ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్
అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ జస్వంత్ రావు బాధ్యతారాహిత్యం మరోసారి వెలుగుచూసింది. స్పెషల్ ఆఫీసర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వస్తున్న సమాచారం కూడా ఆయన మీడియాకు కనీస సమాచారం ఇవ్వలేదు. ఇదే అంశంపై గురువారం నాడు ప్రజాశక్తి దినపత్రికలో కథనం ప్రచురితం అయ్యిందది. కథనం వెలువడిన గురువారం నాడే స్పెషల్ ఆఫీసర్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చినా సంబంధిత కార్పొరేషన్ ఉన్నతాధికారి మీడియాకు సమాచారం ఇవ్వకపోవడం చూస్తే ఆయన బాధ్యతారాహిత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో కొందరు పాత్రికేయులు కార్పొరేషన్ ఎన్నికల సమాచారం కోసం కార్యాలయంకు రాగా దానిని మీడియా సమావేశంగా చూపించే ప్రయత్నం కార్పొరేషన్ అధికారులు చేశారు. మధ్యాహ్నం 12-15గంటలకు విలేకరుల సమావేశం అంటూ ఆ సమాయానికి కొన్ని నిమిషాల ముందు విలేకరులకు కార్యాలయం నుంచి ఫోన్ చేశారు. ఇదే విషయాన్ని ప్రజాశక్తికి సైతం కమిషనర్ అటెండర్ ప్రశాంత్ సమాచారం ఇచ్చారు. విలేకరుల సమావేశం అంటూ అప్పటికప్పుడు చెప్పడం చూస్తే పత్రిక, ప్రచార మాధ్యమాలపై కమిషనర్కు ఎంతటి గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు.
కార్పొరేషన్ స్పెషలాఫీసర్, కలెక్టర్ కార్పొరేషన్ కార్యాలయానికి గురువారం విచ్చేయగా నగరపాలక సంస్థలో నెలకొన్న పరిస్థితులు ఆయనకు అవగతం అయ్యాయి. సాక్షాత్తు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఆనంద్ కార్యాలయానికి విచ్చేసి గదులను పరిశీలించారు. త్వరలో జరిగే ఎన్నికల నేపథ్యంలో నగరంలోని 62 డివిజన్లలో కార్పొరేటర్లుగా పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే గదులనూ పరిశీలించారు. కార్యాలయంలో చాలా గదులు నెలల తరబడి మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి. స్పెషల్ ఆఫీసర్ తనకు కేటాయించిన ఛాంబర్లో మేయర్ పీఠానికి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే కేంద్రంగా మార్చాలని అధికారులకు సూచించారు. ఈ నిర్ణయంతో ఆరు నెలలుగా మూతబడిన స్పెషల్ ఆఫీసర్ ఛాంబర్ ఎట్టకేలకు తెరుచుకుంది. రెవిన్యూ ఇన్స్పెక్టర్లు విధులు నిర్వహించే చోట ఎన్నికల సామాగ్రిని ఉంచారు. అక్కడే కార్పొరేటర్ అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశారు. సాక్షాత్తు స్పెషల్ ఆఫీసర్ వచ్చి ఎన్నికల ఏర్పాట్లకు రంగం సిద్ధం చేయడం చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరు ఎంత సవ్యంగా ఉందో చెప్పాల్సిన పని లేదు. స్పెషల్ ఆఫీసర్ ఎన్నికలు జరిగే వరకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పాలనపై పర్యవేక్షణ కొనసాగిస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉండే అవకాశం ఉంటుందనే భావన వ్యక్తం అవుతోంది.










కామెంట్లు (0)