ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గమనం గమ్యానికే!

11 నిమిషాల క్రితం

gamanam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026, 03:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

యువతెందుకు రగులుతోంది?

వీధులెక్కి కదం తొక్కుతోంది?

పాలకులపై కత్తులు దూస్తోంది?

దేశ దేశాల్లో ఇదే తీరెందుకైంది?

పాలన తీరులో శృతి మారిందా?

నడత తంతి తెగి గాడి తప్పిందా?


అవును కదా? అవును కదా?

పిందెల్లేని పెట్టుబడి కొలువులు

ఉన్న పనికి చాలని మెతుకులు

ఇళ్ళల్లో సమస్యల ఝంకారాలు

దుకాణాల్లో ధరల ఘీంకారాలు

నీటితో తడిపితే ఆరని కడుపులు

పాలకుల ఏసి మాటల మూటలు

ఎండే బ్రతుకుల్లో ఆగని రోదన

పేదరికం ఎదలో తీరని వేదన

దానికే మార్పు మహోద్యమాలు


పాపం ఆ యవతకేం తెలుసు

కూడిన దేశ దేశాల పెట్టుబడి

కార్పొరేట్లకు పట్టం కట్టిందనీ

కొలువులకు కోతలు పెట్టిందనీ

కష్ట ఫలితానికి నష్టం చేసిందనీ


ఈవాళ తెలీకున్నా పర్వాలేదు

పాలక వీణ తంతుల్లో దూరాక

తెగిన మూలాలు చూడ సాగాక

కార్పొరేట్ల కాచిన తీరు తేలాక

ఆగ్రహం నిగ్రహ పోరయ్యాక

పోరుదిశ మారక ఆగుతుందా?

ప్రపంచీకరణ చల్లిన విషం

పీచమణచక మానుతుందా?

పెట్టుబడిపై ప్రై'వేటు' పెత్తనాన్ని

ప్రశ్నించి ఎదిరించి విదిలించి

తరిమేయక వదులుతుందా?

కొలువులిచ్చే 'సమిష్టి' పెట్టుబడికి

తోరణాలు కట్టక నిలుస్తుందా?

- ఉన్నం వెంకటేశ్వర్లు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్