సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నా ఫాలోవర్లకు పిలుపునిస్తే మీ పరిస్థితి ఏంటి ? : మీడియా సంస్థపై అమితాబ్‌ బచ్చన్‌ ఆగ్రహం

1 గంట క్రితం

What will your situation be if I issue a call to my followers Amitabh Bachchan expresses anger at a media outlet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 05:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ సినీ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఓ మీడియా సంస్థ కథనం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ తాను చేసిన పోస్టును తప్పుగా అర్థం చేసుకుని, దానికి వక్రభాష్యం చెబుతూ యుద్ధ హెచ్చరికగా ప్రచారం చేయడంపై మండిపడ్డారు.


అక్టోబర్‌ 29 న అమితాబ్‌ తన ఎక్స్‌ ఖాతాలో ‘హాథీ ఘోడా పల్కీ.. జై కన్హయ్య లాల్‌ కీ..’ అంటూ శ్రీకృష్ణుడిని కీర్తించే భక్తి గీతాన్ని పోస్టు చేశారు. అయితే దీనిపై ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనంలో అమితాబ్‌ తన ప్రత్యర్థులకు సవాల్‌ విసిరినట్లు, వారు ఏనుగులు, గుర్రాలతో వస్తే తాము ఆయుధాలతో పోరాడతామంటూ హెచ్చరించినట్లు పేర్కొంది. ఈ కథనంపై స్పందించిన అమితాబ్ .‌.. భక్తి గీతాన్ని వక్రీకరించడమే కాకుండా, తన వ్యాఖ్యలకు తప్పుడు అర్థాలు ఆపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా సదరు మీడియా సంస్థను ఉద్దేశించి ఆయన ఘాటుగా స్పందించారు. తనకు ఐదు కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారని, తాను ఒక్క పిలుపునిస్తే వారిలో పది శాతం మంది ఆ మీడియా సంస్థను ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు. తన వ్యాఖ్యలను ఎంతగా వక్రీకరిస్తే అంతకంటే వంద రెట్లు ఎక్కువగా తన అభిమానులు స్పందిస్తారని పేర్కొన్నారు.


బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దం వెనుక నుంచి అభిమానులకు అభివాదం ....

అమితాబ్‌ బచ్చన్‌ ప్రతి ఆదివారం ముంబయిలోని తన నివాసం ‘జల్సా’ వద్దకు వచ్చే అభిమానులను పలకరించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నవంబర్‌ 1న కూడా ఆయన అభిమానులకు అభివాదం చేశారు. అయితే ఈసారి బుల్లెట్‌ ప్రూఫ్‌ అద్దం వెనుక నిలబడి అభిమానులకు కనిపించడం చర్చనీయాంశమైంది. ఇటీవల సినీనటుడు టైగర్‌ ష్రాఫ్‌పై ఓ ముఠా కాల్పులకు పాల్పడిన ఘటన నేపథ్యంలో .... ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే అమితాబ్‌ ఈ ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్