- సామ్రాజ్యవాద, నయా ఫాసిస్టు ధోరణులతోనే సంక్షోభాలు
- ఏచూరి స్మారక సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ
కొల్‌కతా: దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ నయా ఫాసిస్టు ధోరణలు పెరిగిపోతుండటం, పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు కొలిక్కిరాకపోవడం పట్ల భారత మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదం గురించి సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ముందే గమనించి ప్రజాస్వామ్య శక్తుల ఐక్యతతోనే సామ్రాజ్యవాద ముప్పును తిప్పికొట్టగలమని పదేపదే చెప్పేవారని ఆయన గుర్తు చేశారు. సీతారాం ఏచూరి ఫౌండేషన్, జ్యోతిబసు సెంటర్ ఫర్ సోషల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యాన కోల్‌కతాలోని ప్రమోద్ దాస్‌గుప్తా మెమోరియల్ ట్రస్ట్ ఆడిటోరియంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ అధ్యక్షతన ఆదివారం సదస్సు నిర్వహించారు. “సామ్రాజ్యవాదం, ప్రజాస్వామ్యం : ప్రపంచ దృక్పథాలు” అనే అంశంపై జరిగిన సెమినార్‌లో హమీద్ అన్సారీ ఆన్‌లైన్‌లో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, భారతదేశంలో క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగ్యులేరా, ప్రముఖ ప్రజా మేధావి మాలినీ భట్టాచార్య, చరిత్రకారుడు, నవలా రచయిత ముకుల్ కేశవన్ కీలకోపన్యాసాలు చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఈ సదస్సును ఉద్దేశించి హమీద్ అన్సారీ ప్రసంగిస్తూ.. జీవితాంతం కమ్యూనిస్టుగా ప్రజల సేవలో తరించిన ఏచూరి ఒకవైపు కమ్యూనిస్టుగా కొనసాగుతూనే మరోవైపు తనతో పరిచయం ఏర్పడిన ప్రతి రాజకీయ నాయకుడితోనూ కామ్రేడ్‌గా మెలిగేవారని, అది ఏచూరికే సాధ్యమైన విలక్షణమని కొనియాడారు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ఏర్పాటులో ఏచూరి కీలక పాత్ర పోషించారని స్మరించుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులకు అంతర్జాతీయ సామ్రాజ్యవాద శక్తుల వినాశకర విధానాలే కారణమని పేర్కొన్నారు. ప్రత్యేకించి క్యూబా, ఇరాన్, పాలస్తీనాలో సామ్రాజ్యవాద శక్తులు విధిస్తున్న అమానవీయ ఆర్థిక ఆంక్షలు, సాగిస్తున్న దాడులు దుర్మార్గమైనవని పేర్కొన్నారు. సామ్రాజ్యవాద శక్తులను, నయా ఫాసిస్టు విధానాలను తిప్పికొట్టాలంటే ప్రపంచంలోని ప్రజాస్వామ్యశక్తులన్నీ ఐక్యం అవ్వాల్సిన అవసరాన్ని అప్పట్లోనే చెప్పారని హమీద్ గుర్తు చేశారు. అలాగే ఏచూరి దేశ విదేశాంగ విధానంపై తరచూ మాట్లాడేవారని చెప్పారు. స్వతంత్ర విదేశాంగ విధానం అవసరమని, భారత్‌ను అమెరికా పెరటిలా మార్చకూడదని, వ్యూహాత్మక సంబంధాల్లో ఆత్మగౌరవాన్ని వదులుకోకూడదని ఆయన పట్టుబట్టేవారని అన్సారీ స్మరించుకున్నారు. పాలస్తీనా విషయంలో తూర్పు జెరూసలేం రాజధానిగా రెండు రాష్ట్రాల పరిష్కారానికి ఏచూరి మద్దతు ఇచ్చారని, ఇజ్రాయెల్ నుంచి ఆయుధ కొనుగోళ్లను నిలిపివేయాలని కూడా కేంద్రాన్ని గట్టిగా కోరారని తెలిపారు. మతపరమైన ఘర్షణల్లో బాధితులకు ఏనాడూ న్యాయం దక్కలేదని ఏచూరి ఆవేదన చెందేవారని, ఇలా ఇంకెంత కాలం అని పార్లమెంటులోనూ నిలదీశారని హమీద్ గుర్తు చేశారు. ఎన్నికల వ్యవస్థను మెరుగుపరచాలని, దామాషా ప్రాతినిధ్యం వైపు వెళ్లే అవసరం గురించి ఏచూరి నొక్కి చెప్పేవారన్నారు. దేశంలో నిజమైన దేశభక్తి కాకుండా నకిలీ భావనాలను పెంపొందిస్తున్నారని, దేశభక్తి అంటే కేవలం ‘జై హింద్’ అని నినాదం ఇవ్వడం దగ్గరే ఆగిపోరాదని, భరతమాత దాస్య శృంఖాలను తెగ్గొంట్టేందుకు ఉరికొయ్యను ముద్దాడిన భగత్‌సింగ్ వంటి యోధులు గర్జించిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ (విప్లవం వర్ధిల్లాలి) నినాదం ప్రాధాన్యత నేడు ఎంతో అవసరమని అన్సారీ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు పోరాటాలు సాగించాల్సిన అవసరం ఏర్పడినప్పుడల్లా భారత రాజకీయాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఐక్య పోరాటాల నిర్మాణంలో ఏచూరి ఎనలేని కృషి చేశారని, అలాగే ఆయన హాస్య చతురత అందరినీ ఆకట్టుకునేందని, అందుకనే ఏచూరి రాజకీయ నాయకులే గాక అశేష ప్రజానీకానికి ఆప్తమిత్రుడిగా నిలిచారని, ఆయనకు ‘లాల్‌సలామ్’ అని హమీద్ నివాళులర్పించారు. పాత్రికేయురాలు, రచయిత్రి సీమా చిష్టి వ్యాఖ్యాతగా రోజంతా జరిగిన ఈ స్మారక కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల నుండి వచ్చిన 168 దరఖాస్తుల నుంచి ఎంపికైన తొమ్మిదిమంది యువ స్కాలర్లు “సామ్రాజ్యవాద నూతన యుగం” అనే అంశంపై ప్రసంగించారు. “మన ప్రాతినిధ్య ఎన్నికల ప్రజాస్వామ్యం భవిష్యత్తు” అనే అంశంపై చర్చలో యువ కార్యకర్తలు ఐషీ ఘోష్, దీప్సితా ధర్, సఖి తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)