ప్రేమ వ్యవహారమే కారణమా..? అర్ధరాత్రి అడవిలోకి తీసుకెళ్లి దాడి
ప్రజాశక్తి-మదనపల్లె టౌన్ (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం చిన్నతిప్పసముద్రంలో బీహార్‌కు చెందిన యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం వెలుగుచూసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో యువతి తరపు బంధువులు ఈ దాడికి పాల్పడినట్లు బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే… మదనపల్లె మండలం సీటీఎం ప్రాంతంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న బీహార్‌కు చెందిన ముకేశ్ (20) మదనపల్లెలోని శ్రీనివాస సిమెంట్ అంగడిలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న సమయంలో యువతి తరపు బంధువులుగా భావిస్తున్న ఐదుగురు వ్యక్తులు అతడిని మాట్లాడే పని ఉందంటూ తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. చిన్నతిప్పసముద్రం సమీపంలోని అడవి ప్రాంతానికి తీసుకెళ్లిన అనంతరం ముకేశ్‌పై ప్లంబర్ పైపులతో దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. తెల్లవారుజామున ఒంటి గంట వరకు సుమారు నాలుగున్నర గంటలపాటు విచక్షణారహితంగా కొట్టినట్లు పేర్కొన్నాడు. అనంతరం అతడిని తిరిగి గదికి తీసుకొచ్చి అక్కడే వదిలి వెళ్లినట్లు సమాచారం. అదే గదిలో ఉంటున్న ఇతర బీహార్ యువకులు ముకేశ్ పరిస్థితిని గమనించి సహచరులకు సమాచారం అందించారు. వెంటనే అతడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ముకేశ్ కోలుకుంటున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో దాడికి గల కారణాలు, నిందితుల వివరాలపై విచారణ కొనసాగుతోంది.








కామెంట్‌లు (0)