ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : ఎన్నికల ప్రచారంలో వినియోగించే వాహనాలు, మైకులకు అనుమతుల కోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల మేరకు సువిధ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని పీలేరు రిటర్నింగ్ అధికారి డాక్టర్ జి. శ్రీనివాస నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన పీలేరులో మీడియాతో మాట్లాడుతూ ... ఎన్నికల ప్రచార అనుమతుల కోసం నేరుగా సమర్పించే మాన్యువల్ దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు వాహన అనుమతుల కోసం వాహనం నంబరు, వినియోగ ఉద్దేశం, అనుమతి కోరే కాలపరిమితి, ప్రయాణ మార్గం తదితర వివరాలను సువిధ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్‌సీ), డ్రైవింగ్ లైసెన్స్ ప్రతులను జత చేయాలని అన్నారు. మైకుల వినియోగానికి సంబంధించి ప్రదేశం, తేదీ, సమయం వివరాలను దరఖాస్తులో పొందుపరచాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం పోలీసుల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) తీసుకుని, పరిశీలన కోసం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. అవసరమైన తనిఖీలు, ధ్రువీకరణ పూర్తయిన తర్వాత 24 గంటల్లో అనుమతులు జారీ చేస్తామని వెల్లడించారు. మైకుల వినియోగానికి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు, అలాగే ఎన్నికల నిశ్శబ్ద కాలంలో మైకుల వినియోగానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార వాహనాల ముందు అద్దంపై రిటర్నింగ్ అధికారి జారీ చేసిన అనుమతి స్టిక్కర్‌ను తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. పోలింగ్ రోజున ప్రచార వాహనాలను ఓటర్లను తరలించేందుకు వినియోగించరాదని, ఎన్నికల నిబంధనలను పాటిస్తూ అభ్యర్థులు, రాజకీయ పార్టీలు వాహనాలు, మైకుల అనుమతుల కోసం సువిధ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ జి. శ్రీనివాస నాయుడు సూచించారు.
సువిధ ద్వారానే ప్రచార అనుమతులు.. నేరుగా స్వీకరించబడవు వినతులు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)