ఒకప్పుడు మెదడు అనంత విశ్వాన్ని
గర్భంలో మోసిన నక్షత్రగృహం,
ఇప్పుడు ఎవరో విసిరిన ఆలోచనల కోసం
ఎదురుచూసే ఖాళీ గ్రహం!
ప్రశ్నల అగ్నిపర్వతాలు నిద్రపోయాయి,
జిజ్ఞాస సముద్రాలు ఇంకిపోయాయి,
స్వీయ ఆలోచనల సమాధులపై
పరాయి జ్ఞానపు పూలు పరుస్తున్నాం.
మన ఊహలకు రెక్కలు విరిగాయి
అనుకరణలకు రెక్కలు మొలిచాయి
సృజనాత్మకత ఆత్మహత్య చేసుకున్న చోట
కృత్రిమ మేధస్సు సింహాసనమెక్కింది
మనసనే ప్రయోగశాలలో భావోద్వేగాలన్నీ వడపోసి
మిగిలిన శూన్యానికి వ్యక్తిత్వమనే ముసుగు తొడుగుతున్నాం
ఎవరో రాసిన వాక్యాలకు మన గొంతులు అద్దెకు ఇచ్చి,
ఎవరో గీసిన దారుల్లో మన అడుగుల్ని బందీలుగా మార్చుకున్నాం
అద్దంలో మనిషి కనిపించడం లేదు...
ఒక నకలు మరో నకలును చూస్తోంది
వేల ముఖాల ముసుగుల వెనుక
ముఖం లేని మనిషి మిగిలాడు
ఆలోచనలేని మెదడు ఓటి కుండ
అనుభూతులేని హృదయం శీతల శిల
ప్రశ్నించని బుద్ధి తన బానిసత్వానికి తానే కిరీటం!
యంత్రాలు జ్ఞానాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి
మనుషులు అజ్ఞానాన్ని దిగుమతి చేసుకుంటున్నారు
వేగం పెరిగిన కొద్దీ మనిషి తనలోకి వెళ్లే దారిని కోల్పోతున్నాడు
ఇది యంత్రాల విజయం కాదు..
మానవ వివేకపు పరాజయ మహోత్సవం!
మెదడు ఇంకా కొట్టుకుంటోంది
కానీ ఆలోచనల గుండె ఆగిపోయింది;
శరీరాలు నడుస్తున్నాయి
నీడలు మాట్లాడుతున్నాయి
ఆత్మలు అదృశ్యమయ్యాయి
చివరకు మనిషి తన ప్రతిరూపానికే బానిసై
తన సొంత రూపాన్నే మరచిపోయాడు...!
- డాక్టర్ పెరుగు రామకృష్ణ
98492 30443







కామెంట్లు (0)