- ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి
ప్రజాశక్తి-పుట్లూరు: మండల పరిధిలోని కడవకొల్లు గ్రామంలో ఓటు హక్కుల పరిరక్షణ కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న చలో రాజ్‌భవన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ నిరసనలో ఎన్నికల ప్రధాన కమిషనర్ దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన వెంటనే రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్. సూరి మాట్లాడుతూ, ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించే చర్య అని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ఆ హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు లేకపోతే ప్రజలు తమ అభిప్రాయాన్ని ఎన్నికల ద్వారా పాలకులకు తెలియజేసే ముఖ్యమైన అవకాశాన్ని కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓటర్ల జాబితా నుంచి ఓట్ల తొలగింపుపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్. సూరి డిమాండ్ చేశారు. ఓటు హక్కుల పరిరక్షణ కోసం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, సీఐటీయూ, కేవీపీఎస్ తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ఓటు హక్కులను పరిరక్షించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు: వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి టి. పెద్దయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి జి. వెంకట చౌదరి, బి. భాస్కర్ రెడ్డి, కేవీపీఎస్ మండల కార్యదర్శి కె. నాగభూషణం, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు జె. పెద్దయ్య, రఘువీరా, టి. ఆదినారాయణ, రామా తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)