవేంద్ర, ఉస్మాన్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్