బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ జగదీష్‌

19 నిమిషాల క్రితం

sp.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నామినేషన్ల కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీసు నిఘా

  • పోలీస్‌ యాక్ట్‌ 30, సెక్షన్‌ 144 అమలు

  • నామినేషన్‌ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరికే అనుమతి

ప్రజాశక్తి – ఆత్మకూరు : స్థానిక సంస్థల ఎన్నికల వేళ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ జగదీష్‌ హెచ్చరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖ పటిష్ఠ చర్యలు చేపడుతోందని తెలిపారు. మంగళవారం ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, ఘర్షణలకు దిగడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్‌ యాక్ట్‌ 30తో పాటు సెక్షన్‌ 144 అమలులో ఉంటాయని తెలిపారు. ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నామినేషన్‌ వేసే అభ్యర్థితో పాటు ఆయనకు మద్దతుగా మరో ఇద్దరు మాత్రమే లోపలికి రావాలని స్పష్టం చేశారు. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా గ్రామాల్లో పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు ఎస్పీ జగదీష్‌ ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయం పరిసరాల్లో భద్రతను పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్‌ఐ, ఎంపీడీవోలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నాగ కిష్టయ్య, డిప్యూటీ ఎంపీడీవో షాదిక్‌ వలి, ఎస్‌ఐ లక్ష్మణరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్