మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలీసులు నిరుద్యోగులను వెంటాడి వేధించడం అప్రజాస్వామ్యం

1 గంట క్రితం

kakinada
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 04:24 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

శ్యామ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యంపై కక్షపూరిత చర్యలు ఆపాలి

అణగారిన తరగతుల అభ్యున్నతికి కంటగింపా ?

పోలీసు వైఖరిపై విచారణకు కలెక్టర్ ను కోరిన సిపిఎం

ప్రజాశక్తి - కాకినాడ : కానిస్టేబుల్స్, ఎస్సై తదితర పోలీస్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న నిరుద్యోగులను కాకినాడ పోలీసులు వెంటాడి వేదించడాన్ని సిపిఎం తీవ్రంగా తప్పు పట్టింది. సోమవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరుద్యోగులు ప్రభుత్వం ప్రకటించిన వెకెన్సీ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, ప్రభుత్వ హామీ మేరకు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాకినాడలో కూడా వేలాదిమంది నిరుద్యోగులు నగరంలో భారీ ఊరేగింపు, కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. కలెక్టర్ కు స్వయంగా కలిసి వినతిపత్రం ఇచ్చి విజ్ఞప్తి చేశారు. డిఆర్ఓ స్వయంగా నిరుద్యోగుల ధర్నా వద్దకు వచ్చి ప్రభుత్వానికి తెలియపరుస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలైన నిరుద్యోగ యువతీ యువకులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లెక్కి తమ డిమాండ్ ని ప్రభుత్వం ముందు ఉంచడాన్నీ సహించలేకపోయిన కాకినాడ లోని ప్రభుత్వ యంత్రాంగం నిరుద్యోగులపై కక్షపూరిత చర్యలకు దిగడాన్ని సిపిఎం తీవ్రంగా విమర్శించింది. ఈ మేరకు సిపిఎం కాకినాడ రూరల్ కమిటీ నాయకత్వం స్థానిక డిఆర్ఓ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం నుండి తెల్లవార్లు పోలీసులు బృందాలుగా ఏర్పడి శ్యామ్ ఇన్స్టిట్యూట్ హాస్టల్ పైన, ప్రైవేట్ హాస్టల్స్ పైన మూకుమ్మడి దాడి చేసి విద్యార్థులను భయభ్రాంతులను చేసి వారి నుండి ఆధార్ కార్డులు, సెల్ ఫోన్ నెంబర్లు తీసుకొని భయపెట్టడాన్ని అనాగరిక చర్యగా పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్టల్స్ యజమాన్యం భయభ్రాంతులకు గురి కావడం, నిరుద్యోగులు నాన్ లోకల్ కావడంతో పోలీసు హింసకు మానసికంగా కృంగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్యామ్ ఇనిస్ట్యూట్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ ను స్టేషన్ కు పిలిపించుకొని అనేక గంటల పాటు కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సామాజికంగా అణగారిన తరగతికి చెందిన వ్యక్తి ఒక అత్యున్నత కోచింగ్ ఇన్స్టిట్యూట్ ను వృద్ధి చేయడాన్ని సహించలేని శక్తుల పాత్ర ఈ దాడులు వెనుక ఉందనే సందేహాన్ని కలిగిస్తుందన్నారు. శ్యామ్, అనేక మంది నిరుద్యోగులు, విద్యార్థి సంఘం నాయకులపైన కేసులు నమోదు చేయడానికి ప్రభుత్వ ప్రేరేపిత చర్య లేదా పోలీసు అత్యుత్సాహమా? లేక ఇతర శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా? అనే కోణంలో కూడా పూర్తి విచారణ జరపాలని నాగేశ్వరావు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు, నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ కోసం ప్రదర్శన, ధర్నాలు చేయకూడదా అని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తారా అని విమర్శించారు. పోలీసు ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేస్తే పోలీసులపై ఒత్తిడి తగ్గి నేర విచారణలు సులభతరం కావచ్చని అన్నారు. శ్యామ్, నిరుద్యోగులు, సంఘాల నాయకులుపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని, జరిగిన పరిణామాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. డి ఆర్ వో ను కలిసిన అనంతరం శ్యామ్ ఇన్స్టిట్యూట్ యజమాన్యాన్ని , నిరుద్యోగులను సిపిఎం ప్రతినిధి బృందం పరామర్శించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్