ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
ఉమ్మడి జిల్లాలోని శ్రీసత్యసాయి కార్మికులకు నాలుగు నెలలుగా బకాయి వేతనాలు చెల్లించడంతోపాటు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేటి అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెలో వెళ్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి కార్మికులు డిసిఎల్, ఆర్డబ్ల్యుఎస్ఎస్సిలను కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు మాట్లాడుతూ సత్యసాయి తాగునీటి సరఫరా పథకంలో 572 మంది కార్మికులు పని చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 1వతేదీ నుంచి 9వతేదీ వరకూ కార్మికులు నిరవధిక సమ్మె చేపడితే స్పందించిన కలెక్టర్ కార్మికులు వేతనాలు చెల్లించేందుకు విశేష కృషి చేశారన్నారు. ఇందులో భాగంగా వేతనాలు చెల్లింపునకు కార్మికులకు బిఆర్ఒ వచ్చిందన్నారు. అయితే విఆర్ఒ వచ్చినప్పటికీ కార్మికుల ఖాతాలో డబ్బులు మాత్రం జమ కాలేదన్నారు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక కార్మికులు శుక్రవారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు. కార్మికుల సమస్యల పట్ల ప్రజలు గమనించి సమ్మెకు సహకరించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి బకాయి పడ్డ నాలుగు నెలల వేతనాలు గ్రాటిట్యూడ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి కార్మికుల యూనియన్ అధ్యక్షులు జి.మధుసూదన్, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీరాములు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం.హరిప్రసాద్, కోశాధికారి ఎం.వన్నూరప్ప, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)