బుధవారం, 04 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్యోగుల సెలవు హక్కులపై ఆంక్షలు తగవు...

5 గంటల క్రితం

ananta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026, 09:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కమర్షియల్ టాక్సెస్ నాన్‌ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

-15 రోజుల ముందస్తు నోటీసు నిబంధన పేరుతో ఇబ్బందులకు గురిచేయొద్దు

- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బి.వెంకటేష్ బాబు డిమాండ్

ప్రజాశక్తి - అనంతపురం : వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయబద్ధమైన సెలవు హక్కులను పరిరక్షించాలని, 15 రోజుల ముందస్తు నోటీసు నిబంధన పేరుతో అనవసర ఆంక్షలు విధించరాదని కమర్షియల్ టాక్సెస్ నాన్‌ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బి. వెంకటేష్ బాబు డిమాండ్ చేశారు. ఉద్యోగులు వినియోగించుకునే అర్హత కలిగిన సెలవులపై కొంతమంది అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు సమర్పిస్తున్న ఆర్జిత సెలవులు (ఈఎల్‌), అసాధారణ సెలవులు (ఈఓఎల్‌), శిశు సంరక్షణ సెలవుల దరఖాస్తులను తప్పనిసరిగా 15 రోజుల ముందుగానే సమర్పించాలనే విధంగా వ్యవహరించడం సమంజసం కాదని పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి ఆఫీస్ క్యాడర్ వరకు ప్రతి ఉద్యోగికి సర్వీసు నిబంధనల ప్రకారం అర్హత కలిగిన సెలవులను వినియోగించుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు.

వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, కుటుంబ అవసరాలు, అనివార్యమైన వ్యక్తిగత సమస్యలు ఎప్పుడైనా ఎదురుకావచ్చని, అలాంటి సందర్భాల్లో 15 రోజుల ముందస్తు నోటీసు తప్పనిసరి చేయడం ఆచరణ సాధ్యం కాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్వల్ప వ్యవధిలో లేదా అవసరమైన సందర్భాల్లో తదనంతరం సమర్పించే సెలవు దరఖాస్తులను నిబంధనల మేరకు మానవతా దృక్పథంతో పరిశీలించాలని కోరారు.

రాష్ట్ర ఆదాయ వృద్ధి లక్ష్యాల సాధనలో చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ మార్గదర్శకత్వంలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు నిరంతరం అంకితభావంతో, దాదాపు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చడంలో ఉద్యోగులు చేస్తున్న కృషి, శ్రమ, వ్యక్తిగత సమయ త్యాగాలను అధికారులు గుర్తించి గౌరవించాలన్నారు. ఆదాయ వృద్ధికి ఉద్యోగుల అంకితభావం ఎంత ముఖ్యమో, వారి ఆరోగ్యం, సంక్షేమం, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.

పరిపాలనా క్రమశిక్షణ, కార్యాలయాల సజావైన నిర్వహణకు సంఘం వ్యతిరేకం కాదని, అయితే పరిపాలనా సౌలభ్యం పేరుతో ఉద్యోగుల న్యాయబద్ధమైన సెలవు హక్కులను పరిమితం చేయడం తగదన్నారు. ఈ మేరకు చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ కార్యాలయ కార్యదర్శికి సంఘం తరఫున అధికారిక ప్రాతినిధ్యం సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అసిస్టెంట్ కమిషనర్లు, జాయింట్ కమిషనర్లు ఉద్యోగుల సెలవు హక్కులను గౌరవించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరినట్లు వెల్లడించారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవం పరిరక్షణ విషయంలో సంఘం రాజీలేని వైఖరితో పోరాడుతుందని బి. వెంకటేష్ బాబు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్